ఇండియాకు ఎప్పుడు వస్తానో చెప్పలేను: విజయ్‌ మాల్యా | India return uncertain due to bar on leaving UK | Sakshi
Sakshi News home page

ఇండియాకు ఎప్పుడు వస్తానో చెప్పలేను: విజయ్‌ మాల్యా

Feb 19 2026 4:31 AM | Updated on Feb 19 2026 8:49 AM

India return uncertain due to bar on leaving UK
  • బాంబే హైకోర్టుకు తెలియజేసిన విజయ్‌ మాల్యా  

ముంబై: భారత్‌కు కచ్చితంగా ఎప్పుడు తిరిగి వస్తానో చెప్పలేనని పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని బాంబే హైకోర్టుకు తెలియజేశారు. స్వదేశానికి రావడా నికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని తెలిపారు. భారత ప్రభుత్వం రద్దు చేసిన తన పాస్‌పోర్టును పునరుద్ధరించుకోవడంలో ఇబ్బందులు ఉన్నట్లు వెల్లడించారు.

యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) ను విడిచిపెట్టి వెళ్లిపోకుండా చట్టపరంగా నిషేధించారని, ఇంగ్లండ్, వేల్స్‌ కోర్టులు ఆదేశాలిచ్చాయని గుర్తుచేశారు. ఈ మేరకు విజయ్‌ మాల్యా స్టేట్‌మెంట్‌ను ఆయన తరఫు న్యాయవాది అమిత్‌ దేశాయ్‌ బాంబే హైకోర్టు నివేదించారు. విజయ్‌ మాల్యా 2016 నుంచి యూకేలోనే ఉంటున్నారు. 

తనను ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడి’గా గుర్తిస్తూ ఇచ్చిన ఉత్తర్వును, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్ల చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ విజయ్‌ మాల్యా గతంలో బాంబే హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.

 భారత్‌కు కచ్చితంగా ఎప్పటిలోగా తిరిగి వస్తారో చెప్పాలని విజయ్‌ మాల్యాను ఆదేశించింది. స్వదేశానికి వచ్చి విచారణను ఎదుర్కొనే ఉద్దేశం ఉందా? లేదా? అని నిలదీసింది. లేకపోతే ఆయన పిటిషన్లను తిరస్కరిస్తామని తేల్చిచెప్పింది. దీనిపై విజయ్‌ మాల్యా తాజాగా స్పందించారు. స్వదేశానికి ఎప్పుడు వస్తానో చెప్పలేనన్నారు. భారతీయ బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లు రుణంగా తీసుకొని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టినట్లు విజయ్‌ మాల్యాపై అభియోగాలు నమోదైన సంగతి తెలిసిందే.    

Advertisement
 
Advertisement
Advertisement