సాక్షి,తమిళనాడు: భారత్-పాక్ వివాదంలో అమెరికా-చైనా జోక్యం అంశంపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఘాటుగా స్పందించారు. భారత్‌కు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పే స్థాయి ఎవరికి లేదని పరోక్షంగా హెచ్చరించారు. పాకిస్థాన్ లాంటి చెడ్డ పొరుగుదేశంతో భారత్ సరిహద్దు పంచుకోవాల్సి రావడం నిజంగా బాధాకరమన్నారు. ఐఐటీ మాద్రాస్ క్యాంపస్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఆపరేషన్ సిందూర్ అనంతరం ఇండియా ఎయిర్‌ఫోర్స్ కెపాసిటీ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. పాక్ టెర్రరిస్టులను వారి సొంత దేశంలో భారత్ మట్టి కరిపించింది. అంతే కాకుండా ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమేనని దాయాది దేశాన్ని హెచ్చరించింది. ఆ తదనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కాల్పులు విరమణ జరిగింది.
ఇంతవరకూ బాగానే ఉన్నా ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీరు తలనొప్పిగా మారింది. ఈ యుద్ధం తాను చెబితేనే ఆగిందని, పన్నులు పెంచుతానని హెచ్చరించడంతో ఇరు దేశాలు యుద్ధాన్ని ఆపాయని క్రెడిట్ కొట్టే ప్రయత్నం చేశారు. భారత్ ఈ విషయంపై ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా ట్రంప్ తన తీరు మార్చుకోవడం లేదు. ఇది చాలదన్నట్లు ఇటీవల డ్రాగన్ కంట్రీ సైతం ఇదే తంతు ఎత్తుకుంది. ఇండియా పాక్ యుద్ధాన్ని తామే నివారించామని ఇటీవల ఆదేశ విదేశాంగ శాఖ మంత్రి ప్రగల్భాలు పలికారు.
ఈ సందర్భంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. " భారత్‌కు ఏంచేయాలో, ఏం చేయకూడదో చెప్పే హక్కు ఎవరికీ లేదు తమ దేశాన్ని ఎలా రక్షించుకోవాలో ఇండియాకు చాలా క్లియర్‌గా తెలుసు’ అంటూ పరోక్షంగా ఈ రెండు దేశాలకు కౌంటరిచ్చారు.
అనంతరం పాకిస్థాన్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ " ప్రతిఒక్కరికీ చుట్టుప్రక్కల వారు ఉంటారు. అలాగే భారత్‌కు ఉన్నారు. అయితే వారు చెడ్డవారు. మన సరిహద్దుకు పశ్చిమ దిక్కునున్న దేశం దిక్కు చూస్తే వారు తరచుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మన ప్రజలను టెర్రరిజం నుంచి కాపాడుకోవాల్సిన హక్కు దేశానికి ఉంది. ప్రస్తుతం అదే చేస్తున్నాం" అని జైశంకర్ అన్నారు.
అదేవిధంగా ఆయన సిందూనది జలాల ఒప్పందం అంశంపై మాట్లాడుతూ. "చాలా సంవత్సరాల క్రితం సిందూనది జలాల ఒప్పందం చేసుకున్నాము. కానీ దశాబ్ధాలుగా మనకు సత్సంబంధాలు లేవు. మంచి సంబంధాలు లేనప్పుడు దాని ఫలితాలు అదే విధంగా ఉంటాయి. దయచేసి మీరు మాకు నీరు ఇవ్వండి మేము మాత్రం ఉగ్రవాదులని మీదేశానికి పంపుతాము అంటే ఏలా కుదురుతుంది" అని జైశంకర్ ప్రశ్నించారు.
గతేడాది ఏప్రిల్‌లో పహల్గామ్ ఉగ్రదాడిలో 26మంది టూరిస్టులు మృతి చెందారు. దీనికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్‌లోని పలు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్‌లో దాదాపు 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.


