సాక్షి, తిరువనంతపురం: శబరిమలలో ఇవాళ, రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొట్టాయం, ఇడుక్కి, అలప్పుజా, పతనం తిట్ట, కొల్లాం, తిరువనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ శబరిమల యాత్ర ప్రాంతంతో సహా మొత్తం ఆరు ఇతర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావమే ఈ భారీ వర్షాలకి కారణం అని వాతావరణ శాఖ తెలిపింది. అందువల్ల ఈ రోజు, రేపు శబరిమల సన్నిధానం, పంప, నీలక్కల్ తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆయా ప్రాంతల్లో తప్పనిసరిగా..
సన్నిధానం, పంబా, నీలక్కల్‌లలో ఇవాళ, రేపు 7 సెం.మీ నుంచి 11 సెం.మీ వరకు వర్షం పడే అవకాశం ఉంది
అలర్ట్ జారీ చేయబడిన జిల్లాల్లో 24 గంటల్లో 64.5 మిమీ నుంచి 115.5 మిమీ వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
అయ్యప్ప భక్తులకు భద్రతా సూచనలు
భారీ వర్ష హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ యాత్రికులకు ప్రత్యేక హెచ్చరిక సూచనలు జారీ చేసింది.
కొండచరియలు విరిగిపడటం, బురదజల్లులు, పర్వత వరదలకు గురయ్యే ప్రాంతాలలో నివసించేవారు, అలాగే నదుల వెంబడి, ఆనకట్టల దిగువన నివసించేవారు అధికారుల సూచనల మేరకు వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని విపత్తు నిర్వహణ అథారిటీ సూచించింది.
విపత్తు సంభవించే ప్రాంతాల్లో నివసించేవారు పగటిపూట సమీపంలోని సహాయ శిబిరాలకు తరలి వెళ్లాలి. వాటి సమాచారం కోసం ప్రజలు స్థానిక స్వపరిపాలన, రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చు.
బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున, భద్రత లేని ఇళ్లు లేదా బలహీనమైన పైకప్పులు ఉన్న ఇళ్లలో నివసించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.
వర్షపు రోజుల్లో అనవసరమైన ప్రయాణాలు, పర్వతారోహణను నివారించాలి.
శబరిమల దర్శనానికి వచ్చే భక్తులు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అలాగే భద్రతాధికారుల సూచనల మేరకు ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉందన స్పష్టం చేసింది కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ.
(చదవండి: శబరిమల సన్నిధానం వసతి సౌకర్యాల వివరాలు ఇవిగో..!)


