గౌహతి బార్ అసోసియేషన్ వివాదంపై సీజేఐ వ్యాఖ్య
ఇంటిగ్రేటెడ్ కోర్టు కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేసిన జస్టిస్ సూర్యకాంత్
గౌహతి: అస్సాంలోని గౌహతిలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ జ్యుడీషియల్ కోర్ట్ కాంప్లెక్స్‌ను గౌహతి హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులు వ్యతిరేకించడం పట్ల భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) సూర్యకాంత్ విస్మయం వ్యక్తం చేశారు. ఈ కోర్ట్ కాంప్లెక్స్‌కు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ..మౌలిక సదుపా యాల కల్పనను వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం అడ్డుకోవడం సరికాదని ఆయన స్పష్టం చేశారు.
వ్యవస్థ అభివృద్ధి చెందుతున్నప్పుడు, అది అందరికీ మేలు చేస్తుందని, కేవలం కొందరి సౌలభ్యం కోసం ఆధునీకరణను ఆపకూడదని అభిప్రాయపడ్డారు. వాస్తవాలు తెలియకనే కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తాను భావిస్తున్నానన్నారు. గౌహతిలోని రంగమహల్‌లో రూపుదిద్దుకునే ఈ సముదాయం భవిష్యత్తు ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందన్నారు. ఇందులో అత్యాధునిక సాంకేతికత, ఈ–కోర్టులు, లాయర్లు, కక్షిదారుల కోసం మెరుగైన వసతులు ఉంటాయని తెలిపారు.
దేశ అత్యున్నత న్యాయాధికారిగా, ఈ వృత్తిలోకి కొత్తగా వస్తున్న యువ న్యాయవాదుల అవసరాలను తీర్చాల్సిన బాధ్యత తనపై ఉందని జస్టిస్ సూర్య కాంత్ నొక్కి చెప్పారు. యువ లాయర్లు సమర్థంగా పనిచేయడానికి మెరుగైన లైబ్రరీలు, ఇంటర్నెట్ సదుపాయం, అనుకూల వాతావరణం కల్పించడం ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ కర్తవ్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతోపాటు సీఎం హిమంత బిశ్వ శర్మ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌహతి నగరం నడిబొడ్డున ఉన్న హైకోర్టును 25 కిలోమీటర్ల దూరంలోని మరో ప్రాంతానికి తరలించడాన్ని బార్ కౌన్సిల్ వ్యతిరేకిస్తోంది.
కాంప్లెక్స్ ప్రత్యేకతలు
అస్సాంలోని గౌహతి ఉత్తర ప్రాంత కామ్ రూప్ జిల్లాలో 49 ఎకరాల విస్తీర్ణంలో మొదటి దశలో రూ.479 కోట్ల ఈ సముదాయం ఏర్పాటు కానుంది. ఇందులో, గౌహతి హైకోర్టుతోపాటు జిల్లా కోర్టు భవనాలు, హైకోర్టు కార్యాలయం, బార్ అసోసియేషన్ భవనం ఉంటాయి. గౌహతి హైకోర్టు అస్సాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగా ల్యాండ్‌లకు కూడా హైకో ర్టుగా పనిచేస్తుంది. ఈ సముదాయంలో 900 వరకు కార్లు, 400 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ వసతి ఉంది. సముదాయంలోని అన్ని భవనాలను కలుపుతూ వంతెనలు, అత్యాధునిక భద్రతా వ్యవస్థ, ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ సురక్షితంగా ఉండేలా డిజైన్ చేశారు.


