ఇల్లు కొనే సమయంలో వచ్చే సందేహాలు.. | Apartment Area Calculation Explained For Homebuyers | Sakshi
Sakshi News home page

ఇల్లు కొనే సమయంలో వచ్చే సందేహాలు..

Jan 17 2026 3:30 PM | Updated on Jan 17 2026 4:01 PM

Apartment Area Calculation Explained For Homebuyers

అపార్ట్‌మెంట్, గేటెడ్‌ కమ్యూనిటీలలో ఇల్లు కొనే సమయంలో విస్తీర్ణానికి సంబంధించి చాలా అయోమయం ఉంటుంది. డెవలపర్లు కార్పెట్‌ ఏరియా, బిల్టప్‌ ఏరియా, సూపర్‌ బిల్టప్‌ ఏరియా, సేలబుల్‌ ఏరియా అనే చెబుతుంటే.. చాలా మందికి వీటిపై అవగాహన ఉండదు. బిల్డర్‌ చెప్పే ఇంటి విస్తీర్ణంలో ఏయే ఏరియాలు కలిసుంటాయి? మనం కొనే ఇంటి విస్తీర్ణంలో కామన్‌ ఏరియా పోనూ మనకు వచ్చే ఏరియా ఎంత? మనం ఇంటి కోసం వెచ్చించే డబ్బులకు మన ఫ్లాట్‌లో ఎంత ఏరియా వస్తుంది? ఇలాంటి సందేహాలను ఈ కథనంతో నివృత్తి చేసుకుందాం.. -సాక్షి, సిటీబ్యూరో

సాధారణంగా ఇల్లు కొనే సమయంలో ప్రాంతం, బడ్జెట్‌ తర్వాత అందరూ చూసేది ఇంటికి సంబంధించిన విస్తీర్ణాన్నే. వారి అవసరాలకు అనుగుణంగా ఎంత మేర విస్తీర్ణంలో ఇల్లు కావాలనేది నిర్ణయించుకుంటారు. అయితే ఇల్లు కొనుగోలు చేసేందుకు వెళ్తే వారికి కార్పెట్‌ ఏరియా, బిల్టప్‌ ఏరియా, సూపర్‌ బిల్టప్‌ ఏరియా, సేలబుల్‌ ఏరియాలపై అవగాహన ఉంటే తమ కుటుంబ అవసరాలకు ఆయా విస్తీర్ణం సరిపోతుందో లేదో నిర్ణయించుకునే వీలుంటుంది. అలాగే మనం వెచి్చంచే ఇంటికి ఎంత మేర విస్తీర్ణంలో ఇల్లు వస్తుందనే అంశంపై స్పష్టత వస్తుంది.

మామూలుగా గేటెడ్‌ కమ్యూనిటీ అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్‌ను కొనుగోలు చేసే సమయంలో కార్పెట్‌ ఏరియా ప్రధానమైనది. ఇంటికి 
సంబంధించి బయటి గోడలను మినహాయించి ఇంటి లోపల ఉండే విస్తీర్ణం మొత్తం కార్పెట్‌ ఏరియా కిందికి వస్తుంది. ఇంటి లోపల ఉండే గోడలు దీని పరిధిలోకి వస్తాయి. హాల్, పడక గదులు, వంట గది, స్నానాల గదులు వరకు కార్పెట్‌ ఏరియాగా పరిగణిస్తారు. అంటే మనం కొనే ఇంటికి ఎంత మేర కార్పెట్‌ ఏరియా వస్తుందో లెక్కలేసుకుంటే ఆ విస్తీర్ణం మన కుటుంబ సభ్యుల అవసరాలకు సరిపోతుందో లేదో నిర్ణయించుకోవచ్చు.

ఆ తర్వాత ఇంటికి సంబంధించి ప్రధానమైంది బిల్టప్‌ ఏరియా. కార్పెట్‌ ఏరియాతో పాటు ఇంటి బయటి గోడలు, బాల్కనీలు బిల్టప్‌ ఏరియా పరిధిలోకి వస్తాయి. బిల్డర్లు మొత్తంగా కొనుగోలుదారులకు విక్రయించేది సూపర్‌ బిల్టప్‌ ఏరియాగా చెప్పుకోవాలి. అంటే బిల్టప్‌ ఏరియాతో పాటు మిగిలిన ఇళ్లకు ఉమ్మడిగా ఉపయోగించే కారిడార్లు, మెట్లు, లిఫ్ట్‌ మార్గాలు, క్లబ్‌ హౌస్‌ వరకు విస్తీర్ణంలో సదరు ఫ్లాట్‌ వాటా కలిపి లెక్కిస్తారు. ఇంటి కొనుగోలుదారులకు ఫైనల్‌గా ఈ విస్తీర్ణాన్నే విక్రయిస్తారు కాబట్టి దీన్నే సేలబుల్‌ లేదా సూపర్‌ బిల్టప్‌ ఏరియాగా పరిగణిస్తుంటారు. అంటే మనం బిల్డర్‌ నుంచి కొనే మొత్తం ఇంటి విస్తీర్ణంలో మన ఇంటి విస్తీర్ణానికి సంబంధించిన కార్పెట్‌ ఏరియా సుమారుగా 70 శాతంగా వస్తుంది.

ఇలా లెక్కించండి..
ప్రస్తుతం గేటెడ్‌ కమ్యూనిటీలలో డెవలపర్లు వసతులకే పెద్దపీట వేస్తున్నారు. దీంతో సహజంగానే 30 శాతం విస్తీర్ణం ఉమ్మడి అవసరాలకు పోతుంది. అంటే మనం బిల్డర్‌ నుంచి కొనుగోలు చేసే మొత్తం ఇంటి విస్తీర్ణంలో 30 శాతం కామన్‌ ఏరియా కలుపుకొని సూపర్‌ బిల్టప్‌ ఏరియాను లెక్కేసుకోవాలి. ఉదాహరణకు బిల్డర్‌ దగ్గర 2,000 చ.అ. విస్తీర్ణంలో ఫ్లాట్‌ తీసుకుంటే.. ఇంటి లోపల వచ్చే కార్పెట్‌ ఏరియా సుమారుగా 1,400 చ.అ.లు మాత్రమే ఉంటుందన్నమాట.

ఉదాహరణకు మనం చ.అ.కు రూ.10 వేలు చొప్పున 2 వేల చ.అ. ఫ్లాట్‌ను కొనుగోలు చేద్దామనుకుందాం. ఈ లెక్కన మనం వ్యక్తిగతంగా వినియోగించే 1,400 చ.అ. కార్పెట్‌ ఏరియాకు మనం చెల్లించాల్సిన సొమ్ము మొత్తం రూ.1.40 కోట్లు. కానీ, మనం బిల్డర్‌కు చెల్లించేది మాత్రం చ.అ.కు రూ.10 వేలు చొప్పున 2 వేల చ.అ. ఫ్లాట్‌కు రూ.2 కోట్లు చెల్లిస్తాం. అంటే మన కార్పెట్‌ ఏరియాకు మనం చెల్లించే సొమ్ము చ.అ.కు రూ.14,285లకు పెరిగిందన్నమాట.

మిగిలిన సొమ్ము బిల్టప్, కామన్‌ ఏరియాలకు చెల్లించామన్నమాట. కాబట్టి అపార్ట్‌మెంట్‌ లేదా గేటెడ్‌ కమ్యూనిటీలలో ఇంటిని కొనుగోలు చేసే సమయంలో మనం చెల్లించే సొమ్ముకు, మనకు వచ్చే విస్తీర్ణం ఎంతనేది డెవలపర్ల నుంచి స్పష్టత తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement