తిరువనంతపురం: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో జనవరి 14న జరగనున్న మకరవిలక్కు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (ఏడీఎం) అరుణ్ ఎస్ నాయర్ తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా బారికేడ్ల నిర్మాణం, ఇతర సౌకర్యాల పనులు కూడా పూర్తయ్యాయన్నారు. కాగా కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు, ఉత్సవాల రద్దీని నియంత్రించేందుకు దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యపై అధికారులు కఠినమైన పరిమితులను విధించారు.
మకరవిలక్కు(మకర జ్యోతి) పర్వదినం సందర్భంగా భక్తుల సంఖ్యను అధికారులు క్రమబద్ధీకరించారు. జనవరి 13న వర్చువల్ క్యూ ద్వారా 35,000 మందికి, స్పాట్ బుకింగ్ ద్వారా 5,000 మందికి అవకాశం కల్పించనున్నారు. ప్రధాన ఉత్సవం రోజైన జనవరి 14న ఈ సంఖ్యను వర్చువల్ క్యూ ద్వారా 30,000కు పరిమితం చేశారు. ఇక జనవరి 15 నుండి 18 వరకు ప్రతిరోజూ 50,000 మందికి వర్చువల్ క్యూ ద్వారా, 5,000 మందికి స్పాట్ బుకింగ్ ద్వారా అనుమతి కల్పించారు. జనవరి 19న తిరిగి భక్తుల సంఖ్యను 30,000కు తగ్గిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
పందళం నుండి జనవరి 12న ప్రారంభమయ్యే తిరువాభరణ ఊరేగింపు జనవరి 14న సన్నిధానానికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో జనవరి 14న ఉదయం 10 గంటల నుండి నిలక్కల్-పంబ మార్గంలో, ఉదయం 11 గంటల నుండి పంబ-సన్నిధానం మార్గంలో భక్తుల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. అలాగే జనవరి 12 ఉదయం నుండి జనవరి 15 మధ్యాహ్నం వరకు హిల్ టాప్ వద్ద ప్రైవేట్ వాహనాల పార్కింగ్‌ను నిషేధించారు. దీంతో భక్తులు తమ వాహనాలను నిలక్కల్ వద్దే పార్క్ చేయాల్సి ఉంటుంది. ఎరుమేలి అటవీ మార్గంలో కూడా జనవరి 13 సాయంత్రం రాకపోకలపై ఆంక్షలు విధించారు.
భక్తుల రద్దీని తట్టుకునేందుకు ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు అల్పాహారం, తాగునీటి సౌకర్యాలను కల్పిస్తోంది. పోలీస్ విభాగం భారీ క్రౌడ్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను రూపొందించగా, ఆర్‌ఏఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్ తదితర కేంద్ర బలగాల మద్దతుతో అదనపు సిబ్బందిని మోహరించారు. భక్తుల రవాణా కోసం సుమారు వెయ్యి కేఎస్‌ఆర్‌టీసీ బస్సులను అందుబాటులో ఉంచారు. అటవీ ప్రాంతాల్లో అనధికారిక గుడిసెలు వేయడం, వంట చేయడంపై కఠిన నిషేధం విధించామని, పోలీస్, అటవీ, ఫైర్ ఫోర్స్ బృందాలు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తాయని ఏడీఎం తెలిపారు.
ఇది కూడా చదవండి: 108 అశ్వాలతో ప్రధాని మోదీ శౌర్య యాత్ర


