ఐదు సంవత్సరాల క్రితం మేము ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ కొన్నాము. మొత్తం తొమ్మిది ఫ్లాట్లు ఉంటాయి. నాలుగు అంతస్తులు, 8 ఫ్లాట్లు + పెంట్ హౌస్. భూమి యజమాని బిల్డర్‌తో ఒప్పందం చేసుకొని రెండు ఫ్లాట్లు – పెంట్‌హౌస్‌ని తనకోసం కేటాయించుకున్నారు. మేడ పైకి మాకు ఎవరికీ ప్రవేశం లేకపోయినప్పటికీ, కొంతమంది సోలార్ ప్యానల్స్, డిష్ టీవీ యాంటినాలు, ఇంటర్నెట్ కేబుల్ బాక్స్ వగైరా ఉండటం వల్ల అవసరమైనప్పుడు మేడ పైకి రావడానికి అనుమతి ఇస్తుంటారు. ఇప్పుడు కొన్ని ఫ్లాట్ ఓనర్లతో విభేదాలు రావడంతో సోలార్ ప్యానల్ తో సహా సామాగ్రి అంతా తీసేయమంటున్నారు. అదేమని అడిగితే పెంట్‌హౌస్‌తోపాటు ఐదవ అంతస్తు మొత్తం అతనిదే అని, అలాగే డెవలప్‌మెంట్ అగ్రిమెంట్‌లో కూడా రాసి ఉందని అంటున్నాడు. మేము మా సామాగ్రి తీసేయవలసినదే అంటారా?
– రమేష్ రెడ్డి, హైదరాబాదు
బాల్కనీలు, మెట్లు, వరండా, మేడ/టెర్రస్ వంటివి కామన్ ఏరియా అంటే అందరికీ హక్కు ఉన్న సాధారణ ప్రదేశం కిందకి వస్తాయి. టెర్రస్ అనేది ఇంటిని/బిల్డింగును కాపాడుతుంది కాబట్టి అది ఏ ఒక్కరి సొంతము కాకూడదు. రెరా చట్టం, 2016లో కూడా టెర్రస్ (మిద్దెపై ఖాళీ ప్రదేశం) ను కామన్ ఏరియాగా మాత్రమే పరిగణిస్తారు. కామన్ ఏరియాను అందరికీ ఉపయోగపడేలాగా ఉంచాలి తప్ప ఏ ఒక్కరికి ప్రత్యేకంగా ఇవ్వడానికి వీల్లేదు అని చాలా సందర్భాలలో పలు కోర్టులు తేల్చి చెప్పాయి. కాబట్టి పెంట్‌హౌస్ ఉంది అన్న నెపంతో మిమ్మల్ని మేడపైకి రానివ్వను – మీ సోలార్ ప్యానల్స్, డిష్ టీవీ బాక్సులు ఉండనివ్వను అనటం కుదరదు. ఒకవేళ డెవలప్‌మెంట్ అగ్రిమెంట్‌లో ఇలాంటి నిబంధన ఏదైనా ఉన్నప్పటికీ అది చట్టరీత్యా చెల్లదు:
ఎందుకంటే చట్టంలో కామన్ ఏరియాను చట్టంలో చెప్పిన విధంగానే వాడవలసి ఉంటుంది కాబట్టి. అయితే మంచో చెడో, అగ్రిమెంట్ పత్రాలలో ఇలాంటి చట్ట వ్యతిరేకమైన నిబంధనలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి –ఎవరైనా చట్టం తెలిసిన మధ్యవర్తులను నియమించుకుని ఆ టెర్రస్‌లో ఉండే వారితో సంధి కుదుర్చుకుని వారికి అర్థమయ్యేలాగా చెప్పి చూడండి. పరిస్థితి తీవ్రం అవుతోందని అనుకుంటే సివిల్ కోర్టు నుంచి తగిన రక్షణ కోరవచ్చు. అయితే మధ్యవర్తిత్వం ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకోవడం ఉత్తమం. అలాంటి ప్రయత్నాలు విఫలమైతే కోర్టు ఉండనే ఉంది!
– శ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )
(చదవండి: అరుదైన పెళ్లి: ట్విన్ సిస్టర్స్‌ని పెళ్లాడిన ట్విన్ బ్రదర్స్..!)


