అభిషేక్ బచ్చన్ సక్సెస్ మంత్రం ఇదే.. | Global Business Summit 2026, Abhishek Bachchan Shares Insights On Strategic Investments And Brand Endorsements | Sakshi
Sakshi News home page

అభిషేక్ బచ్చన్ సక్సెస్ మంత్రం ఇదే..

Feb 19 2026 12:29 PM | Updated on Feb 19 2026 12:57 PM

Global Business Summit 2026 Abhishek Bachchan comments investments

సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న అభిషేక్ బచ్చన్ ఇప్పుడు వ్యాపార, పెట్టుబడి విభాగంలోనూ వ్యూహాత్మకంగా ఎదుగుతున్నారు. కేవలం లాభాల కోసమో లేదా బ్రాండ్ విలువ కోసమో కాకుండా తాను స్వయంగా వాడే వస్తువులపైనే పెట్టుబడి పెట్టడం ఆయన ప్రత్యేకత. ఇటీవల జరిగిన ‘గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2026’లో పాల్గొన్న అభిషేక్ తన పెట్టుబడి ప్రయాణం, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తండ్రి బాటలో రియల్ ఎస్టేట్..

పెట్టుబడుల విషయంలో తన తండ్రి అమితాబ్ బచ్చన్ ప్రభావం తనపై ఎంతో ఉందని అభిషేక్ అంగీకరించారు. ‘జమీన్ హై తో సబ్ టీక్ హై’ (నేల బాగుంటే అంతా బాగున్నట్లే) అనే నమ్మకాన్నే తాను కూడా అనుసరిస్తున్నట్లు తెలిపారు. స్క్వేర్ యార్డ్స్ డేటా ప్రకారం ముంబై అంతటా అభిషేక్, ఆయన కుటుంబం సుమారు రూ.219 కోట్ల విలువైన పెట్టుబడులను కలిగి ఉన్నట్లు అంచనా. సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌గా బంగారాన్ని ఎంచుకున్న అభిషేక్ తన భార్య ఐశ్వర్య రాయ్ కోసం వెండిలో కూడా పెట్టుబడులు పెట్టినట్లు సరదాగా వ్యాఖ్యానించారు.

అభిషేక్ బచ్చన్ పెట్టుబడి సూత్రం చాలా సరళం. తాను సదరు వస్తువులను వాడితేనే పెట్టుబడి పెడతానని చెప్పారు. 2019లో ప్రారంభమైన ‘నాగిన్ హాట్ సాస్’ బ్రాండ్‌ను అభిషేక్ స్వయంగా రుచి చూసి, తనకు నచ్చడంతో కంపెనీని సంప్రదించి వ్యూహాత్మక భాగస్వామిగా మారారు. థానేలోని ప్రసిద్ధ ‘మామ్లేదార్ మిసాల్’(వంటకం) పట్ల తనకున్న మక్కువతో రోజూ స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసేవారు. ‘నేను మీ సర్వీసుల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తున్నాను. మీ కంపెనీలో నాకు భాగస్వామ్యం ఇవ్వండి’ అని సరదాగా అడిగి అందులోనూ పెట్టుబడి పెట్టినట్లు ఆయన వివరించారు. ఇదే క్రమంలో జెప్టో వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఆయన పెట్టుబడులు కొనసాగుతున్నాయి.

బ్రాండ్ ఎండార్స్‌మెంట్

నేటి కాలంలో సెలబ్రిటీలు ఏదో ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం సర్వసాధారణం. కానీ అభిషేక్ మాత్రం ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. ‘నేను స్వయంగా ఉపయోగించని ఉత్పత్తిని ప్రజలకు అమ్మడం నాకు మోసపూరితంగా అనిపిస్తుంది. అందుకే నేను 20 ఏళ్లుగా ఒమేగా వాచ్‌నే ధరిస్తున్నాను. ఫోర్డ్ బ్రాండ్‌తో పనిచేసినప్పుడు ఫోర్డ్ కారునే నడిపాను. ఇప్పటికీ నా దగ్గర ఐడియా మొబైల్ నంబర్, అమెక్స్ క్రెడిట్ కార్డ్, మోటరోలా ఫోన్ ఉన్నాయి’ అని చెప్పారు.

స్పోర్ట్స్ వెంచర్స్, ఇతర పెట్టుబడులు

కేవలం టెక్, ఎఫ్‌ఎంసీజీ రంగాలు మాత్రమే కాకుండా క్రీడారంగంలోనూ అభిషేక్ పెట్టుబడులున్నాయి. ప్రో కబడ్డీ లీగ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు యజమానిగా వ్యవహరిస్తున్నారు. చెన్నైయిన్ ఎఫ్‌సీ.. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ క్లబ్‌లో సహ యజమానిగా ఉన్నారు. సచిన్ టెండూల్కర్‌తో కలిసి వహ్దమ్ టీ గ్లోబల్ బ్రాండ్‌కు మద్దతునిస్తున్నారు.

ఇదీ చదవండి: యూఎస్‌-ఇరాన్‌ యుద్ధ భయాలు.. ఒక్కసారిగా క్రూడ్‌ ధరలు..

Advertisement
 
Advertisement
Advertisement