breaking news
Sabarimala Ayyappa
-
శబరిమల, ఎరుమేలిలో.. రసాయనాల కుంకుమపై నిషేధం: హైకోర్టు
పథనంతిట్ట: హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి కొలువై ఉన్న శబరిమలలో.. ధర్మశాస్తాకు నిలయమైన ఎరుమేలిలో రసాయనాల కుంకుమ విక్రయాలకు కేరళ హైకోర్టు కళ్లెం వేసింది. భక్తుల ఆరోగ్యమే తమకు ముఖ్యమని, కెమికల్స్‌తో తయారైన కుంకుమను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్ వి.రాజా విజయరాఘవన్, జస్టిస్ కేవీ జయకుమార్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది. కేరళ ప్రభుత్వం ఈ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించింది.కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. ఇటీవల కేరళ ప్రభుత్వం పంపానదిలో సబ్బులు, షాంపూలను నిషేధించింది. అదేవిధంగా రసాయనాలతో తయారైన కుంకుమను ఎరుమేలి, శబరిమలలో విక్రయించడానికి వీలు లేదని తేల్చిచెప్పింది. సహజసిద్ధంగా తయారైన కుంకుమ విక్రయాలకు మాత్రమే అనుమతి ఉంటుందంటూ ఉత్తర్వులు జారీ చేసింది. శబరిమల, ఎరుమేలిలో వ్యాపారులకు కుంకుమను సరఫరా చేసే హోల్‌సేల్ వ్యాపారి ఒకరు ఈ ఉత్తర్వులను హైకోర్టులో సవాలు చేశారు. మండల, మకరవిళక్కు సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని, రూ.లక్షలు ఖర్చు చేసి.. కుంకుమ స్టాక్ తెచ్చుకున్నామని, ఇప్పటికిప్పుడు ప్రభుత్వం ఒక్క ఉత్తర్వుతో నిషేధం విధిస్తే తాము నష్టపోతామని వాదించారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. తమకు భక్తుల ఆరోగ్యమే ముఖ్యమని, కెమికల్స్‌తో తయారైన కుంకుమను అనుమతించేది లేదని తేల్చిచెప్పింది. కేరళ సర్కారు ఉత్తర్వులను సమర్థించింది. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు, ప్రభుత్వం తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించింది. -
శబరిమల సీజన్: ఎరుమేలిలో చకచకా అభివృద్ధి పనులు
పథనంతిట్ట: శబరిమలలో మండల, మకరవిళక్కు సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధికారులు అభివృద్ధి పనులు, భక్తులకు మౌలిక సదుపాయాల ఏర్పాటుపై దృష్టి సారించారు. శబరియాత్రకు తొలిమెట్టుగా భావించే ఎరుమేలిలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎరుమేలిలోని ధర్మశాస్తా ఆలయ ద్వారానికి రంగులు వేస్తున్నారు. అదేవిధంగా టీడీబీకి చెందిన భారీ పార్కింగ్ ప్రదేశంలో మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గతంలో ఈ పార్కింగ్ ప్రదేశంలో ఎలాంటి ఫ్లోరింగ్ ఉండేది కాదు. దాంతో.. చినుకు పడితే.. చిత్తడిగా మారిపోయేది. భక్తులు పాదరక్షలు లేని కాళ్లతో ఇక్కడ నడవడం ఇబ్బందిగా మారేది. వాహనాలు కూడా బురదలో కూరుకుపోవడం, స్కిడ్ అవ్వడం జరిగేది. ఈ సారి కేరళ ప్రభుత్వం శబరిమల అభివృద్ధికి భారీగా నిధులు మంజూరు చేయడంతో.. వాహన పార్కింగ్ ప్రదేశంలో ఇంటర్‌లాక్ బ్లాకులతో ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎరుమేలి యాత్ర కీలకంశబరిమల యాత్రికులు ఎరుమేలిని తొలుత దర్శించడం ఆనవాయితీగా వస్తోంది. పెద్దపాదం మార్గంలో వెళ్లేవారు.. ఎరుమేలి ధర్మశాస్తా ఆలయం నుంచే తమ యాత్రను ప్రారంభిస్తారు. ఇక్కడి నుంచి అలుదానది, అలుదామేడు. కరిమల కొండ మీదుగా పంపాబేస్ క్యాంప్‌నకు చేరుకుంటారు. ఇక పంపాబేస్ నుంచి చిన్నపాదం మార్గంలో నీలిమల మీదుగా శబరిమల సన్నిధానానికి వెళ్లే భక్తులు సైతం ఎరుమేలిని దర్శించుకుని, ఇక్కడి నుంచి బస్సులు, ప్రైవేటు వాహనాల్లో నీలక్కల్ శివాలయం మీదుగా పంపాబేస్‌కు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, అధికారులు రహదారులకు మరమ్మతులు చేస్తున్నారు. లోయలు, ప్రమాదకరమైన మలుపులు ఉన్నచోట రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసు చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా కంట్రోల్ రూమ్ ద్వారా రియల్‌టైమ్ ట్రాఫిక్‌ను పర్యవేక్షించేలా సన్నాహాలు పూర్తిచేశారు. 17 నుంచి పెద్దపాదం ప్రారంభంసాధారణంగా శబరిమల యాత్రలో పెద్దపాదం మార్గాన్ని మకరవిళక్కు సీజన్(డిసెంబరు చివరి వారం) ప్రారంభానికి ముందు తెరుస్తారు. కొందరు భక్తులు పెద్దపాదం మీదుగా వస్తానని మొక్కుకుంటారు. ఈ నేపథ్యంలో మకరవిళక్కు సీజన్లో పెద్దపాదం మార్గంలో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. పైగా జాతీయ హరిత ధర్మాసనం(ఎన్జీటీ) ఆదేశాలు, వన్యప్రాణులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలనే కేరళ హైకోర్టు ఆదేశాలతో పెద్దపాదం మార్గంలో రాత్రిళ్లు ప్రయాణంపై నిషేధం విధించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే భక్తులను అనుమతిస్తున్నారు. ఈ చర్యలతో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో.. మూడేళ్లుగా మండలం సీజన్లో కూడా పెద్దపాదం మార్గాన్ని తెరుస్తున్నారు. ఈ నెల 17న పెదపాదం మార్గాన్ని తెరిచేలా చర్యలు తీసుకుంటున్నామంటూ పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ డైరెక్టర్(వెస్ట్) కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ సీజన్లోనే పులిమేడు మార్గంఇడుక్కి జిల్లాలోని వండిపెరియార్ నుంచి దట్టమైన పెరియార్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ మీదుగా సత్రం, అక్కడి నుంచి పులిమేడు మీదుగా శబరిమలను చేరుకునే మార్గాన్ని తెరుస్తామని అధికారులు తెలిపారు. ఈ నెల 15 నుంచి సీజన్ ప్రారంభం కావడంతో.. ఆన్లైన్ స్లాట్ బుకింగ్‌లో కూడా ఈ మార్గాన్ని చేర్చారు. ఇక్కడ కూడా ఉదయం 7 గంటల తర్వాతే భక్తులను అనుమతిస్తామని, సత్రం సుబ్రమణ్య స్వామి ఆలయం వద్ద పోలీసులు స్లాట్ ఎంట్రీ చేసుకుంటారని అధికారులు వివరించారు. -
'చిత్తర అట్టవిశేషం'..!మాలధారులు సందర్శనం కంటే ముందు..!
కార్తీక మాసంలో అయ్యప్ప మాలధారణతో స్వామియే శరణం అయ్యప్ప అనే శరణు ఘోష మారుమ్రోగిపోగా.., మరోవైపు కార్తీక దీపాలు, సోమవారాల పూజలతో సాధారణ భక్తుల కోలహాలం. అంత పుణ్యప్రదమై మాసం ఈ కార్తీక మాసం. ఈ సమయంలోనే చలి మొదలయ్యేది కూడా. ఈ గజగజలాడించే చలిలో మండలకాలం పాటు చన్నీటి స్నానాలతో అయప్పస్వాములు ఎంత నిష్టగా ఉదయం సాయంత్రాలు పూజలు చేస్తారో తెలిసిందే. ఆఖరున శబరిమల వెళ్లి ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకుని దీక్ష ముగించడం జరగుతుంది. సాధారణంగా అయ్యప్ప ఆలయం నవంబర్, జనవరి మధ్య కాలంలోనే తెరుస్తారనే విషయం తెలిసిందే. అది కూడా మండలదీక్ష పూర్తి చేసుకునేందుకు వచ్చే అయ్యప్ప భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటుంది. అయితే అంతకంటే ముందు ఒక విశిష్ణ పూజ నిమిత్తం ఐదు రోజులు తెరిచే ఉంచుతారు. అది శబరిమలలో అత్యంత ప్రత్యేకమైన వేడుక. ఈ సందర్భంగా ఆ పండుగ విశేషాల గురించి సవివరంగా తెలుసకుందామా..!.ఆ పండుగే చిత్తిర అట్టవిశేషం (అత్తతిరునాల్) ఇది శబరిమలలో జరుపుకునే ప్రత్యేక పండుగ. ట్రావెన్కోర్ మహారాజు చితిర తిరునాళ్ బలరామ వర్మ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ పండుగను నిర్వహిస్తారట. ఆయన గౌరవార్ధం ఈ వేడుకను నిర్వహిస్తారు. అప్పటి పందళం రాజవంశం శబరిమల ఆలయాన్ని ట్రావెన్కోర్కు అప్పగించింది. ఆ నేపథ్యంలోనే ఈవేడుకను ఆలయన నిర్వహాకులు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నారు. సరిగ్గా ఆయన పుట్టిన రోజున 1942లో చితిర తిరునాళ్ మహారాజు తన కుటుంబంతో శబరిమల సందర్శించినందుకు గుర్తుగా కూడా ఈ వేడుకను నిర్వహిస్తారు. అంతేగాదు ఆ సమయంలో ఆయనతో పాటు ఉన్న మహారాజు తమ్ముడు ఉత్రాడం తిరునాల్ మార్తాండ వర్మ శబరిమల దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. అది ఇప్పటికీ నెట్టింట వైరల్ ఫోటోగా సంచలనం సృష్టిస్తోంది. ఇక ఈ వేడుకను మహారాజు జన్మదినమైన తులా మాసంలో చిత్తా నక్షత్రం ఉన్న రోజున నిర్వహిస్తారు. చెప్పాలంటే సాధారణంగా ఆ పండుగ అక్టోబర్ నెలాఖరు-నవంబర్ మొదటి వారంలో జరుగుతుంటుంది.చిత్తిర అట్టవిశేషం విశిష్టత..అత్తతిరునాల్ పూజ కోసం అయ్యప్ప ఆలయం దాదాపు 29 గంటలు తెరిచి ఉంటుంది. ఈ వేడుకను అచ్చం మళయాళుల జరుపుకునే సంవత్సరాది వేడుక మాదిరిగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఆ పండుగ రోజు ఉదయ 5 గంటలకు ఊరేగింపు, అభిషేకం జరుగుతాయి. దాంతోపాటు నెయ్యాభిషేకం, అష్టద్రవ్య మహాగణపతి హోమం, ఉష పూజ వంటి కైంకర్యాలు నిర్వహిస్తారు. ఇక్కడ మరోవిశేషం ఏంటంటే..తిరువనంతపురంలోని కవడియార్ ప్యాలెస్ నుంచి ట్రావెన్కోర్ రాజకుటుంబం తీసుకొచ్చిన ప్రత్యేక నెయ్యిని అయ్యప్పస్వామికి అభిషేకం చేస్తారు. అంతేగాదు ఈ ప్రత్యేక రోజున, అయ్యప్పన్ సన్నిధిలో ఉదయం సాయంత్రాల్లో పూజ, అష్టాభిషేకం, లక్షార్చనే, సహస్రకలశాభిషేకం, పడిపూజ, పుష్పాభిషేకం వంటి ప్రత్యేక పూజలు జరుగుతాయి. రాత్రి భోజనాల అనంతరం భస్మానికి అభిషేకం చేసి 10 గంటలకు హరివరాసన గానంతో ఊరేగిస్తారు. ఈ ‘చిత్తిర అట్టవిశేషం’ వేడుకల అనంతరం ఆలయాన్ని మూసివేస్తారు. మకరవిళక్కు మండలం(మండల దీక్ష) కోసం తిరిగి నవంబరు నుంచి మూడు మాసాల పాటు తెరిచి ఉంచుతారు. ఆ సమయంలోనే లక్షలాది మంది అయ్యప్ప స్వామి భక్తులు శబరిమల ఆలయాన్ని దర్శించుకుంటుంటారు. (చదవండి: చంద్రుడు ప్రతిష్టించిన సోమేశ్వరులు..! ఎనిమిది దిక్కులలో కొలువై..) -
శబరిమలలో దొంగిలించిన బంగారాన్ని అమ్మేశారు!
పథనంతిట్ట: శబరిమలలోని అయ్యప్ప ఆలయంలో బంగారు తాపడాల బరువు తగ్గిన వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) కీలక ఆధారాలను సేకరించింది. ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టి.. 476 గ్రాముల బంగారాన్ని అమ్మేసినట్లు దర్యాప్తులో వెల్లడించాడు. ఆ బంగారాన్ని 2019లోనే కర్ణాటకలో గోవర్ధన్ అనే వ్యాపారికి విక్రయించినట్లు వాంగ్మూలమిచ్చినట్లు సిట్ అధికారులు తెలిపారు. 2019లో బంగారు తాపడాలకు మెరుగులు దిద్దే పనిలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే..! దీంతో కేరళ సర్కారుపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. పినరయి విజయన్ సర్కారు ఈ అంశంపై దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ ప్రాథమిక దర్యాప్తులో ఉన్నికృష్ణన్ను ప్రధాన నిందితుడిగా తేల్చి, అరెస్టు చేసింది. ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న ఉన్నికృష్ణన్ను సిట్ అధికారులు కోర్టు అనుమతితో ఈ నెల 30వ తేదీ వరకు కస్టడీకి తీసుకుని, విచారించారు. ఈ క్రమంలో తొలుత 2 కిలోల బంగారం చోరీ అయినట్లు అనుమానాలు వ్యక్తమైనా.. తాజాగా ఉన్నికృష్ణన్ ఇచ్చిన వాంగ్మూలంలో దొంగతనానికి గురైన బంగారం బరువును 476 గ్రాములుగా తేల్చారు. ఉన్నకృష్ణన్ కస్టడీ ముగియడంతో గురువారం కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు. ఇక ట్రావెన్కోర్ బోర్డు సభ్యుల విచారణ ఉన్నికృష్ణన్ వాంగ్మూలం నేపథ్యంలో సిట్ అధికారులు ఇప్పుడు ట్రావెన్కోర్ దేవొస్వం బోర్డు(టీడీబీ) సభ్యులను విచారించేందుకు రంగం సిద్ధం చేసింది. 2019 నుంచి ఆరేళ్ల పాటు.. ఈ మోసాన్ని ఎందుకు గుర్తించలేదు? వ్యవస్థలో ఎక్కడ లోపముంది? ఉన్నికృష్ణన్‌కు ఇంటిదొంగల అండదండలున్నాయా? అనే కోణంపై బోర్డు సభ్యుల వాంగ్మూలాలు సేకరించనుంది. అంతేకాదు.. ఇప్పటికే 2019-25 మధ్యకాలంలో జరిగిన బోర్డు మీటింగ్‌లలో మినిట్స్ వివరాలను సిట్ స్వాధీనం చేసుకుంది. దాని ఆధారంగా బోర్డు సభ్యులను విడివిడిగా, కలిపి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంపన్న భక్తులతో ఉన్ని క్లోజ్ శబరిమలకు తరచూ బంగారం, నగదు వితరణ చేసే సంపన్న భక్తులతో ఉన్నికృష్ణన్ సత్సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడని సిట్ గుర్తించింది. అతను బంగారంతోపాటు.. శబరిమలకు చెందిన భూముల వ్యవహారంలోనూ తలదూర్చినట్లు సిట్ నిగ్గుతేల్చింది. అక్రమ మార్గాల్లో సంపాదించిన మొత్తంతో ఉన్నికృష్ణన్ కేరళతోపాటు.. బెంగళూరు శివార్లలో తన పేరిట, బినామీల పేరిట భవనాలు, భూములను కొనుగోలు చేసినట్లు నిర్ధారించింది. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని సమాచారం. -
శబరిమలైలో పెద్దిరెడ్డి విజువల్స్
-
దేవుని దేశం తిరిగొద్దాం..! చూడాల్సిన జాబితా చాలా పెద్దదే..
గాడ్స్ ఓన్ కంట్రీ... చూడాల్సినవి ఇవి అని చెప్పుకోవడం కష్టం. జాబితా వేళ్ల మీద లెక్కపెట్టేటంత చిన్నదిగా ఉండదు. ఆర్ట్ అండ్ కల్చర్, ఆధ్యాత్మికం, ధార్మికం, వీకెండ్ పిక్నిక్ స్పాట్స్, బీచ్‌లు, బ్యాక్ వాటర్స్, పర్వతాలు, కొండవాలులో టీ తోటలు, సముద్రం మీద సూర్యాస్తమయాలు, జలపాతాలు, వన్యప్రాణులు, హాలిడే రిసార్టులు... ఇలా పరస్పరంవైవిధ్యభరితమైన పర్యటనల నిలయం ఈ రాష్ట్రం. కేరళలో ఆధ్యాత్మికం కూడా ఆద్యంతం అలరిస్తుంది. త్రివేండ్రంలోని పద్మనాభ స్వామి ఆలయం మొదలు అంబళంపుర శ్రీకృష్ణుడు, చెట్టికుళాంగుర భగవతి, శబరిమల అయ్యప్ప, కొట్టరక్కర గణపతి, తిరునెల్లి ఆలయం, చర్చ్‌లు, మసీదులు ప్రతిదీ టూరిస్టులకు కనువిందు చేస్తాయి.శబరిమలైకి మహిళలను అనుమతించడం కోసం తృప్తి దేశాయ్ చేసిన ఉద్యమంతో ఉత్తరాదివాసుల దృష్టి కూడా కేరళ మీద కేంద్రీకృతమైంది. ఇప్పుడు కేరళలో హిందీవాళ్లు కూడా కనిపిస్తున్నారు.అరబిక్ కడలికేరళ టూర్‌కి కాలంతో పని లేదు. అరేబియా తీరం– పశ్చిమ కనుమల మధ్య విహారానికి ఎప్పుడైనా రెడీ కావచ్చు. ఎండకాలం చల్లగా అలరిస్తుంది. జూన్ నుంచి చిరు వానలు పలకరిస్తాయి. శీతాకాలం పచ్చదనం తన గాఢతను ప్రదర్శిస్తుంది. తలలు వాల్చి ఆహ్వానం పలికే కొబ్బరితోటలు, కోమలత్వాన్ని తాకి చూడమనే అరటి గుబుర్లు, ఎటూ వంగని పోకచెట్లు, ఏ చెట్టు దొరుకుతుందా అల్లుకుపోదామని వెతుక్కునే మిరియాల తీగలు, కాయల బరువుతో భారంగా వంగిపోతున్న కాఫీ చెట్లు, టూర్‌కి మినిమమ్ గ్యారంటీ ఇచ్చే అరేబియా సముద్రం మీద సూర్యాస్తమయాలు... ఇవన్నీ ప్రకృతి ప్రసాదితాలు.ఆది శంకరుడు పుట్టిన నేలకాలడి ఓ చిన్న పట్టణం. పెరియార్ నది ఒడ్డున ఎర్నాకుళం జిల్లాలో ఉంది. ఆది శంకరాచార్యుడు పుట్టిన ప్రదేశం ఇది. ఇక్కడ ఆయన నివసించిన ఇల్లు, ఆయన తల్లి సమాధి ఉన్నాయి. ఇక్కడి స్నానఘట్టంలో ముత్తల కడవు (మొసలి మడుగు) ను కూడా చూడవచ్చు. ఆది శంకరుడు సన్యసించాలనుకున్నప్పుడు తల్లి అంగీకరించలేదు. ఆమె అంగీకారం కోసం ఆది శంకరుడు నాటకం ఆడిన ఘట్టం ఇది. స్నానఘట్టంలో దిగి మొసలి పట్టుకున్నదని, సన్యసించడానికి ఒప్పుకుంటేనే వదులుతుందని తల్లిని మాయ చేసి అంగీకారం పొందిన కథనాన్ని చెబుతారు పూజారులు. పెరియార్ నది కొచ్చి ఎయిర్‌పోర్టులో దిగడానికి ముందే పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది. పచ్చటి చేనులో నీలిరంగు వస్త్రాన్ని మలుపు తిప్పుతూ పరిచినట్లు ఉంటుంది దృశ్యం.కళల నిలయంకేరళ ప్రకృతిసోయగంతోపాటు కళలతోనూ ఆకట్టుకుంటుంది. కలరిపయట్టు వంటి యుద్ధ క్రీడ, మోహినీ అట్టం, కథాకళి వంటి నాట్యరీతులు, రాజారవివర్మ చిత్రలేఖన సమ్మేళనం ఇక్కడే పుట్టాయి. భరత్పుఱ నది తీరాన త్రిశూర్ జిల్లాలోని చెరుత్తురుతి పట్టణంలో కేరళ కళామండలం ఉంది. కళల సాధన కోసం ఏర్పాటు చేసిన ఈ కళామండలంలో నిత్యం సంప్రదాయ నాట్యరీతుల సాధన జరుగుతూ ఉంటుంది. మరో హాలులో కేరళ సంప్రదాయ నాట్య రీతుల నాట్య ముద్రలు, భంగిమలు, ఆహార్యంతో ఉన్న బొమ్మల మ్యూజియం ఒక ఎడ్యుకేషన్. ఈ కళల కోసమే కాదు, కేరళ కళామండలం భవన నిర్మాణశైలిని చూడడం కోసం ఆర్కిటెక్చర్ విద్యార్థులు వెళ్లాల్సిన ప్రదేశం.వాస్కోడిగామా ఎంట్రీ!కేరళ రాష్ట్రంలో సగం తీర్రప్రాంత జిల్లాలైతే మిగిలిన సగం కొండ్రప్రాంత జిల్లాలు. రైలు ప్రయాణంలో తమిళనాడు నుంచి కేరళకు వెళ్లేటప్పుడు పాలక్కాడ్ నుంచే మార్పు కనిపిస్తుంది. మనదేశంలో వలస పాలనలో మగ్గి΄ోవడానికి దారులు పడింది కూడా ఈ రాష్ట్రం నుంచే. పోర్చుగీసు నావికుడు వాస్కోడిగామా మనదేశంలోకి ప్రవేశించింది కోళికోద్ పట్టణానికి సమీపంలోని కప్పడ్ అనే చిన్న తీరగ్రామంలో. కప్పడ్ బీచ్‌లో వాస్కోడిగామా జ్ఞాపకచిహ్నాలున్నాయి. చర్చ్‌లు యూరోపియన్ నిర్మాణశైలిలో అందంగా ఉంటాయి. నది తీరాన నిర్మించడంలో గొప్ప అభిరుచి వ్యక్తమవుతుంటుంది. ఎర్నాకుళంలో సెయింట్ మేరీస్ బాసిలికా చర్చ్, మలయత్తూర్ చర్చ్, శాంతాక్రజ్ కేథడ్రల్, జార్జ్ ఫ్రాన్సిస్ చర్చ్, సముద్రతీరాన నిర్మించిన వల్లర΄ాదమ్ చర్చ్‌లు ప్రశాంత వాతావరణంలో మౌనముద్ర దాల్చి ఉంటాయి. ముఖ్యమైన మసీదులు ముప్పైకి పైగా ఉంటాయి.ఆరోగ్యదేవుడు ధన్వంతరిఆయుర్వేదంలో వైద్యానికి మూల పురుషుడు ధన్వంతరి. ధన్వంతరికి ‘ముక్కిడి’ పేరుతో 35 ఔషధాల మిశ్రమాన్ని నివేదిస్తారు. త్రిశూర్ జిల్లా, నెల్లువాయ్ గ్రామంలో ఉన్న ఆలయం పురాతనమైనది. దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిన అమృతభాండాన్ని ధన్వంతరి పట్టుకుని వస్తాడు. ఒక చేతిలో శంకు, ఒక చేతిలో చక్రం, ఒకచేతిలో అమృతభాండం, మరో చేతిలో జలూకం(జలగ, ఆయుర్వేద వైద్యంలో జలగను ఉపయోగిస్తారు)తో ఉద్భవించాడు ధన్వంతరి. ఆ మూర్తినే ఇక్కడ ప్రతిష్టించారని చెబుతారు. మున్నువరువట్టం, గురువాయూర్లలో కూడా ధన్వంతరి ఆలయం ఉంది. శబరిమలకు వెళ్లిన వాళ్లు ఈ ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు.టీ తోటల మునార్మున్నార్ అంటే మూడు నదుల కలయిక. ముథిరాప్పుజ, నల్లతన్ని, కుండలి నదుల మధ్య ఉన్న హిల్‌స్టేషన్ ఇది. టీ తోటలు విస్తారంగా ఉంటాయి. ఈ తోటల మధ్య జలపాతాలు తెల్లగా పాలధారలను తలపిస్తుంటాయి. వర్షాకాలంలో దట్టంగా అలముమున్న నల్లటి మేఘాలను చీల్చుకుంటూ భూమ్మీద పాలను కుమ్మరిస్తున్నట్లు ఉంటుంది అట్టుకడ జలపాతం. ఈ టూర్లో ఎరవి కులమ్ నేషనల్ పార్క్‌ను, నీలగిరులు అనే పేరు రావడానికి కారణమైన నీలకురింజి మొక్కలను చూడాలి. మున్నార్, ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రదేశాలను ఒకసారి చూసిన వాళ్లు కూడా కురింజి పూలు పూసినప్పుడు మళ్లీ చూడాలని ఆశపడతారు. బొటానికల్‌గా ఇవి 50 రకాల జాతులున్నాయి. కాని మనకు చూడడానికి అన్నీ నీలంగానే ఉంటాయి, షేడ్లు మాత్రం ఏ చిత్రకారుడూ మిక్స్ చేయలేనంత లలితంగా ఉంటాయి. నీలకురింజి పూలు పన్నెండేళ్లకోసారి పూస్తాయి. 2018లో పూశాయి, మళ్లీ పూసేది 2030లోనే. కోవిడ్ సమయంలో కూర్గ్ కొండల్లో కొన్ని చోట్ల విరిశాయి. కానీ సీజన్లో పూసినట్లు కొండ మొత్తం విస్తరించలేదు. ఇక్కడ జంతు సంచారం కూడా ఎక్కువ. నీలగిరి థార్ ఇక్కడ మాత్రమే కనిపించే జింక జాతి.కోటలు... తోటలు!కేరళ గ్రామాల్లో మన దగ్గర ఉన్నట్లు ఇళ్లన్నీ ఒక చోట, పొలాలు ఒకచోట ఉండవు. రెండు – మూడు ఎకరాల స్థలంలో కొబ్బరి చెట్లు, మధ్యలో ఇల్లు ఉంటుంది. తోట పక్కన మరొక తోట... ఆ తోటలో ఒక ఇల్లు... చాలా ఇళ్లకు పై కప్పు ఎర్ర పెంకులే ఉన్నాయి. రెండస్తుల ఇల్లు కూడా పై కప్పు వాలుగా, ఎర్ర పెంకులతో ఉంటుంది. రాజుల ప్యాలెస్‌లు కూడా భారీ నిర్మాణాలేమీ కాదు. రాజస్థాన్ కోటలు, ప్యాలెస్‌లను చూసిన కళ్లతో ఇక్కడి ప్యాలెస్‌లను చూస్తే కళ్లు విప్పార్చలేం. కానీ ప్రకృతి సహజమైన, శాంతియుతమైన జీవనశైలికి నిదర్శనంగా కనిపిస్తాయి. పాలక్కాడ్, తలస్సెరి కోటలు పర్యాటకులను అలరిస్తుంటాయి. చిన్న చిన్న ప్యాలెస్‌లను రిసార్టులుగా మార్చేశారు. భరత్‌పుర నది ఒడ్డున ఉన్న ప్యాలెస్‌ను ‘ది రివర్ రిట్రీట్’ పేరుతో హెరిటేజ్ ఆయుర్వేదిక్ రిసార్టుగా మార్చారు. అందులో భోజనం చేయడం జిహ్వకు వైద్యం.మీన్ ముట్టి జలపాతంవయనాడు... కేరళ రాష్ట్ర్రంలో అత్యున్నత స్థాయి ప్రకృతి సౌందర్యాన్ని ఇముడ్చుకున్న ప్రదేశం. ఆ రాష్ట్రానికి శిఖరాగ్రం కూడ ఇదే. మీన్ముట్టి వాటర్ ఫాల్స్‌కి రెండు కిలోమీటర్ల దూరం దట్టమైన అడవిలో ట్రెకింగ్ చేయాలి. ఈ కొండ మీద మీన్ముట్టి వాటర్‌ఫాల్స్ దగ్గర నుంచి చూస్తే ఒక వైపు తమిళనాడు నీలగిరులు, మరోవైపు కర్నాటకకు చెందిన కూర్గ్ కొండలు దోబూచులాడుతుంటాయి. వరదలు ముంచెత్తినప్పటికీ పర్యాటకం తిరిగి మామూలు స్థితికి చేరుకుంటోంది. ట్రీ హౌస్‌లో బస చేయాలనే సరదా తీరాలంటే ముందుగానే ΄్లాన్ చేసుకోవాలి. ఇక్కడ పర్యటిస్తే కేరళ వాళ్లు తమ రాష్ట్రాన్ని ‘గాడ్స్ ఓన్ కంట్రీ’ అని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదనిపిస్తుంది.గిన్నిస్ బుక్‌లో జటాయుపురాజటాయు నేచర్ పార్క్... కొల్లం జిల్లా, చాదయమంగళం పట్టణం, జటాయుపురాలో ఉంది. రామాయణంలో సీతాపహరణం ఘట్టంలో రావణాసురుడితో జటాయువు పోరాడిన ప్రదేశం ఇదేనని చెబుతారు. నేచర్ పార్కులో 65 ఎకరాల విస్తీర్ణంలో డిజిటల్ మ్యూజియమ్ ఉంది. లైట్ అండ్ సౌండ్ షోలో రామాయణంలోని జటాయువు ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. ప్రపంచంలో ‘లార్జెస్ట్ ఫంక్షనల్ స్టాచ్యూ ఆఫ్ ఎ బర్డ్’ కేటగిరీలో ఈ పార్కు గిన్నిస్ రికార్డులో నమోదైంది. ఈ కొండ మీదకు ట్రెకింగ్, రాక్ క్లైంబింగ్, బైక్ రైడింగ్‌తోపాటు ఆర్చరీ వంటి యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు, యువత, సీనియర్ సిటిజెన్ అందరికీ ఈ టూర్ అందమైన జ్ఞాపకంగా మిగులుతుంది. వెయ్యి అడుగుల ఎత్తులో జటాయువు పక్షిని నిర్మించడం, పక్షి ఆకారం లోపల మ్యూజియాన్ని ఏర్పాటు చేయడం ప్రపంచంలో ఎనిమిదో వింత అని చెప్పవచ్చు.త్రివేండ్రం పద్మనాభుడుఅనంత పద్మనాభ స్వామి ఆలయం అప్పుడప్పుడూ వార్తల్లో కనిపిస్తుంటుంది. తలుపులు తెరుచుకోని ఆరోగది మీదనే అందరి దృష్టి. అంతకంటే గొప్ప ఆసక్తి ఇక్కడి పద్మనాభుడి రూపం. ఈ ఊరికి తిరువనంతపురం అనే పేరు రావడానికి కారణం ఈ ఆలయమే. కేరళ రాజధాని నగరం ఇది. బంగారు గోపురం ఉన్న ఈ ఆలయం టావెన్కోర్ రాజవంశం సంపన్నతకు ప్రతీక.అలెప్పీ హౌస్బోట్హౌస్బోట్లో ప్రయాణం చేయకపోతే కేరళ టూర్ వృథా అనే చెప్పాలి. ఇప్పుడు హౌస్బోట్లు మరింత పెద్దవిగా క్రూయిజ్‌లుగా మారాయి. టూర్ ప్యాకేజ్‌లో డే క్రూయిజ్ ప్యాకేజ్ కూడా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ ప్రయాణంలో కేరళ సంప్రదాయ భోజనంలో రకరకాలను ఆస్వాదించవచ్చు. భోజనాన్ని అరిటాకులో వడ్డించడం మాత్రమే కాదు అరటికాయ చిప్స్, చేపను అరిటాకులో చుట్టి వేయించిన ఫిష్‌ఫ్రై ఇక్కడ ప్రత్యేకం. చికెన్ కర్రీలో కొబ్బరి ముక్కలు కూడా చాలా రుచిగా ఉంటాయి. కొబ్బరి నూనె వంటల మీద అపోహ ఉంటుంది. కానీ ఈ వంటలు చాలా రుచిగా ఉంటాయి.షాపింగ్జరీ అంచు హాఫ్‌వైట్ చీర లేదా లంగా–ఓణీ తెచ్చుకోవడం మరువద్దు. ఉడెన్ కార్వింగ్ బాక్సులు, హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అందంగా ఉంటాయి. కొబ్బరి, అరటి నారతో చేసిన టేబుల్ మ్యాట్స్, కోషెలు, హ్యాండ్‌బ్యాగ్‌లు, వాల్ హ్యాంగింగ్స్ కొనుక్కోవచ్చు. ఇవి తినాలికోకోనట్ హల్వా, అరటికాయ చిప్స్, అరటికాయ బజ్జీ ప్రసిద్ధి. కొబ్బరి బోండాం తప్పకుండా తాగాలి. వేడుకలివిఫిబ్రవరి 14 నిషగంధి డాన్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఫిబ్రవరి 19 నుంచి 25 వరకు పరియాణమ్ పేట్ పూరమ్, పాలక్కాడ్, భగవతి టెంపుల్, త్రిశూర్ ఆలయంలో ఉత్రాళిక్కవు పూరమ్ వేడుకలు జరుగుతాయి. ప్యాకేజ్‌లిలా...సౌత్ కేరళ 4 రాత్రులు 5 రోజులకు 55 వేలు. 5 రాత్రులు 6 రోజులకు దాదాపుగా అరవై వేలు. ఎంటైర్ కేరళకు ఆఫర్ నడుస్తోంది. పది రాత్రులు 11 రోజులకు 55 వేలు. ఈ ఆఫర్ మార్చి 30 వరకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో కొదుండుళూర్లోని చేరమాన్ జుమా మసీద్, చీయప్పార జలపాతం, వాలర జలపాతం, ఇడుక్కి దేవికులమ్ హిల్స్, కొచ్చిలోని బోల్గట్టీ ఐలాండ్, హౌస్‌బోట్, విలేజ్ లైఫ్ ఎక్స్‌పీరియెన్స్ మొదలైనవి కవర్ అవుతాయి. సెంట్రల్ కేరళ ప్యాకేజ్ కి20 వేలు. ఇందులో అళప్పుఱ, పెరియార్ టైగర్ రిజర్వ్, తెక్కడి, మునార్, ఫోర్ట్ కొచ్చి మొదలైనవి ఉంటాయి. --వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి(చదవండి: అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణం చూతము రారండి) -
అయ్యప్పభక్తులకు గుడ్‌న్యూస్ : వాట్సాప్‌లో శబరిమల సమాచారం
ఇకపై శబరిమల వెళ్లే యాత్రికులు ఆలయ సమాచారం తెలుసుకోవడం కోసం ప్రయాస పడనక్కరలేదు. స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి వాట్సాప్‌లో 6238998000 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ చేస్తే చాలు... క్షణాల్లో శబరిమల ఆలయ సమాచారం అందుతుంది.‘స్వామి చాట్‌బాట్’ పేరిట అందించే ఈ సేవలను ముత్తూట్ గ్రూప్ సహకారంతో ఇంగ్లిష్, హిందీ, మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ భాషలలో అందించనున్నట్టు పథానంతిట్ట జిల్లా అధికార యంత్రాంగం తెలియజేసింది. ఆలయ వేళలు, ప్రసాద లభ్యత, పూజ వేళలు, శబరిమల చుట్టుపక్కల ఉండే ఇతర ఆలయాల వివరాలు, దగ్గరలో ఉండే రైళ్లు, బస్సులు, ఎయిర్పోర్ట్ సేవలకు సంబంధించిన సమాచారాన్ని ఈ చాట్‌బోట్ ద్వారా తెలుసుకోవచ్చునని దేవస్థానం అధికారులు తెలియజేశారు -
అయ్యప్ప దీక్షలో పాటించాల్సిన నియమాలు ఇవే
-
శరణకీర్తనం భక్త మానసం
-
మకరజ్యోతి దర్శనంతో పులకించిన అయ్యప్ప భక్తులు
-
శబరిమల ఆలయానికి పోటెత్తిన భక్తులు..
-
తెరచుకున్న శబరిమల ఆలయం
-
తెరచుకున్న శబరిమల ఆలయం
పత్తనంతిట్ట: భక్తుల దర్శనార్థం రెండు నెలల సీజనల్ యాత్రలో భాగంగా ప్రఖ్యాత శబరిమల అ య్యప్పస్వామి ఆలయం సోమవారం తెరచుకుంది. ప్రధాన పూజారి(తంత్రి) కందరారు మహేశ్ మోహనరారు సమక్షంలో ఆలయ గర్భగుడి తలుపులను తెరిచారు. 16 తేదీ నుంచే భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు. భారీ వర్షాల కారణంగా తొలి 3,4 రోజులపాటు తక్కువ సంఖ్యలో భక్తులనే లోపలికి అనుమతిస్తారు. వర్చువల్ క్యూ పద్ధతిలో రోజుకు 30వేల మంది దర్శనానికి అవకాశం కల్పించారు. కోవిడ్ సర్టిఫికెట్ లేదా 72 గంటల్లోపు తీసుకున్న ఆర్టీ–పీసీఆర్ నెగెటివ్ సర్టిఫికెట్లను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. 41 రోజుల మండల పూజ డిసెంబర్ 26న పూర్తికానుంది. -
శబరిమల: హైకోర్టు ఆదేశాలు సుప్రీంలో సవాల్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోన్న తరుణంలో శబరిమలను దర్శించే భక్తుల సంఖ్యను పెంచుతూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. శబరిమల సందర్శనకు వచ్చే భక్తుల సంఖ్యను రోజుకి 3000 నుంచి 5000కు పెంచడం పోలీసులు, వైద్య అధికారులపై పెనుభారాన్ని మోపుతుందని కేరళ ప్రభుత్వం అభిప్రాయపడింది. డిసెంబర్ 20 నుంచి జనవరి 14 మకర సంక్రాంతి వరకు శబరిమల ఆలయ ఉత్సవాల సీజన్ కావడంతో కోవిడ్ ప్రబలే ప్రమాదాన్ని నివారించేందుకు భక్తుల సంఖ్యను నిర్ధారించేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నిర్ణయం మేరకు ప్రస్తుతం ప్రతి రోజూ 2000 మంది భక్తులను, వారాంతాల్లో 3,000 మంది భక్తులను అనుమతిస్తున్నారు. భక్తుల సంఖ్యను పెంచాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు అవడంతో, డిసెంబర్ 18న కేరళ హైకోర్టు రోజుకి 5000 మంది భక్తులు ఆలయ సందర్శనకు అనుమతించొచ్చంటూ ఉత్తర్వులు జారీచేసింది. -
శబరిమల: బాటిల్ తిరిగిస్తే డబ్బు వాపస్
తిరువనంతపురం: కరోనా దెబ్బకు దేవుడు సైతం చీకటిలో ఉండాల్సిన రోజులు వచ్చాయి. ఎంతో ప్రాముఖ్యత పొందిన కేరళ దివ్య జ్యోతికి ఆటంకం రాకుండా .. సరైన సమయానికి కోవిడ్ నిబంధనలతో శబరిమల అయ్యప్ప దర్శనానికి అనుమతులు ఇచ్చారు. ఇప్పుడు ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు అందించే ఔషధ జలాన్ని ఇక నుంచి బాటిళ్లలో సరఫరా చేయనున్నట్లు బోర్డు ఆదేశాలు జారీచేసింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో స్టీల్ బాటిళ్లలో నీటిని అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ ఔషధ నీరు బాటిళ్లలో కావాలనుకుంటే రూ.200ను ముందస్తుగా డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ నీటిని పంబా బేస్ క్యాంప్ దగ్గర ఉండే ఆంజనేయ ఆడిటోరియం వద్ద అందిస్తారు. డిపాజిట్ చేసిన సొమ్మును బాటిల్ తిరిగి ఇచ్చేసిన తర్వాత తిరిగి చెల్లిస్తారు. ఈసారి స్టీల్ బాటిళ్లతో పాటు పేపర్ గ్లాసుల్లోనూ ఈ ఔషధ నీటిని అందజేయనున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డు తెలిపింది. ఔషధ జలం అంటే..? యాత్రికులు ఎక్కువగా వచ్చే సమయాల్లో అయ్యప్ప భక్తులకు ఔషధాలు కలిపిన నీటిని ఏటా అందిస్తారు. ఛుక్ (ఎండు అల్లం), రమాచామ్ (వెటివర్), పతి ముఖం (పతంగ కట్ట) వంటి ఆయుర్వేద మూలికలతో నీటిని వేడి చేసి దీన్ని తయారు చేస్తారు. పంపిణీ కేంద్రాల్లోనే ఈ నీటిని తయారు చేసి భక్తులకు ఇస్తారు. పంబా, చరల్మేడు, జ్యోతినగర్, మలికప్పురం పాయింట్ల వద్ద ఔషద జలం పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
శబరిమల అయ్యప్పకు రూ. 141 కోట్ల ఆదాయం
గత ఏడాది కంటే రూ.14 కోట్లు ఎక్కువ శబరిమల: శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయ ఆదాయం ఈ ఏడాది మరింత పెరిగింది. ఈ ప్రముఖ క్షేత్రానికి యాత్రికుల తాకిడి పెరగటంతో రూ.141.64 కోట్ల ఆదాయం చేకూరింది. ఇది గత ఏడాది కంటే రూ.14 కోట్లు ఎక్కువ. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి దీక్షా పరుల సంఖ్య పెరగడమే ఇందుకు కారణమని ఆలయ వర్గాలు తెలిపాయి. రూ.141.64 కోట్లలో హుండీ ద్వారా రూ.51.17 కోట్లు లభించాయని, ఇది కూడా గత ఏడాది కంటే దాదాపు రూ.4 కోట్లు ఎక్కువేనని పేర్కొంది.


