హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. ఈ పవిత్రమైన పండుగ రోజున అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలలో కనిపించే మకర జ్యోతి దర్శనం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఆ మకర జ్యోతిని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి శబరిమలకు వస్తుంటారు. పవిత్రమైన మకర జ్యోతి దర్శనం అనేది అందరికీ కలిగే భాగ్యం కాదు.. ఎంతో పుణ్యం .. ఎన్నో జన్మల అదృష్టం ఉంటే గానీ ఆ జ్యోతి దర్శన భాగ్యం కలుగదనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేగాదు అపురూప దృశ్యం కోసం గంటల కొద్దీ క్యూ లైన్‌లో వేచి ఉంటారు. అలాంటి పవిత్ర ఘడియ మకర జ్యోతి 2026లో ఎప్పుడంటే..
శబరిమలలో మకర జ్యోతి దర్శనం జనవరి 14, 2026 సాయంత్రం సుమారు 6:30 PM నుండి 6:55 PM (IST) మధ్య జరుగుతుందని అంచనా. ఈ సమయంలో భక్తులు పొన్నంబలమేడు వద్ద ఆకాశంలో కనిపించే దివ్యమైన జ్యోతిని దర్శిస్తారు. ఈ జ్యోతి అయ్యప్ప స్వామి ఆశీస్సులను సూచిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
మకర జ్యోతి శబరిమల యాత్రలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక ఘట్టం. ఈ జ్యోతి అయ్యప్ప స్వామి దివ్య సాన్నిధ్యాం తోపాటు ఆధ్యాత్మిక శక్తిని, శాంతిని ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకం. మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ సమయం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఈ సందర్భంగా భక్తులు కఠినమైన వ్రత దీక్షను పాటిస్తూ, 41 రోజుల పాటు నియమ నిష్టలతో అయ్యప్ప స్వామిని ఆరాధిస్తారు.
ప్రధాన ఆకర్షణగా స్వామి తిరువాభరణ ఊరేగింపు..
మకర జ్యోతి రోజున పందళం మహారాజుల మహల్ నుంచి మూడు పెట్టెల్లో పవిత్ర తిరువాభరణాలు శబరిమలకి తీసుకువస్తారు. ఆ రోజు సాయంత్రం అయ్యప్ప స్వామికి తిరువాభరణ అలంకారం చేస్తారు. అనతరం దీపారాధన నిర్వహిస్తారు. ఇక ఈ రోజు పొన్నంబలమేడులో మకర జ్యోతి మూడు సార్లు దర్శనం ఇస్తుంది.
మకర జ్యోతి దర్శనం కనబడే ప్రదేశాలు
సన్నిధానం
పాండితావళం
మాలికాపురం ప్రాంతం – అట్టతోడు
నీలిమల
పుల్మేడు
శరణ్ గుత్తి
మరకూట్టం
భక్తులకు సూచనలు..
మకర జ్యోతి దర్శనం కోసం వెళ్లే భక్తులు ముందుగానే ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆలయ అధికారులు భక్తుల సౌకర్యం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. అలాగే భక్తులు రద్దీని దృష్టిలో ఉంచుకుని, అధికారుల సూచనలను పాటించాలి. చివరగా ఈ మకర జ్యోతి దర్శనం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం తోపాటు అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులను పొందే గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది.
కొత్త ఏడాదిలో ఈ పవిత్ర క్షణాన్ని దర్శించేందుకు భక్తులంతా సిద్ధంగా ఉండాలి. కాగా, భక్తులకు జనవరి 19, 2026 రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అవకాశం ఉంటుంది. జనవరి 20, 2026 శబరిమల ఆలయాన్ని తిరిగి మూసివేస్తామని దేవస్వం బోర్డు పేర్కొంది.
(చదవండి: శబరిమల మండల పూజ ఆదాయం రూ. 332 కోట్లు..!)


