పథనంతిట్ట: మండల సీజన్‌లో భాగంగా ఆదివారం శబరి ఆలయం తలుపులు తెరుచుకోగా.. సోమవారం ఉదయం నుంచి నెయ్యాభిషేకాలు ప్రారంభమయ్యాయి. అయితే.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరిట సోమవారం ఉదయం తొలి నెయ్యాభిషేకం జరిగింది. అదేంటి? ఇరుముడిలోని ముద్ర టెంకాయల్లో ఉండే నేతినే కదా అభిషేకం చేయాల్సింది?? గత నెల ముర్ము వస్తే.. ఇప్పుడు అభిషేకం ఎలా జరిగిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా.. అందుకు కారణముందని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(టీడీబీ) అధికారులు చెబుతున్నారు.
శబరిమల సన్నిధానంలో ఉదయం 7 నుంచి 11 గంటల వరకు నెయ్యాభిషేకాలు జరుగుతాయి. అయితే.. అక్టోబరు నెలలో 22వ తేదీ వరకు సన్నిధానం ఓపెన్ ఉంది. రాష్ట్రపతి ముర్ము సరిగ్గా అక్టోబరు 22న శబరిమలను దర్శించుకున్నారు. అప్పటికే నెయ్యాభిషేకం సమయం దాటిపోయింది. దాంతో ప్రధాన తంత్రి/మేల్‌శాంతి ఆమె ఇరుముడిని భద్రపరిచారు. మండల సీజన్ కోసం ఆదివారం శబరిమల ఆలయం తిరిగి తెరుచుకోగా.. సోమవారం ఉదయం నుంచి నెయ్యాభిషేకాలు మొదలయ్యాయి. దీంతో.. ముర్ము ఇరుముడిలోని ముద్ర టెంకాయలోని నేతితో తొలుత అయ్యప్పకు అభిషేకం చేశారు. అలా.. మండల సీజన్‌లో తొలి నెయ్యాభిషేకం రాష్ట్రపతి ముర్ము చేయించినట్లయిందని టీడీబీ అధికారులు చెబుతున్నారు.


