బ్యాంక్ లాకర్‌లోని బంగారం పోతే.. పరిహారం ఎంత? | Who Pays For The Loss If Gold Is Stolen From Your Bank Locker | Sakshi
Sakshi News home page

బ్యాంక్ లాకర్‌లోని బంగారం పోతే.. పరిహారం ఎంత?

Feb 19 2026 3:00 PM | Updated on Feb 19 2026 3:32 PM

Who Pays For The Loss If Gold Is Stolen From Your Bank Locker

ఢిల్లీలోని కీర్తి నగర్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) బ్రాంచ్‌లో ఒక మహిళ & ఆమె అత్త బ్యాంకు లాకర్‌లో ఉంచిన బంగారు ఆభరణాలు పోయాయని ఆరోపించడంతో, కస్టమర్లలో భయాందోళనలు చెలరేగాయి. దొంగతనం జరిగిందనే పుకార్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో పెద్ద ఎత్తున కస్టమర్లు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. దొంగతనం జరిగింది అనేది కేవలం పుకారు మాత్రమే అని పోలీసులు వెల్లడించారు.

ఈ తరుణంలో.. బ్యాంక్ లాకర్‌లో ఉన్న బంగారం మాయమైతే.. దానికి ఎవరు బాధ్యత వహిస్తారు?, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ఏం చెబుతున్నాయి? అనే ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. దీనికి సమాధానం ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంట్లో రక్షణ ఉండదని చాలామంది తమ వద్ద ఉన్న బంగారం, ఇతర ఖరీదైన డాక్యుమెంట్స్ వంటివి బ్యాంక్ లాకర్‌లో దాచుకుంటారు. ఒకవేళా బ్యాంక్ లాకర్‌లో ఉన్న బంగారం మాయమైతే.. దానికి ఆ బ్యాంకు బాధ్యత వహించదు. ఎందుకంటే.. బ్యాంకులు తమ వస్తువులను భద్రపరచుకోవడానికి లాకర్ సౌకర్యం అందిస్తాయి. ఆ లాకర్‌లో ఏమి ఉంచారనే దానికి సంబంధించిన రికార్డ్ కూడా బ్యాంకు దగ్గర ఉండదు.

రిజర్వ్ బ్యాంక్ నిబంధనల ప్రకారం.. బ్యాంకు సరైన భద్రత కల్పించని పక్షంలో (సీసీ టీవీ పనిచేయకపోవడం, సిబ్బంది తప్పిదం, బ్యాంకు ఉద్యోగుల మోసం) నష్టపరిహారం పొందుతారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. మీరు కోల్పోయిన మొత్తం నష్టపరిహారంగా వస్తుందనుకోవడం పొరపాటే.

2022 ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. బ్యాంక్ తప్పిదం వల్ల నష్టం జరిగితే.. లాకర్ అద్దెకు 100 రెట్లు పరిహారం లభిస్తుంది. అంటే లాకర్ అద్దె ఏడాదికి 5000 రూపాయలు ఉంటే.. రూ. 5 లక్షలు పరిహారం లభిస్తుందన్న మాట. లాకర్‌లో కోట్ల విలువైన వస్తువులున్నా అదే ఫార్ములా ప్రకారం నష్టపరిహారం లభిస్తుంది. ఒకవేళా ప్రకృతి వైపరీత్యాల నష్టం జరిగితే ఎలాంటి నష్టపరిహారం లభించదు. అటువంటి పరిస్థితులలో బ్యాంకులు ఎటువంటి బాధ్యత వహించవు.

లాకర్ ఉపయోగించేవారు తెలుసుకోవాల్సిన విషయాలు
బ్యాంక్ లాకర్‌లో వస్తువులను దాచుకోవాలనుకునేవారు.. లాకర్ అగ్రిమెంట్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. లాకర్‌లో ఏ వస్తువులు ఉంచారో.. వాటికి సంబంధించిన ఫోటోలు మీ దగ్గర ఉంచుకోవాలి. ఖరీదైన వస్తువులకు తప్పకుండా బీమా చేయించుకోవాలి. నష్టం జరిగిన వెంటనే బ్యాంకుకు, పోలీసులకు సమాచారం అందించాలి.

Advertisement
 
Advertisement
Advertisement