టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లకు న్యూజిలాండ్ క్రికెట్ తమ జట్లను ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న రెగ్యులర్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ భారత పర్యటనలో భాగంగా పునరాగమనం చేయనున్నాడు. అయితే, ఫిట్‌నెస్ దృష్ట్యా వన్డే సిరీస్‌కు సెలక్టర్లు అతడికి విశ్రాంతినిచ్చారు.
రెండు జట్లకు ఇద్దరు కెప్టెన్లు
ఫలితంగా వన్డేల్లో సాంట్నర్‌కు బదులు మైకేల్ బ్రేస్‌వెల్ సారథ్యం వహించనున్నాడు. ఇక టీ20 సిరీస్‌కు మాత్రం సాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మరోవైపు.. పేసర్ కైలీ జెమీషన్ గాయం నుంచి పూర్తిగా కోలుకుని భారత్‌తో వన్డే, టీ20 సిరీస్‌లలో భాగం కానున్నాడు.
గాయాల బెడద.. వీరంతా దూరం
ఇక ముందుగా ఊహించినట్లుగానే మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్.. సౌతాఫ్రికా టీ20లో భాగమైన నేపథ్యంలో.. భారత్‌తో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నాడు. మిగిలిన వారిలో నాథన్ స్మిత్, బ్లెయిర్ టిక్నర్, మార్క్ చాప్‌మన్, మ్యాట్ హెన్రీ గాయాల వల్ల ఆటకు దూరమయ్యారు. ఇదిలా ఉంటే.. టామ్ లాథమ్ తన మొదటి సంతానానికి ఆహ్వానం పలికే క్రమంలో ఈ టూర్ మిస్సయ్యాడు.
అదే విధంగా.. జేకబ్ డఫీ, రచిన్ రవీంద్రలకు వన్డేల నుంచి విశ్రాంతినిచ్చారు. మరోవైపు.. లెఫ్టార్మ్ స్పిన్నర్ జేడెన్ లెనాక్స్‌ను తొలిసారి జాతీయ జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు. క్రిటిసాన్ క్లార్క్, ఆది అశోక్, జోష్ క్లార్క్‌సన్, నిక్ కెల్లీ, మేకేల్ రేలకు కూడా మేనేజ్‌మెంట్ ఈ జట్లలో చోటు కల్పించింది.
భారత్‌తో వన్డేలకు న్యూజిలాండ్ జట్టు
మైకేల్ బ్రేస్‌వెల్ (కెప్టెన్), ఆది అశోక్, క్రిస్టియన్ క్లార్క్, జోష్ క్లార్క్‌సన్, డెవాన్ కాన్వే, జాక్ ఫౌల్క్స్, మిచ్ హే, కైలీ జెమీషన్, నిక్ కెల్లీ, జేడెన్ లెనాక్స్, డారిల్ మిచెల్, హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ రే, విల్ యంగ్.
భారత్‌తో టీ20లకు న్యూజిలాండ్ జట్టు
మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జేకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్, మాట్ హెన్రీ, కైలీ జెమీషన్, బెవాన్ జాకబ్స్, డారిల్ మిచెల్, జేమ్స్ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, టిమ్ రాబిన్సన్, ఇష్ సోధి.
భారత్ వర్సెస్ న్యూజిలాండ్ షెడ్యూల్
జనవరి 11, 14, 18 తేదీల్లో మూడు వన్డేల సిరీస్
జనవరి 21, 23, 25, 28, 31 తేదీల్లో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్.
చదవండి: రవీంద్ర జడేజా కీలక నిర్ణయం


