ఇటీవల కాలంలో అందర్నీ వేధించే సమస్య అధిక బరువు. అందులోనూ సోషల్ మీడియా పుణ్యమా అని ఇది తింటే బరువు తగ్గుతారు, ఈ జ్యూస్ తాగితే సన్నజాజిలా నాజుగ్గా అయిపోతారంటూ..యూట్యూబ్ వీడియోలు ఎంతలా ప్రజలను ఊదరగొట్టేస్తున్నాయో తెలిసిందే. అయితే ఏ చిట్కా లేదా హెల్త్ టిప్స్ అనేవి మన శరీరానికి ఎంత వరకు సరిపడుతుందనేది వ్యక్తిగత వైద్యులు లేదా ఆరోగ్యనిపుణులని సంప్రదించడం అనేది అత్యంత ప్రధానం. గుడ్డిగా ఏది పడితే అది ఫాలో అయితే..ప్రాణాలకే ప్రమాదం అనేందుకు ఈఉదంతమే నిదర్శనం. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు ఏఐ, సోషల్‌మీడియా సాయం తీసుకునేవాళ్లకు ఈ ఘటన ఓ కనువిప్పు కూడా.
అసలేం జరిగిందంటే.. తమిళనాడు సెల్లూరులోని మీనాంబాల్పురం, కామరాజ్ క్రాస్ స్ట్రీట్‌కు చెందిన దినసరి కూలీ వేల్ మురుగన్ (51), విజయలక్ష్మీ దంపతుల కుమార్తె కలైయరసి(19) నరిమేడులోని ఒక ప్రముఖ ప్రైవేట్ మహిళా కళాశాలలో చదువుతోంది. కొద్దిగా అధిక బరువుతో ఉండటంతో ఆమె తరుచుగా బరువు తగ్గే చిట్కాలను యూట్యూబ్‌లలో చూస్తుండేది.
గతవారం ఆమె కొవ్వుని తగ్గించి..శరీరాన్ని సన్నగా మార్చే..వెంకారాం(బొరాక్స్) అనే టైటిల్‌తో ఉన్న వీడియోని ఓ యూట్యూబ్ ఛానెల్‌లో చూసింది. జనవరి 16న, థెర్ముట్టి, కీళమాసి వీధి సమీపంలోని ఒక ఆయుర్వేద మందుల దుకాణంలో ఆ పదార్థాన్ని కొనుగోలు చేసిందామె. జనవరి 17న వీడియోలో చెప్పిన విధంగా సేవించింది. వెంటనే వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి.
తక్షణమే ఆమె తల్లి ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొంది ఇంటికి తిరిగి వచ్చింది. అయితే ఆ లక్షణాలు తగ్గుముఖం పట్టక పోగా..మళ్లీ తిరగబెట్టాయి..దాంతో సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇంటికి వచ్చేసింది. అయినా పరిస్థితి చక్కపడక పోగా..తీవ్రమైన కడుపునొప్పి, మలంలో రక్తం పడుతోందంటూ తండ్రిని పట్టుకుని భోరున విలపించింది.
రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో వాంతులు, విరేచనాలు మరింత తీవ్రమవ్వడంతో ఆస్పత్రిలో చేర్పించేందుకు తరలిస్తుండగా..మార్గ మధ్యలోనే తుదిశ్వాస విడిచింది. వైద్యులు సైతం అప్పటికే చనిపోయిందని దృవీకరించారు. ఆమె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన తదనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సదరు యూట్యూబ్ ఛానెల్‌పై చర్యలు తీసుకునేలా దర్యాప్తు ప్రారంభించారు.
(చదవండి: ఎనిమిది నెలల్లో 31 కిలోల బరువు..! ఆ సాకులకు స్వస్తి చెప్పాల్సిందే..!)


