పథనంతిట్ట: శబరిమల బంగారం దొంగతనం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆంధ్రప్రదేశ్ లింకులను ఆరా తీస్తోంది. అంతేకాకుండా.. ఈ కేసులో సినీనటుడు, జయరాం వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది.
సిట్‌లోని అత్యంత విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. శబరిమల బంగారం తస్కరణ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి చెన్నై, బెంగళూరులోని శ్రీరాంపూర్‌లోని అయ్యప్ప ఆలయాలకు బంగారు పూత పనులు చేయించారు. చెన్నైలోని ఆలయానికి బంగారు పూతకు అయిన ఖర్చును ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఖర్చు చేసినట్లు సిట్ గుర్తించింది. ఆలయ కుటీర ద్వారాలను కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే తయారు చేసినట్లు తేల్చింది.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తులకు.. ఈ కేసుకు సంబంధాలపై సిట్ ఆరా తీస్తోంది. మరోవైపు చెన్నై ఆలయంలో బంగారు పూత చేయించాక జరిపిన పూజాకార్యక్రమాల్లో సినీనటుడు జయరాం పాల్గొన్నట్లు సిట్ నిర్ధారించింది. ఈ నేపథ్యంలో నటుడు జయరాం వాంగ్మూలం సేకరించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో జయరాంను సంప్రదించింది. విచారణకు ఆయనకు అనుకూలమైన తేదీలను చెప్పాలని కోరింది. ఆ తేదీల్లో జయరాంను ప్రశ్నిస్తామని పేర్కొంది.
కాగా.. ఈ కేసులో ఇప్పటికే ఉన్నికృష్ణన్‌తోపాటు.. తొమ్మిది మంది అరెస్టయ్యారు. దేవాదాయ శాఖ మాజీమంత్రి సురేంద్ర పాత్రపైనా సిట్ ఆరా తీస్తోంది. ఈ కేసులో తాజాగా అరెస్టయిన దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ పాస్‌పోర్టును సిట్ సీజ్ చేసింది. ఆయన ఇంట్లో జరిపిన తనిఖీల్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పత్రాలను సీజ్ చేసింది.
బీజేపీ సీరియస్..
శబరిమల బంగారం చోరీ అంశంపై బీజేపీ సీరియస్ అయ్యింది. ఈ కేసులో నిందితులెవరినీ అయ్యప్ప స్వామి వదిలిపెట్టబోరని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ అన్నారు. ఇప్పటి వరకు అరెస్టయిన వారంతా కమ్యూనిస్టులు, నాస్తికులేనని వ్యాఖ్యానించారు. దేవాలయాలను ధ్వంసం చేసినప్పుడే తమ మనుగడ ఉంటుందని కమ్యూనిస్టులు భావిస్తారని ఆయన ఎద్దేవా చేశారు. కోళికోడ్‌లో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అటు బీజేపీ కేరళ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఈ కేసులో కేంద్రం జోక్యం చేసుకుంటుందని ప్రకటించారు.
ఆదివారం ఆయన పథనంతిట్టలో మీడియాతో మాట్లాడుతూ.. భక్తులకు సదుపాయాలు కల్పించడంలో సీఎం పినరయి విజయన్ విఫలమైన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ దృష్టి సారించాల్సి ఉంటుందని హెచ్చరించారు. శబరిమల బంగారం చోరీ అనేది పినరయి విజయన్‌కు తెలియకుండా జరిగిన అంశమేమీ కాదన్నారు. ఇదో రాజకీయ కుట్ర అని విమర్శించారు. శబరిమలకు సంబంధించి గడిచిన 30 ఏళ్ల ఆడిట్ రిపోర్టును విజిలెన్స్‌తో తనిఖీ చేయించాలని డిమాండ్ చేశారు.


