శబరిమల బంగారం చోరీ కేసులో సీనియర్ నటుడు జయరామ్‌ని సిట్ విచారించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టితో కలిసి జయరామ్ పలు పూజల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి మధ్య సంబంధం గురించి సిట్ ఆరా తీసినట్లు సమాచారం.
శుక్రవారం చెన్నైలోని జయ్‌రామ్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు.. ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఉన్నికృష్ణన్ పొట్టితో సంబంధం ఏంటి?. ఎలా పరిచయం? ఇద్దరి మధ్య ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా? అని ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేశారు. మలయాళంలో సీనియర్ నటుడు అయిన జయరామ్.. తమిళ, తెలుగు, కన్నడ చిత్రాల ప్రేక్షకులకూ సుపరిచితుడే.
శబరిమల ప్రధాన ఆలయం ద్వారపాలక (కాపలాదారు) విగ్రహాలు మరియు శ్రీకోవిల్ (గర్భగృహం) తలుపు ఫ్రేమ్‌ల నుండి బంగారం పోయినట్లు ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త ఉన్నికృష్ణన్ పొట్టి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. అయితే..

పొట్టితో కలిసి నటుడు జయరామ్ పలు పూజల్లో పాల్గొన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పూజలు బంగారం పూత మాయం అయిన తర్వాతే జరిగాయని నిర్ధారించుకున్న సిట్.. ఇద్దరి మధ్య సంబంధాలపై ఆరా తీసినట్లు స్పష్టమవుతోంది.
ఇప్పటిదాకా ఈ కేసులో మొత్తం 12 మందిని అరెస్ట్ చేసింది సిట్. ఇక.. ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు పాలక మండలి మాజీ సభ్యులు మురారి బాబు, శ్రీకుమార్‌లు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. నిర్ణీత కాల వ్యవధిలో(90 రోజుల) సిట్ వీళ్లపై అభియోగాలకు చార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడంతో బెయిల్ మంజూరు అయ్యింది. మరోవైపు ప్రధాన నిందితుడు పొట్టికి కూడా బెయిల్ లభించినప్పటికీ.. మిగతా కేసుల కారణంగా ఇంకా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.


