సాక్షి,హైదరాబాద్: మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురు దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. మడావి హిడ్మా సన్నిహితుడు, బెటాలియన్ కమాండర్ బర్సేదేవా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు(సీఎంసీకి)వెన్నెముకగా నిలిచిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) కార్యకలాపాలు ముగిసినట్లేనన్న భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే హిడ్మా మృతితో కోలుకోలేని దెబ్బ తగలగా.. తాజాగా బెటాలియన్ కమాండర్ బర్సేదేవా తెలంగాణ డీజీపీ శివదర్ రెడ్డి ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఆయనతో పాటు మరో పాటు మరో 19 మంది కమిటీ సభ్యులు సైతం ఉన్నారని.. రేపోమాపో వారిని పోలీసుల ఎదుట ప్రవేశ పెట్టనున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కొద్ది రోజుల క్రితం మావోయిస్టు లిబరేషన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న మడివి హిడ్మా పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో బరిసే దేవాను మావోయిస్టు పార్టీ నియమించింది. ప్రస్తుతం ఆయన సైతం ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
కాగా మడివి హిడ్మా, బరిసేదేవా ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారు. మావోయిస్టు పార్టీకి ఆయుధాలు సరఫరా చేయడంలో బరిసే దేవా కీలక పాత్ర పోషించారు. బరిసే దేవా లొంగుబాటు సందర్భంగా పోలీసులు ఆయన దగ్గరినుంచి పెద్ద మెుత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.పోలీసుల అదుపులో ఉన్న బరిసే దేవా రేపు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.


