ఉద్యోగం చేసేవాళ్లకైనా.. వ్యాపారం చేసేవాళ్లకైనా.. లోన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లోన్ అంటే.. అందులో చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఒకటి ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్. బహుశా దీని గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. అయినప్పటికీ.. బ్యాంకులు ఈ రకమైన లోన్స్ ఎందుకు ఇస్తాయి?, ఎవరికి ఇస్తాయి? అనే విషయాలు ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అంటే?
ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అనేది.. బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థ ముందుగానే అర్హత నిర్ధారించి, ప్రత్యేకంగా ఎంపిక చేసిన కస్టమర్లకు ఆఫర్ చేసే పర్సనల్ లోన్. అంటే కస్టమర్ ప్రత్యేకంగా లోన్ కోసం అప్లై చేయకపోయినా.. లోన్ తీసుకోవడానికి అర్హులు అని చెప్పడం. ఆదాయం, క్రెడిట్ స్కోర్, లావాదేవీలు మొదలైనవాటిని పరిశీలించి.. ఎంత మొత్తంలో లోన్ ఇవ్వవచ్చు అని బ్యాంక్ ముందుగానే ఫిక్స్ చేస్తుంది.
ఈ లోన్ ఎవరికి ఇస్తారు?
బ్యాంకులో ఇప్పటికే అకౌంట్ ఉండే కస్టమర్లకు, జీతం పొందుతున్న లేదా ఉద్యోగం చేస్తున్న వారికి, సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉన్నవాళ్లకు బ్యాంకులు ప్రీ అప్రూవ్డ్ లోన్ ఇస్తుంది. ఒక వ్యక్తి ప్రీ అప్రూవ్డ్ లోన్ పొందటానికి అర్హుడు అని బ్యాంక్ గుర్తించినప్పుడు.. వారికి ఎస్ఎంఎస్, ఈమెయిల్, నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు.
ఈ లోన్ ఆఫర్ కస్టమర్ అంగీకరిస్తే.. సింపుల్ పద్దతిలో లోన్ పొందవచ్చు. దీనికోసం ఎక్కువ డాక్యుమెంట్స్ అవసరం లేదు. చాలా తొందరగా లోన్ మంజూరు అవుతుంది. కొన్ని సందర్భాల్లో బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు.
బ్యాంక్ శాఖకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
బ్యాంక్ ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ ఆఫర్ చేసింది కదా అని.. ముందు వెనుక ఆలోచించకుండా లోన్ తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే మీరు తీసుకునే లోన్ మీద ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి లోన్ తీసుకోవడానికి ముందు.. అన్నీ తెలుసుకుని, తప్పకుండా అవసరం అయితేనే ముందుకు వెళ్లడం మంచిది. లేకుంటే.. భవిష్యత్తులో ఆర్ధిక భారం మోయాల్సి వస్తుంది.


