పెళ్లికి ముందు ఎవరినీ నమ్మొద్దు  | Supreme Court strong verbal remarks on pre marital relationships | Sakshi
Sakshi News home page

పెళ్లికి ముందు ఎవరినీ నమ్మొద్దు 

Feb 16 2026 6:30 PM | Updated on Feb 17 2026 6:32 AM

Supreme Court strong verbal remarks on pre marital relationships

అస్సలు హద్దు మీరొద్దు 

శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు 

సాక్షి, న్యూఢిల్లీ: సహజీవన ఘటనలపై సర్వోన్నతన్యాయస్థానం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ‘‘పెళ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ ఒకరికొకరు అపరిచితులే. బంధం ఎంత గాఢమైనదైనా సరే పెళ్లికి ముందే శారీరక సంబంధం పెట్టుకోవడందాకా ఎందుకు వెళ్తున్నారో మాకైతే అర్థంకావట్లేదు. మేము పాతకాలం మనుషులమే కావచ్చు.. కానీ పెళ్లికి ముందు ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఆచితూచి అడుగులేయాలి’’అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ దాఖలైన ఓ బెయిల్‌ పిటిషన్‌ విచారణ సందర్భంగా జస్టిస్‌ బి.వి. నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ల ధర్మాసనం ఈ ఘాటు వ్యాఖ్యలు చేసింది. 

అసలేం జరిగిందంటే? 
నిందితుడు 2022లో ఓ మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌ ద్వారా 30 ఏళ్ల మహిళకు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే నిందితుడికి అప్పటికే వివాహమైంది. ఆ విషయాన్ని దాచిపెట్టి, సదరు మహిళతో ఢిల్లీలో పలుమార్లు శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అనంతరం ఆమెను తనతో పాటు దుబాయ్‌కు తీసుకెళ్లాడు. అక్కడ కూడా పెళ్లి ప్రస్తావన తెచ్చి సహజీవనం చేశాడు. ఈ క్రమంలో ఆమెకు తెలియకుండా సాన్నిహిత్య వీడియోలను రికార్డ్‌ చేశాడు. 

పెళ్లి గురించి అడిగితే ఆ వీడియోలను బయటపెడతానని బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు. ఇంత జరుగుతున్నా బాధితురాలిని కాదని 2024 జనవరి 19వ తేదీన నిందితుడు పంజాబ్‌లో మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో బెయిల్‌ కోసం నిందితుడు ప్రయతి్నంచగా అక్కడ చుక్కెదురైంది. దీంతో అతను బెయిల్‌ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. 

మీకెందుకు అంత చనువు? 
సోమవారం విచారణ సందర్భంగా జస్టిస్‌ నాగరత్న స్పందిస్తూ.. ’పెళ్లికి ముందు ఎంత చనువున్నా సరే, వారు అపరిచితుల కిందే లెక్క. ఒకవేళ ఆ మహిళకు పెళ్లి, సాంప్రదాయంపై అంత పట్టింపు ఉంటే, పెళ్లి కాకుండానే అతనితో దుబాయ్‌ ఎందుకు వెళ్లింది?’అని ప్రశ్నించారు. ‘నేటి కాలంలో ఇలాంటి కేసులు చూస్తుంటే మాకు అర్థం కావడం లేదు. పెళ్లికి ముందే అన్నీ జరిగిపోతున్నాయి. యువత జాగ్రత్తగా ఉండాలి’అని హితవు పలికారు. మ్యాట్రిమోనియల్‌ సైట్‌లో పరిచయమై, పెళ్లి చేసుకోవాలనుకున్నారు కదా అని ప్రభుత్వ న్యాయవాది బదులివ్వగా ‘పెళ్లి చేసుకోవాలనుకోవడం వేరు.

 పెళ్లి కాకుండానే అన్నీ జరిగిపోవడం వేరు. ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు’అని కోర్టు వ్యాఖ్యానించింది. ఇది ఇద్దరి అంగీకారంతో కొనసాగిన శారీరక బంధంలా కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది. ‘పరస్పర సమ్మతితో కొనసాగిన ఇలాంటి కేసుల్లో విచారణలు జరిపి, దోషులుగా తేల్చి జైలుకు పంపడంలో హేతుబద్ధత లేదు. ఇద్దరూ కలిసి మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలి. అవసరమైతే బాధితురాలికి నిందితుడు తగు నష్టపరిహారం ఇవ్వాలి’అని జస్టిస్‌ నాగరత్న సూచించారు. ఇద్దరూ మాట్లాడుకుని వివాదపరిష్కారానికి అవకాశాన్ని పరిశీలించాలని కేసును బుధవారానికి వాయిదా వేశారు.

చ‌ద‌వండి: కొలీగ్‌పై ఫీలింగ్స్ వ‌స్తున్నాయి.. ఏం చేయ‌ను?

Advertisement
 
Advertisement
Advertisement