న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌తో కొత్త సంవత్సరాన్ని మొదలుపెట్టనుంది టీమిండియా. ఇరుజట్ల మధ్య జనవరి 11, 14, 18 తేదీల్లో మూడు మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. అనంతరం భారత్- కివీస్ (IND vs NZ) జట్లు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడతాయి.
ఇందుకు సంబంధించి న్యూజిలాండ్ ఇప్పటికే తమ వన్డే, టీ20 జట్లు ప్రకటించగా.. భారత్ కేవలం టీ20 జట్టు వివరాలను మాత్రమే వెల్లడించింది. దేశీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26 ప్రదర్శన ఆధారంగా.. శనివారం వన్డే జట్టును కూడా ప్రకటించే అవకాశం ఉంది.
జైస్వాల్‌కు చోటు దక్కినా..
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా న్యూజిలాండ్‌తో వన్డేలకు తన జట్టును ఎంచుకున్నాడు. టాపార్డర్‌లో కెప్టెన్ శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ.. విరాట్ కోహ్లిలను కొనసాగించాడు ఈ మాజీ ఓపెనర్.
ముంబై తరఫున ఇటీవల సెంచరీతో రాణించిన టెస్టు జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal)కు.. తుదిజట్టులో ఇప్పుడే చోటు దక్కదని.. ఇంకొన్నాళ్లు వేచిచూడక తప్పదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఇక మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోని కారణంగా.. అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌నే సెలక్టర్లు కొనసాగిస్తారని పేర్కొన్నాడు.
పంత్‌కు చోటెలా?
అదే విధంగా వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కు చోటిచ్చిన ఆకాశ్ చోప్రా.. వైస్ కెప్టెన్‌గా అతడే ఉంటాడని అభిప్రాయపడ్డాడు. ఇక బ్యాకప్ వికెట్ కీపర్‌గా సంజూ శాంసన్‌ను కాదని.. వన్డేల్లో మెరుగైన రికార్డు లేని, విజయ్ హజారే మ్యాచ్‌లలో విఫలమవుతున్న రిషభ్ పంత్‌ను ఎంపిక చేసుకున్నాడు.
ఇక స్పిన్ ఆల్‌రౌండర్ల విభాగంలో వాషింగ్టన్ సుందర్‌కు ఓటు వేసిన ఆకాశ్ చోప్రా.. లెఫ్టార్మ్ బౌలర్లలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలలో ఒకరినే సెలక్టర్లు ఎంపిక చేస్తారని అభిప్రాయపడ్డాడు. అక్షర్ ఐదు టీ20లతో పాటు వరల్డ్‌కప్ ఆడాల్సి ఉన్నందున వన్డేల నుంచి అతడికి విశ్రాంతినివ్వవచ్చని పేర్కొన్నాడు. అందుకే కివీస్‌తో వన్డేల్లో జడ్డూనే ఆడతాడని అంచనా వేశాడు.
సంజూతో పాటు షమీకీ మొండిచేయి
తన జట్టులో తిలక్ వర్మకు కూడా చోటుందన్న ఆకాశ్ చోప్రా.. పేసర్ల విభాగంలో మొహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ తుదిజట్టుకు కూడా ఎంపిక అవుతారని పేర్కొన్నాడు. వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీని మాత్రం అతడు పరిగణనలోకి తీసుకోలేదు.
ఇక స్పెషలిస్టు స్పిన్నర్‌గా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌కు ఆకాశ్ చోప్రా ఓటువేశాడు. కాగా కివీస్‌తో టీ20 మ్యాచ్‌లు, ప్రపంచకప్-2026 దృష్ట్యా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో పాటు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు వన్డేల నుంచి మేనేజ్‌మెంట్ విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం.
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఆకాశ్ చోప్రా ఎంచుకున్న భారత జట్టు
శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్/రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ, రిషభ్ పంత్, యశస్వి జైస్వాల్.
చదవండి: పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడిని.. ఇక్కడ ఇలా: ఉస్మాన్ ఖవాజా


