నేను చాలా కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాను. దగ్గర్లోని ప్రైవేట్ హాస్పిటల్‌కి వెళ్ళగా నాకు ఒక అరుదైన జబ్బు ఉందనీ, దానికి చికిత్సగా నామీద ప్రయోగాత్మకంగా కొన్ని మందులు వాడితే పనిచేయవచ్చునని చెప్పారు. అంతేకాదు, ఆ మందులు నామీద ప్రయోగించడానికి ఉచిత వైద్యం చేస్తాం అని చెప్పారు. నేను పెద్దగా చదువుకోలేదు. దాంతో వారి మాటలను గుడ్డిగా నమ్మాను. వారు నాతో తియ్యగా మాట్లాడుతూ ప్రతివారం నాకు కొన్ని కొత్త మందులు ఇచ్చేవారు. అంతేకాదు, హాస్పిటల్‌కి వెళ్లడానికయ్యే ఖర్చులు కూడా ఇచ్చేవారు. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత నాకు నొప్పి ఎక్కువ అవడంతో వేరే డాక్టర్ దగ్గరికి వెళ్లాను.
కిడ్నీలలో సమస్య మొదలైంది అని చెప్పి నేను వాడుతున్న మందులు మొత్తం పరిశీలించి వాటిని వెంటనే ఆపేయమని చెప్పారు. కొన్ని నెలల తర్వాత నాకు కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయి. అందుకు ఆ హాస్పిటల్ వాళ్లు నా మీద ప్రయోగించిన మందులే కారణమని తేలింది. ఇదేమిటని సదరు ఆస్పత్రి వారిని ప్రశ్నిస్తే– ‘నువ్వు మాకు అంగీకార పత్రం ఇచ్చావు కదా.. మేము నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని’ నన్నే బెదిరించారు. అది నేను అంగీకరించే చేశాను కాబట్టి నాకు ఎటువంటి పరిష్కారం లేదంటారా?
– రవి, హైద్రాబాద్
మీ మీద ప్రయోగించిన మందులు ఒకవేళ ఆ ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు నిర్దేశించిన ప్రమాణాలు, ఎథిక్స్ కమిటీ (నైతిక కమిటీ) ఆమోదం పొంది, తగిన జాగ్రత్తలు తీసుకొని – మీ పూర్తి అంగీకారం, అలాగే మీతో పాటుగా ఎవరైనా కుటుంబ సభ్యులు గానీ – సన్నిహితుల వద్ద కానీ పొంది తగిన జాగ్రత్తలు తీసుకొని ప్రయోగించవచ్చు. అది కూడా ఒకవేళ మీకు ప్రాణాపాయం ఉంది అనుకుంటే వెంటనే ఆపేయవలసి ఉంటుంది. మీరు పెద్దగా చదువుకోలేదని చెప్తున్నారు కాబట్టి మీ హాస్పిటల్ రికార్డులు మొత్తం తీసుకుని ఎవరైనా చట్టం తెలిసిన వారితో కలిసి రాష్ట్ర వైద్యమండలి (మెడికల్ కౌన్సిల్) లో ఫిర్యాదు చేయవచ్చు.
అలాగే మీకు జరిగిన నష్టానికి గాను పూర్తి పరిహారం చెల్లించవలసిందిగా కోరుతూ మీరు సివిల్ కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. అందుకు తగిన పత్రాలు ఏం కావాలో దగ్గర్లోని న్యాయనిపుణులను కలిస్తే వారు మీకు సూచిస్తారు. అంతేకాకుండా ఇందులో ఏదైనా నేర దృక్పథం ఉంటే కూడా తగిన క్రిమినల్ చట్టాల కింద కూడా కేసు నమోదు చేసే ఆస్కారం ఉంది. పూర్తి వివరాలతో న్యాయ నిపుణుల – వైద్య నిపుణుల సలహా తీసుకుంటే పరిష్కారం లేకపోలేదు.
– శ్రీకాంత్ చింతల,హైకోర్టు న్యాయవాది
(మీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. )
(చదవండి: కొంపముంచిన వెయిట్‌లాస్ టిప్..! పాపం ఆ విద్యార్థిని..)


