లైఫ్‌ సైన్సెస్‌లో సహకారం | CM Revanth Held Meeting With Global Companies Representatives | Sakshi
Sakshi News home page

లైఫ్‌ సైన్సెస్‌లో సహకారం

Feb 18 2026 5:48 AM | Updated on Feb 18 2026 5:48 AM

CM Revanth Held Meeting With Global Companies Representatives

గ్లోబల్‌ కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్‌ , మంత్రి శ్రీధర్‌ బాబు

గ్లోబల్‌ కంపెనీల ప్రతినిధులు, ఎగ్జిక్యూటివ్‌లతో సీఎం రేవంత్‌ 

ఫ్యూచర్‌ సిటీలో జీసీసీల కోసం ప్రత్యేక జోన్‌ ఏర్పాటునకు ప్రతిపాదన

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో పెట్టుబడులు, కంపెనీలు పెట్టాలనుకునే గ్లోబల్‌ ఇన్వెస్టర్లకు అన్ని రకాల సహాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌ మహానగరంలో ఇప్పటికే ఎన్నో లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలు తమ జీసీసీ (గ్లోబల్‌ కెపాబిలిటీ సెంటర్‌)లను ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. ఫ్యూచర్‌ సిటీలో జీసీసీల కోసం ఒక ప్రత్యేక జోన్‌ ఏర్పాటునకు రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు.

మంగళవారం హైటెక్స్‌లో 23వ బయో ఆసియా సదస్సు–2026 ప్రారంభమైన సందర్భంగా... లైఫ్‌ సైన్సెస్‌లో గ్లోబల్‌ కంపెనీల ప్రతినిధులు, ఎగ్జిక్యూటివ్‌లతో రేవంత్‌ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, టీజీఐఐసీ చైర్మన్‌ నిర్మల జగ్గారెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సంజయ్‌ కుమార్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలు తెలంగాణలో తాము పెట్టదలచుకున్న పెట్టుబడులను ప్రకటిస్తూ ఒప్పందాలు చేసుకున్నాయి.

ఇవీ ఒప్పందాలు 
ఫ్రాన్స్‌లో తన ప్రపంచ ప్రధాన కార్యాలయంతో సనోఫీ నుంచి విడిపోయిన గ్లోబల్‌ కన్సూ్యమర్‌ హెల్త్‌కేర్‌ కంపెనీ అయిన ఒపెల్లా హెల్త్‌కేర్, తన జీసీసీ కార్యకలాపాలను 42,000 చ.అ సౌకర్యంతో విస్తరిస్తోంది. వచ్చే ఏడాదిలోపు 500 ఉద్యోగాలను కల్పించనుంది. 

జీఏపీఎఫ్‌ఏ ఇండోనేషియా విభాగమైన... వాక్సిండో యానిమల్‌ హెల్త్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, జీనోమ్‌ వ్యాలీలో అత్యాధునిక బీఎస్‌ఎల్‌3 వ్యాక్సిన్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రం కోళ్లు, పశువులు, ఆక్వాకల్చర్‌ కోసం వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేయడంపై దృష్టి పెడుతుంది. 

ఏఐ, డేటా సైన్స్‌ కంపెనీగా పేరొందిన ట్రెడెన్స్‌ ఐఎన్సీ.. ఏఐ ఆధారిత హెల్త్‌ కేర్, లైఫ్‌ సైన్సెస్‌పై కీలక సేవలు అందించిన సంస్థ, తన కార్యకలాపాలను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం 18వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, దీనిలో ప్రపంచ స్థాయి కార్యకలాపాలను నిర్వహించనుంది. దీంతో ఏఐ ఆధారిత హెల్త్‌ కేర్‌ రంగంలో మరింత ఆధునికత రానుంది. 

భారత లైఫ్‌ సైన్సెస్‌ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆర్‌ఎక్స్‌ ప్రొపెల్లెంట్‌ హైదరాబాద్‌లోని జీనోమ్‌ వ్యాలీలో భారీ స్థాయిలో ఫార్మాట్‌ లైఫ్‌ సైన్సెస్‌ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌ 12 ఎకరాల స్థలంలో 1 మిలియన్‌ చదరపు అడుగుల అడ్వాన్డ్స్‌ ల్యాబ్, మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది.  

Advertisement
 
Advertisement
Advertisement