అయ్యప్ప స్వామి తిరువాభరణాల దర్శనం అంటే, మకర సంక్రాంతి రోజున శబరిమల అయ్యప్ప విగ్రహానికి పందళ మహారాజు పంపిన దివ్య స్వర్ణాభరణాలను అలంకరించి, ఆ అద్భుతమైన రూపంలో స్వామిని దర్శించుకోవడం. ఇది భక్తులకు అత్యంత పవిత్రమైన అనుభూతిని ఇస్తుంది. ఈ దర్శనం మకర జ్యోతి దర్శనానికి ముందు జరుగే తంతు.
ఇక పందలం శ్రాంబికల్ కొట్టారంలోని తిరువాభరణ మాళిగ ఇవాల్టి (డిసెంబర్ 31) నుంచి భక్తుల దర్శనం కోసం తెరవబడుతుంది. ఈ రోజు(డిసెంబర్ 31) నుంచి జనవరి 11 వరకు ప్రతిరోజూ ఉదయం 5:30 నుండి రాత్రి 8:00 గంటల వరకు భక్తులు తిరువాభరణాలను దర్శించుకోవచ్చు. అలాగే జనవరి 12న తెల్లవారుజామున 4:30 నుంచి మధ్యాహ్నం 12:00 గంటల వరకు పందలం వలియ కోయిక్కల్ శ్రీ ధర్మశాస్త్ర క్షేత్రంలో తిరువాభరణాల దర్శనం ఉంటుంది.
అదేరోజు మధ్యాహ్నం సరిగ్గా 1:00 గంటకు రాజప్రతినిధి నేతృత్వంలో తిరువాభరణాల పేటికలు శబరిమలకు పయనమవుతాయి. సాధారణంగా మండల కాలంలో (నవంబర్ నుంచి జనవరి వరకు) భక్తులు ఈ ఆభరణాలను దర్శించుకోవడానికి వీలు కల్పిస్తారు, ప్రత్యేకించి డిసెంబర్ 31 నుండి జనవరి 11 వరకు దర్శనం ఉంటుంది.
పందలం శ్రాంబికల్ కొట్టారంలోని తిరువాభరణ మాళిగ అంటే..
అయ్యప్ప స్వామి పవిత్ర ఆభరణాలు (Thiruvabharanam) భద్రపరిచే ప్రదేశం, దీని సంరక్షణ భాద్యత పందలం రాజకుటుంబం వారిది. ఆ ఆభరణాలు మకరజ్యోతి పండుగ సమయంలో శబరిమలకి ఊరేగింపుగా తీసుకెళ్లి..ఆ తర్వాత తిరిగి ఇక్కడికే వస్తాయి. ఈ మాళిగను మండలకాలంలో భక్తులు దర్శించుకోవచ్చు.
(చదవండి: మండల పూజ సీజన్‌లో శబరిమల కొత్త ఆదాయ రికార్డు)


