బరిమల ఆలయంలో ప్రస్తుతం (జనవరి 2026 మొదటి వారంలో) మకరవిళక్కు తీర్థయాత్ర సందర్భంగా భక్తుల రద్దీ భారీగా ఉంది. లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తున్నారు, దీంతో నిర్వహణ సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వర్చువల్ క్యూ, స్పాట్ బుకింగ్ ద్వారా రోజుకు సుమారు 70,000 నుంచి 90,000 మందికి పైగా భక్తులను నియంత్రిస్తున్నారు.
అయినప్పటికీ రద్దీ, వేచి ఉండే సమయం ఎక్కువగా ఉంది. మరోవైపు భక్తుల కిటకిటలతో శబరిమల (Sabarimala) కొండలు అయ్యప్ప నామస్మరణతో మారుమోగుతున్నాయి. భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో దర్శన క్యూలైన్లు కిలోమీటర్ల మేర విస్తరించాయి. సన్నిధానం (ఆలయం) నుంచి మొదలైన క్యూలైన్లు కొండ కింద ఉన్న పంబా నది (Pamba River) వరకు చేరుకోవడం అక్కడి రద్దీ తీవ్రతకు అద్దం పడుతోంది.
దేవస్వం బోర్డు కూడా ఈ రద్దీని నియంత్రించేందుకు అదనపు సిబ్బందిని నియమించి.. క్యూ కాంప్లెక్స్‌లలో విశ్రాంతి సౌకర్యాలను కల్పించే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం అయ్యప్ప భక్తులకు స్వామి దర్శనానికి దాదాపు 12 గంటలకు పైగా సమయం పడుతోందని అధికారులు చెబుతున్నారు. కాగా ఇప్పటి వరకు సుమారు ఐదు లక్షల మందికిపైగా భక్తులు దర్శనం చేసుకున్నారు.


