స్వచ్ఛనగరంగా వరుసగా ఎనిమిదేళ్లపాటు వరుసగా అవార్డులు అందుకున్న ఇండోర్‌లో జరిగిన ఘటన.. దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. తాగునీటిలో కలుషిత నీరు కలిసి వేల మంది అస్వస్థతకు గురికావడంతో ఆ అవార్డులపైనే అనుమానాలు కలిగిస్తోంది. ఈ ఘటనలో పసికందులతో పాటు పెద్దలూ ప్రాణాలు పొగొట్టుకున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం సంగతి ఎలా ఉన్నా.. తాగునీటి భద్రత ఎంత ముఖ్యమో చెబుతూ మన చేతుల్లో ఉన్న జాగ్రత్తలనూ ఈ ఉదంతం మనకు గుర్తు చేస్తోంది.
మంచి నీరు ఆరోగ్యానికి రక్షణ కవచం. కొన్ని సాధారణ.. అత్యవసరమైన సూచనలు పాటించడం ద్వారా ఆ కవచాన్ని మనం కాపాడుకోవచ్చు. అందులో మొదటిది.. చాలా ఇళ్లలో చేసేది..
తాగేముందు నీటిని బాగా మరిగించడం. ఇది అత్యంత ప్రభావవంతమైన పద్ధతి. ఇది బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులను నాశనం చేస్తుందిA.
ఫిల్టర్ లేదంటే శుద్ధి పద్ధతులు.. మార్కెటలో దొరికే రకరకాల ఫిల్టర్లను ఉపయోగించొచ్చు. లేదంటే క్లోరినేషన్ తరహా నీటి శుద్ధి పద్ధతులు ఉపయోగించడం మంచిది. తద్వారా నీటిలోని హానికర సూక్ష్మజీవులు, రసాయనాలు తొలగిపోతాయి.
తాగే నీటిని నీటిని శుభ్రమైన పాత్రల్లో నిల్వ చేయాలి. మూత ఉన్న కంటైనర్‌లో ఉంచడం ద్వారా దుమ్ము, పురుగులు, ఇతర కలుషితాలు చేరకుండా ఉంటుంది.
వ్యక్తిగత శుభ్రత కూడా ఇక్కడ పరిశీలించాల్సిన అంశం. తాగునీటిని తీసుకునే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. గ్లాసులు, బాటిళ్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
అత్యవసర పరిస్థితుల్లో.. ప్రభుత్వం లేదంటే స్థానిక సంస్థలు కలుషిత నీటి హెచ్చరికలు జారీ చేసినప్పుడు, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటిని మాత్రమే వినియోగించాలి. వాటని వేడి చేసి తాగాలనే ప్రయత్నమూ అంత మంచిది కాకపోవచ్చు.
డయేరియా, వాంతులు, జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఆలస్యం చేస్తే పరిస్థితి చేజారిపోయే అవకాశం ఉంటుంది.
నీటిని మరిగించడం, శుద్ధి పద్ధతులు ఉపయోగించడం, నిల్వలో పరిశుభ్రత పాటించడం, వ్యక్తిగత హైజీన్ కాపాడుకోవడం.. పైన చెప్పుకున్నవన్నీ కలుషిత నీటి ప్రమాదాల నుండి రక్షణ కలిగించే సాధారణ కానీ అత్యంత ప్రభావవంతమైన చర్యలు. నీరు సురక్షితంగా ఉంటేనే ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.


