టీమిండియాతో మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ (పాత ఫొటో)
ప్రపంచంలోనే మేటి టీ20 లీగ్‌గా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కొనసాగుతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆధ్వర్యంలో 2008లో మొదలైన ఈ టోర్నమెంట్ కారణంగా ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు.
కేవలం భారత్‌కు చెందిన ఆటగాళ్లే కాకుండా.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, జింబాబ్వే తదితర దేశాలకు చెందిన క్రికెటర్లు ఐపీఎల్ ద్వారా భారీ స్థాయిలో సంపాదించడంతో పాటు పేరు తెచ్చుకుంటున్నారు కూడా!
ఐపీఎల్ ఆడకుండా నిషేధం
అయితే, ఆరంభంలో పాకిస్తాన్ ప్లేయర్లు సైతం క్యాష్ రిచ్ లీగ్‌లో ఆడేవారు. వసీం అక్రం, షోయబ్ అక్తర్, మిస్బా ఉల్ హక్, ఉమర్ గుల్, కమ్రాన్ అక్మల్, షోయబ్ మాలిక్, సొహైల్ తన్వీర్ వంటి వాళ్లు ఆరంభ సీజన్‌లో ఆడారు. అయితే, ఆ తర్వాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 2009 నుంచి పాక్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించింది బీసీసీఐ.
తాజాగా బంగ్లాదేశ్ క్రికెటర్లకు సైతం ఇదే దుస్థితి కలిగే అవకాశం ఉంది. భారత్ నుంచి ఎల్లవేళలా మద్దతు, సాయం పొందిన బంగ్లాదేశ్ కొన్నాళ్లుగా విచిత్ర పోకడలకు పోతోంది. ఆ దేశంలోని కొంతమంది నేతలు భారత్‌ను విమర్శిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
బంగ్లా ప్లేయర్లను నిషేధించాలనే డిమాండ్లు
ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే నలుగురు హిందువులు దారుణ హత్యకు గురైనట్లు వార్తలు వచ్చాయి.
ఇలాంటి పరిస్థితుల్లో ఐపీఎల్ నుంచి బంగ్లా ప్లేయర్లను నిషేధించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కాగా ఐపీఎల్-2026 మినీ వేలంలో ఐదు నుంచి ఆరుగురు క్రికెటర్లు పేరు నమోదు చేసుకోగా.. లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ మాత్రమే అమ్ముడుపోయాడు. షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని రూ. 9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
అతడొక ద్రోహి..
ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ నేత సంగీత్ సింగ్ సోమ్ షారుఖ్ ఖాన్‌పై విమర్శలు గుప్పించారు. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న బంగ్లాదేశ్‌కు చెందిన ప్లేయర్‌ను కొన్న షారుఖ్‌ను ద్రోహిగా అభివర్ణించారు. ఈ క్రమంలో ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తొలగించాలంటూ ఆయనకు కొంతమంది మద్దతు తెలపగా..కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు మాత్రం ఈ వ్యాఖ్యలను ఖండించారు.
బీసీసీఐ స్పందన ఇదే
అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రమాణాలకు అనుగుణంగా బీసీసీఐ ఈ లీగ్‌ను నిర్వహిస్తోందని.. ఇందులో రాజకీయ జోక్యం అనవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు ఈ పరిణామాలపై స్పందించారు.
ఇన్‌సైడ్ స్పోర్ట్‌తో మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్ శత్రు దేశమేమీ కాదు. ఇప్పటికైతే బంగ్లాదేశ్ ప్లేయర్లు ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించాల్సిన అవసరం కనబడటం లేదు’’ అని పేర్కొన్నారు. కాబట్టి ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఈ ఏడాది ఐపీఎల్ బరిలో దిగే అవకాశం ఉంది.
ఎలాంటి ఆదేశాలు రాలేదు
మరోవైపు బీసీసీఐ సన్నిహిత వర్గాలు తాజాగా IANSతో మాట్లాడుతూ.. ‘‘ఈ విషయంలో మేము పెద్దగా స్పందించాలనుకోవడం లేదు. మా చేతుల్లో ఏమీ లేదు. అయితే, బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఐపీఎల్ నుంచి నిషేధించే అంశమై ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలూ రాలేదు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేము’’ అని పేర్కొన్నాయి.
చదవండి: న్యూజిలాండ్‌తో వన్డేలకు భారత జట్టు ఇదే!.. వాళ్లిద్దరికి మొండిచేయి!


