బెంగళూరు: బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. పెద్ద వయసులో ఒంటరిగా జీవిస్తున్న వృద్ధ దంపతులను టార్గెట్‌గా చేసుకున్నాడో వ్యక్తి. 70 ఏళ్ల మహిళను హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న నగలతో పారిపోయాడు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు.
వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరుకు చెందిన శోభ, రంగనాథ్ దంపతులు. నెలమంగళలోని హీరాపూర్ ప్రాంతంలోని కోటే బీడీలో నివసిస్తున్నారు. వీరికి పిల్లలు లేరు. పైగా గత 15 ఏళ్లుగా భర్త రంగనాథ్ పక్షవాతంతో బాధపడుతున్నాడు. భార్య శోభ అతణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. సంఘటన జరిగిన రోజు, ఆ జంట తమ దినచర్య ఉదయం వాకింగ్‌కు వెళ్లి ఇంటికి వచ్చారు. ఇదే అదనుగా భావించిన హోల్‌సేల్ దుకాణ యజమాని శివకుమార్ ఇంట్లోకి చొరబడ్డాడు. ఆభరణాల దుకాణ యజమాని కుమార్తె శోభ ఒంటిమీద ఉన్న గొలుసు, గాజులు, ఇతర బంగారు ఆభరణాలను దోచుకున్నాడు. మరికొంత బంగారం, డబ్బు కోసం ఇంట్లో వెతికాడు. దాదాపు రూ. 65 లక్షల విలువైన దాదాపు 450 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేసినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత ఆమె గొంతుకోసి హత్య చేసి అక్కడినుంచి ఉడాయించాడు. ఆ తరువాత ఏమీ తెలియనట్టు ప్రేక్షకుడిగా నటిస్తూ నేరస్థలానికి తిరిగి వచ్చాడు. .
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రంగనాథ్‌కు ఫిజియోథెరపీ చేయడానికి వైద్యుడు ఇంటికి వచ్చినప్పుడు ఈ హత్య విషయం వెలుగు చూసింది. ఫిజియో థెరపిస్ట్ ఇంటికి వచ్చేసరికి శోభ రక్తపుమడుగులో పడి ఉంది. అప్పటికే ఆమె ప్రాణం పోయింది. పక్షవాతంతో బాధపడుతున్న భర్త కూడా ఆమె పక్కనే పడి ఉనన్నాడు. బహుశా ఈ దాడి గురించి తనికి తెలిసి ఉండకపోవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు మోటార్ సైకిల్‌పై పారిపోతున్న దృశ్యాలను గుర్తించారు. స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా శివకుమార్ ఈ హత్యకు పాల్పడి ఉంటాడని నిర్ధారణకు వచ్చారు. శివకుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు మోటార్ సైకిల్, హత్యకు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్‌ను సాక్ష్యంగా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


