‘భారత్‌లో ఏఐ స్పీడ్‌ చూస్తే విస్మయం కలుగుతుంది’ | India AI Impact Summit 2026: Sundar Pichai prospect driverless cabs Indian roads | Sakshi
Sakshi News home page

‘భారత్‌లో ఏఐ స్పీడ్‌ చూస్తే విస్మయం కలుగుతుంది’

Feb 19 2026 2:05 PM | Updated on Feb 19 2026 2:18 PM

India AI Impact Summit 2026: Sundar Pichai prospect driverless cabs Indian roads

భారతదేశంలో ఏఐ వేగం పరంగా కనిపిస్తున్న మార్పు తనను విస్మయానికి గురిచేస్తున్నట్లు ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ అన్నారు. ఒకప్పుడు సాధారణ తీరప్రాంత నగరంగా ఉన్న విశాఖపట్నం నేడు గ్లోబల్ ఏఐ హబ్‌గా రూపాంతరం చెందడం అద్భుతమని చెప్పారు. గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’లో పిచాయ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచ ఏఐ పర్యావరణ వ్యవస్థలో భారత్ పోషిస్తున్న కీలక పాత్రను ఆయన విశ్లేషించారు.

కార్యక్రమంలో భాగంగా తన బాల్యాన్ని, విద్యాభ్యాసాన్ని గుర్తు చేసుకుంటూ పిచాయ్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘నేను విద్యార్థిగా ఉన్నప్పుడు చెన్నై నుంచి ఐఐటీ ఖరగ్‌పూర్ వెళ్లేందుకు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేవాడిని. ఆ ప్రయాణంలో విశాఖపట్నం ఒక నిరాడంబరమైన తీరప్రాంత నగరంగా కనిపించేది. కానీ ప్రస్తుతం అదే నగరంలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల మౌలిక సదుపాయాల పెట్టుబడిలో భాగంగా ఏఐ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. ఆనాడు రైలులో కూర్చున్న ఏ విద్యార్థి కూడా వైజాగ్ ఒక గ్లోబల్ టెక్ హబ్‌గా మారుతుందని ఊహించి ఉండరు’ అని ఆయన పేర్కొన్నారు.

డ్రైవర్‌లెస్ కార్లపై పని..

టెక్నాలజీ రంగంలో గూగుల్ సాధిస్తున్న పురోగతిని వివరిస్తూ తన తండ్రి రేగునాథ పిచాయ్‌తో జరిగిన సరదా సంభాషణను ఆయన పంచుకున్నారు. ‘శాన్ ఫ్రాన్సిస్కోలో మా ‘వేమో’ డ్రైవర్‌లెస్ టాక్సీలో నా తల్లిదండ్రులను తీసుకెళ్లాను. అయితే, భారతదేశంలోని రద్దీగా ఉండే రోడ్లపై ఈ కారు విజయవంతంగా నడిస్తే అప్పుడు నిన్ను మెచ్చుకుంటాను అని నాన్న అన్నారు. దానిపై ఇంకా పని చేస్తూనే ఉన్నాను నాన్న!’ అని చెప్పారు.

భారత ప్రభుత్వ కృషికీ ప్రశంసలు

గత వేసవిలో లక్షలాది మంది రైతులకు ఏఐ ఆధారిత వాతావరణ అంచనాలను పంపడంలో భారత ప్రభుత్వం చూపిన చొరవను పిచాయ్ అభినందించారు. గూగుల్ ‘న్యూరల్ జీసీఎం’ మోడల్ ద్వారా కచ్చితమైన సమాచారాన్ని అందించడం సాధ్యమైందని ఆయన వెల్లడించారు.

యూఎస్-ఇండియా కనెక్ట్

ఈ సదస్సులో పిచాయ్ కొన్ని కీలక అంశాలను వెల్లడించారు.

  • అమెరికా-ఇండియా కనెక్ట్ చొరవలో భాగంగా రెండు దేశాల మధ్య నాలుగు కొత్త వ్యవస్థలతో కూడిన భారీ నెట్‌వర్క్‌ను నిర్మిస్తున్నట్లు చెప్పారు.

  • ఏఐ వల్ల కొన్ని ఉద్యోగాలు ఆటోమేట్ అయినప్పటికీ సరికొత్త ఉపాధి మార్గాలు పుట్టుకొస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

  • ‘20 ఏళ్ల క్రితం యూట్యూబ్ క్రియేటర్ అనే వృత్తి లేదు, కానీ నేడు లక్షలాది మంది అందులో రాణిస్తున్నారు’ అని ఉదాహరించారు.

  • ‘భారతదేశం కేవలం ఏఐని ఉపయోగించుకోవడమే కాదు, ప్రపంచానికి ఏఐ పరిష్కారాలను చూపే స్థాయికి చేరుకుంది’ అని చెప్పారు.

ఇదీ చదవండి: అభిషేక్ బచ్చన్ సక్సెస్ మంత్రం ఇదే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement