న్యూఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇండియా ఇంపాక్స్ ఎక్స్‌పోకు సందర్శకులు పోటెత్తుతున్నారు. వారితో పాటు పలు అంతర్జాతీయ దిగ్గజ ఏఐ కంపెనీల సీఈఓలు తదితరులతో బుధవారం ఎక్స్‌పో వేదిక, స్టాళ్లు కళకళలాడాయి. ఏఐ భవితవ్యంతో పాటు పలు కీలక అంశాలపై ఔత్సాహికులతో ప్రముఖులంతా తమ అభిప్రాయాలను పంచుకుంటూ కని్పంచారు. అంతేగాక సరికొత్త స్టార్టప్‌లు, పెట్టుబడులు తదితరాలకు సంబంధించి పలు ఏఐ కంపెనీల సీఈఓలు ఈ సందర్భంగా కీలక ప్రకటనలు చేశారు.
సముద్రగర్భంలో ఇండో–యూఎస్ కేబుల్
రూ.272 కోట్లతో ఏఐ సైన్స్ చాలెంజ్ ∙
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటన
భారత్‌లో దాగున్న అపారమైన ఏఐ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టడమే తమ లక్ష్యమని ఐటీ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. భారత్, అమెరికా మధ్య ఏఐ కనెక్టివిటీని మరింత పెంపొందించే లక్ష్యంతో సముద్రగర్భంలో కేబుల్ మార్గాలు ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఏఐ ఎక్స్‌పో వేదిక వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘2 కోట్ల మంది ప్రభుత్వోద్యోగులకు ఏఐ శిక్షణ ఇస్తాం. ఇందుకోసం కర్మయోగి భారత్ పథకంలో గూగుల్ భాగస్వామి కానుంది. అంతేగాక 1.1 కోట్ల మంది విద్యార్థులకు ఏఐ నైపుణ్య సాధనలో మద్దతుగా నిలుస్తుంది. గూగుల్ ఏఐ ప్రొఫెషనల్ సరి్టఫికెట్ కోర్సులు అందజేస్తుంది. దీనికోసం 10 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌తో సమన్వయంతో గూగుల్ పని చేస్తుంది’’అని వెల్లడించారు.
కృత్రిమ మేధను మన జీవితకాలాల్లో చోటుచేసుకుంటున్న అతి పెద్ద పరిణామంగా పిచాయ్ అభివరి్ణంచారు. అలాంటి కీలక రంగంలో భారత్ శరవేగంగా దూసుకుపోతోందంటూ పిచాయ్ ప్రశంసించారు. భిన్న రంగాల్లో ప్రపంచ స్థాయి ఏఐ పరిశోధనలను ప్రోత్సహించేందుకు రూ.272 కోట్లతో ‘ఏఐ ఫర్ సైన్స్ ఇంపాక్ట్’చాలెంజ్‌ను ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఏఐ సామర్థ్యాలను మరింతగా ఒడిసిపట్టేందుకు గూగుల్ డీప్‌మైండ్ సాయంతో ఐఐటీ మద్రాస్‌తో పాటు పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో పని చేస్తున్నట్టు తెలిపారు. గూగుల్ ఏఐ మోడ్ ఇప్పటికే 200 దేశాల్లో 35 పై చిలుకు భాషల్లో అందుబాటులోకి వచ్చిందని గుర్తు చేశారు. మున్ముందు వాయిస్, కెమెరా ఆధారిత రియల్‌టైమ్ లైవ్ సెర్చ్ వంటి అధునాతన ఆప్షన్లను కూడా తేనున్నట్టు వెల్లడించారు.
మోదీతో పిచాయ్ భేటీ
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీతో పిచాయ్ భేటీ అయ్యారు. భారత్‌లో వ్యవసాయం, ఆరోగ్యంతో సహా అన్ని రంగాల్లోనూ సమగ్రాభివృద్ధికి ఏఐ వాడకంలో గూగుల్ పోషిస్తున్న కీలక పాత్రపై మోదీతో చర్చించా. సమాచారాన్ని అన్ని భాషల్లోనూ అందుబాటులోకి తేవడం, స్టార్టప్‌లకు దన్నుగా నిలవడం వంటివి కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఏఐలో భారత్ చేస్తున్న కృషి, ఈ రంగంలో విద్యార్థులు, ఉద్యోగుల నైపుణ్యాల పెంపులో గూగుల్ పాత్ర గురించి చర్చించాం’’అని వివరించారు. పిచాయ్‌తో భేటీ ఫలప్రదంగా సాగినట్టు ఎక్స్ పోస్టులో మోదీ పేర్కొన్నారు.
పదేళ్లలో రూ.45 లక్షల కోట్లు!
మైక్రోసాఫ్ట్ ఏఐ పెట్టుబడి ప్రణాళికలు
కృత్రిమ మేధ రంగంలో వచ్చే పదేళ్లలో గ్లోబల్ సౌత్‌లో ఏకంగా రూ.45 లక్షల కోట్ల (50 బిలియన్ డాలర్ల) మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ ప్రకటన చేసింది. గ్లోబల్ సౌత్‌లో ఏఐ యాక్సెస్‌ను మరింత విస్తరించేందుకు ఈ నిధులను వెచ్చిస్తామని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్, సంస్థ వైస్ చైర్మన్ నటాషా క్రాంప్టన్ ఈ మేరకు వెల్లడించారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పోలో వారు మాట్లాడారు. ‘‘గ్లోబల్ సౌత్‌తో పోలిస్తే ఉత్తరార్ధ గోళంలో ఏఐ వాడకం దాదాపు రెండింతలుగా ఉంది. ఈ అంతరాన్ని పూడ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’అని తెలిపారు. కీలకమైన ఈ సవాలును ఏఐ సదస్సు అజెండాలో కీలకంగా ఉంచడం అభినందనీయమని స్మిత్ అన్నారు. తద్వారా సరైన సమయంలో దీన్ని తెరపైకి తేవడం తీసుకొచ్చారన్నారు. విద్యుత్ సదుపాయం విషయంలో కూడా దక్షిణ, ఉత్తరార్ధ గోళాల నడుమ శతాబ్దానికి పైగా అంతరాలు కొనసాగాయని ఆయన గుర్తు చేశారు.
ఏఐ అంతరాలు పెరిగితే వర్ధమాన దేశాలకు ఆర్థిక వృద్ధి తదితర అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వెలిబుచ్చారు. మౌలిక సదుపాయాలు, నైపుణ్య పెంపు, భిన్న భాషల్లో ఏఐ అభివృద్ధి, స్థానిక ఇన్నొవేషన్లు, ఏఐ అడాప్షన్ మెజర్‌మెంట్... ఇలా తమ భారీ పెట్టుబడులను ఐదంచెల్లో వెచ్చిస్తామని స్మిత్ వెల్లడించారు.ఒక్క గత ఆర్థిక సంవత్సరంలోనే భారత్, మెక్సికో సహా మొత్తం గ్లోబల్ సౌత్‌లో మౌలిక సదుపాయాల డేటా సెంటర్లపై మైక్రోసాఫ్ట్ ఏకంగా రూ.72 వేల కోట్లు వెచ్చించినట్టు తెలిపారు. క్లౌడ్, ఏఐ, డిజిటల్ స్కిల్లింగ్ తదితరాలపై ఈ ఏడాది రూ.18 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. 2030 నాటికి భారత్‌లో 2 కోట్ల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తామని ప్రకటించారు. అలాగే దేశవ్యాప్తంగా 2 లక్షల సంస్థలకు చెందిన 20 లక్షల మంది టీచర్లకు ఏఐ సామర్థ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘ఎలివేట్ ఫర్ ఈక్వేటర్స్’కార్యక్రమాన్ని కూడా స్మిత్ ఈ సందర్భంగా ప్రకటించారు.
వర్సిటీలతో జట్టు: ఓపెన్‌ఏఐ
కృత్రిమ మేధ విస్తృతిని రెండు చేతులతోనూ అందిపుచ్చుకునేందుకు భారత్‌కు చెందిన ప్రఖ్యాత విద్యా సంస్థలతో కలిసి పని చేస్తామని ఐఏ దిగ్గజం ఓపెన్‌ఏఐ ప్రకటించింది. ‘‘మేనేజ్‌మెంట్, ఆరోగ్యం, ఇంజనీరింగ్ వంటి పలు రంగాల్లో యువతలో, విద్యార్థుల్లో ఏఐ సామర్థ్యాలను విస్తృతంగా పెంపొందించడమే మా లక్ష్యం. ఇందుకోసం ఆయా ఉన్నత విద్యా సంస్థలతో భాగస్వామ్యం అవుతాం’’అని ఓపెన్‌ఏఐ విద్యా విభాగం సారథి రాఘవ్ గుప్తా వెల్లడించారు. తొలి దశలో ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం అహ్మదాబాద్, ఎయిమ్స్–న్యూఢిల్లీ, మనిపాల్ అకాడెమీ, యూపీఈఎస్, పెరల్ అకాడెమీతో జట్టు కట్టనున్నట్టు తెలిపారు. తద్వారా వచ్చే ఏడాది కాలంలో లక్ష మందికి పైగా విద్యార్థులు, బోధన సిబ్బందిని ఏఐ, సంబంధిత టూల్స్ వాడకంల నిష్ణాతులుగా తీర్చిదిద్దాలన్నది తమ ఉద్దేశమని చెప్పారు.
‘‘ప్రస్తుతం మానవ వనరులపై ఆధారపడుతున్న కోర్ స్కిల్స్‌లో కనీసం 40 శాతం 2030 నాటికి ఏఐ ఆధారితంగా మారిపోతాయని పలు అధ్యయనాలు నొక్కిచెబుతున్నాయి. కనుక అందుకు తగ్గట్టుగా మన భావి తరాలను ఏఐ నైపుణ్యాలతో తీర్చిదిద్దుకోవడం తప్పనిసరి. ఇందులో విద్యా సంస్థలదే కీలక పాత్ర’’అని గుప్తా అభిప్రాయపడ్డారు. తమతో భాగస్వామ్యానికి ఓపెన్‌ఏఐ ముందుకు రావడం పట్ల ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం అహ్మదాబాద్, ఎయిమ్స్ ఢిల్లీ హర్షం వెలిబుచ్చాయి. ఎడ్‌టెక్ వేదికల రూపకల్పన నిమిత్తం ఫిజిక్స్‌వాలా, అప్‌గ్రేడ్ వంటి విద్యా సంస్థలతో కూడా ఓపెన్‌ఏఐ జట్టు కట్టనుందని గుప్తా తెలిపారు.
నైపుణ్యానికి ఏఐ ప్రత్యామ్నాయం కాదు
ఎయిర్‌బస్ ఇండియా చీఫ్ యురిగన్
కృత్రిమ మేధ ఎంతగా విస్తరించినా మానవ నైపుణ్యానికి అది ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదని ఎయిర్‌బస్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు యురిగన్ వెస్టర్‌మెయిర్ అభిప్రాయపడ్డారు. అయితే మానవ సామర్థ్యాల పెంపుదలకు ఏఐ ఎంతగానో తోడ్పడుతుందని గుర్తు చేశారు. ఏఐని ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక అంతరాలను పూడ్చే వంతెనగా చూడాలని అభిప్రాయపడ్డారు.
ఎయిర్‌బస్ ఇండియా చీఫ్ యురిగన్
కృత్రిమ మేధ ఎంతగా విస్తరించినా మానవ నైపుణ్యానికి అది ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదని ఎయిర్‌బస్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు యురిగన్ వెస్టర్‌మెయిర్ అభిప్రాయపడ్డారు. అయితే మానవ సామర్థ్యాల పెంపుదలకు ఏఐ ఎంతగానో తోడ్పడుతుందని గుర్తు చేశారు. ఏఐని ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక అంతరాలను పూడ్చే వంతెనగా చూడాలని అభిప్రాయపడ్డారు.
అంతరిక్ష కార్యకలాపాల్లో కృత్రిమ మేధ వాడకానికి అవకాశాల అన్వేషణ తదితరాలకు భారత అంతరిక్ష రంగ కంపెనీ ఇన్‌స్పేస్ రూ.6 కోట్ల గ్రాంట్ ప్రకటించింది. ఇన్‌స్పేస్ తాలూకు సీడ్ ఫండ్ పథకం ‘ఏఐ ఇన్‌సై్పర్డ్’(ఇన్నొవేటింగ్ స్పేస్ ప్రోగ్రాం విత్ ఇంటలిజెంట్ రెజీలియంట్ ఇంజన్స్ డెవలప్‌మెంట్) కింద ఈ నిధులను అందజేయనున్నట్టు సంస్థ డైరెక్టర్ వినోద్‌కుమార్ వెల్లడించారు. ఎంపిక చేసిన సంస్థలకు ఈ ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. దీర్ఘకాలికంగా దేశ ప్రాథమ్యాలకు అవసరమైన ఏఐ పరిష్కరాలను అభివృద్ధి చేసే సంస్థలకు గ్రాంట్ అందిస్తాం. కనీసం ఆరు సంస్థలను ఎంపిక చేస్తాం. ఒక్కో సంస్థకు గరిష్టంగా రూ.కోటి మేరకు చెల్లిస్తాం’’అని ఆయన వివరించారు.
భారత యువతకు సువర్ణావకాశం
డీప్‌మైండ్ సీఈఓ హస్సబిస్
కృత్రిమ మేధ వృద్ధికి సారథులుగా మారే సువర్ణావకాశం భారత యువత ముందుందని గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హస్సబిస్ అభిప్రాయపడ్డారు. సరికొత్త ఏఐ టూల్స్‌లో తిరుగులేని నైపుణ్యం సాధించడమే అందుకు కీలకమని సూచించారు. వచ్చే పదేళ్లలో ఇది భారత్‌ను అన్ని రంగాల్లోనూ సూపర్ పవర్‌గా నిలుపుతుందని జోస్యం చెప్పారు. ఇండియా ఏఐ ఎక్స్‌పో వేదికగా ఔత్సాహికులతో ఆయన ముచ్చటించారు. సాంకేతికత నానాటికీ అనూహ్య మార్పులకు లోనవుతున్న నేపథ్యంలో యువత తమ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. ‘‘భారత్‌లో దాగున్న ఎనలేని శక్తి సామర్థ్యాలు చూసి ఎంతో ముచ్చటేస్తోంది. ముఖ్యంగా ఏఐ విషయంలో ఇక్కడి యువత సానుకూల భావనతో ఉరకలెత్తుతోంది. రానున్న దశాబ్దాల్లో ఇది భారత్‌కు గొప్ప సానుకూలత కానుంది’’అని అభిప్రాయపడ్డారు.


