కార్పొరేట్ ప్రపంచంలో పెద్ద స్థాయిలో వెలిగిన మహిళ... లక్షలాది రూపాయలు వచ్చే ఉద్యోగాన్ని వదిలి తోలుబొమ్మలాటనే కెరీర్‌గా ఎంచుకుంటుందా? మహానగరాలను కాదనుకొని మారుమూల పల్లెల్లోకి వెళుతుందా? ‘అవును’ అని చెప్పడానికి కచ్చితమైన సమాధానం... కలిత
అసోంలోని హజో అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన ద్రిషన కలిత చిన్నప్పటి నుంచి తోలుబొమ్మలాటను చూస్తూ పెరిగింది. అసోంలో ‘పుటోల నాస్’ అని పిలవబడే తోలుబొమ్మలాట తరతరాలుగా మగవాళ్లకే పరిమితం అయింది. ‘తోలుబొమ్మలాట మగవాళ్లు మాత్రమే ఆడాలి’ అనే సంప్రదాయాన్ని కలిత బ్రేక్ చేసింది.
‘తోలుబొమ్మలాట నేర్చుకోవడం కష్టమే. అయితే నాకు ఉన్న ఆసక్తి కారణంగా కష్టమైనా సరే....ప్రతి అంశం గురించి వివరంగా నేర్చుకున్నాను’ అంటుంది కలిత. ఆరేళ్ల వయసు నుంచే అస్సామీ, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ భాషలు మాట్లాడే కలిత దిల్లీలో కార్పొరేట్ రంగంలో ఏడు సంవత్సరాలు పనిచేసింది. అయితే ఆమెకు ఆ ఉద్యోగం అంతగా సంతృప్తి ఇవ్వలేదు.
తన మాతృరాష్ట్రం కోసం ఏదైనా చేయాలనిపించి సామాజిక మార్పు కోసం తోలుబొమ్మలాటను ఉపయోగించుకోవాలి’ అనే లక్ష్యాన్ని ఏర్పర్చుకుంది. ఢిల్లీ నుంచి గౌహతికి తిరిగి వచ్చిన కలిత తనలాంటి తోలుబొమ్మలాట అభిమానులతో ఒక గ్రూప్ ఏర్పాటు చేసింది. ‘ఎన్నో కుటుంబాల్లో భార్యాభర్తలు తగాదా పడుతుంటారు.
అయితే ఆ ప్రభావం పిల్లలపై ఎంత ప్రతికూలంగా పడుతుందో వారు తెలుసుకోలేకపోతున్నారు’ అంటున్న కవిత తోలుబొమ్మలాట ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కలిగించడం మొదలు పెట్టింది. మరోవైపు అసోం అపురూప జానపద కథలను ఈతరం పిల్లలకి తోలుబొమ్మలాట ద్వారా పరిచయం చేయడం ప్రారంభించింది. జానపదానికి సామాజిక అంశం జోడించింది.
కలిత బలం... మహిళలు. ఎన్నో గ్రామాల్లోని మహిళలు కలితకు అభిమానులుగా మారారు. తమ గ్రామాలలో ప్రదర్శన ఇవ్వాల్సిందిగా ఆహ్వానించారు. ఒక గ్రామానికి చేరుకోగానే కలిత బృందం చేసే పని....ఆ గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. స్థానికంగా ఉన్న మూఢనమ్మకాల గురించి తెలుసుకోవడం. వీటిని దృష్టిలో పెట్టుకొని, అందుకు అనుగుణంగా తోలుబొమ్మలాటను మార్చేది కలిత.
మద్యపానం వల్ల జరిగే నష్టం నుంచి అక్షరాస్యత వల్ల కలిగే ప్రయోజనాల వరకు ఎన్నో అంశాలపై మారుమూల పల్లెల్లో సైతం తోలుబొమ్మలాట ద్వారా ప్రచారం చేస్తోంది కలిత. తేయాకు తోటల్లో పనిచేసే మహిళా కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారు. పనిచేస్తున్న చోట ఎన్నో అసౌకర్యాలు ఉన్నాయి.
వారి సమస్యలను తోలుబొమ్మలాట ద్వారా వెలుగులోకి తీసుకువచ్చింది. కేవలం తోలుబొమ్మలాట మాత్రమే కాకుండా తన థియేటర్ గ్రూప్ ద్వారా రకరకాల సామాజిక అంశాలపై స్ట్రీట్ ప్లేలు, స్కిట్స్ ప్రదర్శిస్తోంది. యువత కోసం వర్క్‌షాప్‌లు నిర్వహిస్తూ అందరి చేతా శభాష్ అని అనిపించుకుంటోంది.
(చదవండి: టెర్రస్.. కామన్ ఏరియానే! అందరికీ హక్కు ఉంటుంది! )


