‘వృద్ధాప్యంలో విడాకులేంటి?’.. చివాట్లు పెట్టిన కోర్టు | Couple Married for 58 Years Seeks Divorce Court Says | Sakshi
Sakshi News home page

‘వృద్ధాప్యంలో విడాకులేంటి?’.. చివాట్లు పెట్టిన కోర్టు

Feb 16 2026 11:56 AM | Updated on Feb 16 2026 11:56 AM

Couple Married for 58 Years Seeks Divorce Court Says

వారిది అరవై ఏళ్లకు సమీపించిన వైవాహిక జీవితం.. ముగ్గురు పిల్లలు.. మనవలు.. మనవరాళ్లు.. ఇన్ని దశాబ్దాల ప్రయాణం తర్వాత వారు విడిపోతామంటే కోర్టు ఒప్పుకుంటుందా? ‘భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు సహజం.. వాటిని క్రూరత్వం అని పిలవలేం’ అంటూ రాజస్థాన్ హైకోర్టు ఒక వృద్ధ దంపతుల విడాకుల పిటిషన్‌ను కొట్టివేస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.

భరత్‌పూర్‌కు చెందిన ఈ జంటకు 1967, జూన్ 29న వివాహం జరిగింది. దాదాపు 46 ఏళ్ల పాటు (2013 వరకు) ఎలాంటి తగాదాలు లేకుండా వీరి సంసారం సాఫీగానే సాగింది. అయితే ఆస్తి పంపకాలు, వ్యక్తిగత ఆరోపణల నేపథ్యంలో 2014లో భర్త విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు. ఫ్యామిలీ కోర్టు విడాకులకు నిరాకరించడంతో, ఆయన హైకోర్టును ఆశ్రయించారు.

తన భార్య తనపై తప్పుడు వరకట్న వేధింపుల కేసు పెట్టిందని, దీనివల్ల సమాజంలో తన ప్రతిష్ట దెబ్బతిన్నదని ఆయన ఆరోపించారు. అలాగే, ఆస్తిని పెద్ద కొడుకుకే ఇవ్వాలని ఆమె పట్టుబడుతోందని, తనపై అక్రమ సంబంధాల ఆరోపణలు చేస్తూ, మానసికంగా వేధిస్తోందని పేర్కొన్నారు.అయితే తన భర్త .. అతని తమ్ముడి మాటలు విని ఆస్తిని వృథా చేస్తున్నారని భార్య వాదించింది. ఆయనకు వేరే మహిళతో సంబంధం ఉందని, అందుకే తనను వదిలించుకోవాలని చూస్తున్నారని ఆరోపించింది. వివాదంలో ఉన్న ఆస్తిని తన సొంత డబ్బుతో కొనుగోలు చేసినట్లు ఆమె స్పష్టం చేసింది.

జస్టిస్ సుదేష్ బన్సాల్, జస్టిస్ అనిల్ కుమార్ ఉప్మాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును నిశితంగా పరిశీలించి తన అభిప్రాయం వ్యక్తం చేసింది. దశాబ్దాల పాటు కలిసి ఉన్న దంపతుల్లో వయస్సుతో పాటు సహనం, అవగాహన పెరగాలి కానీ ఇలాంటి చిన్న కారణాలతో విడిపోకూడదు. కుటుంబంలో ఆస్తి తగాదాలు రావడం సహజం, అంతమాత్రాన అది విడాకులు ఇచ్చేంత ‘క్రూరత్వం’ కిందకు రాదు. ఈ వయస్సులో విడాకులు మంజూరు చేస్తే కేవలం ఆ దంపతులకే కాకుండా, వారి పిల్లల గౌరవానికి భంగం కలుగుతుంది అని పేర్కొంది. చిన్నపాటి మనస్పర్థలను విడాకుల వరకు తీసుకెళ్లడం సరికాదని చెబుతూ, భర్త దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. 58 ఏళ్ల బంధాన్ని గౌరవించాలని ఆ వృద్ధ దంపతులకు హితవు పలికింది.

ఇది కూడా చదవండి: ప్రియంకా చోప్రా భారత్‌కు గర్వకారణం: శశి థరూర్

Advertisement
 
Advertisement
Advertisement