టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2025లో భాగమయ్యేందుకు సిద్ధమయ్యాడు. సొంత జట్టు సౌరాష్ట్ర తరపున జడ్డూ రెండు మ్యాచ్‌లు ఆడనున్నాడు.
ఈ విషయాన్ని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. కర్ణాటకలోని ఆలూర్‌లో జనవరి 6, 8న జరిగే మ్యాచ్‌లలో సౌరాష్ట్ర జట్టుకు జడేజా ప్రాతినిథ్యం వహిస్తాడని టైమ్స్ ఆఫ్ ఇండియాతో పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా చాంపియన్‌గా నిలిచిన తర్వాత రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
ఆసీస్ టూర్‌కు ఎంపిక చేయలేదు
ఈ క్రమంలో ప్రస్తుతం వన్డే, టెస్టుల్లో కొనసాగుతున్న జడ్డూను.. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన నుంచి సెలక్టర్లు తప్పించారు. వన్డే జట్టులో అతడికి స్థానం కల్పించలేదు. దీంతో వన్డే వరల్డ్‌కప్-2027 ప్రణాళికల్లో జడ్డూ లేడా అన్న సందేహాలు నెలకొన్నాయి.
ఈ విషయంపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) నాడు స్పందిస్తూ.. ‘‘మా ప్రణాళికల్లో అతడు భాగమే. చాంపియన్స్ ట్రోఫీ జట్టులోనూ అతడు ఉన్నాడు. నాడు పిచ్ పరిస్థితులకు అనుగుణంగా అదనపు స్పిన్నర్లకు జట్టులో చోటిచ్చాం.
అయితే, ఆసీస్‌టూర్‌లో జట్టు సమతూకంగా ఉండేలా చూసుకోవాలి. కాబట్టి వాషీ, కుల్దీప్‌లతో మేము ముందుకు వెళ్తున్నాం. ఒక్కోసారి ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ ఉన్నపుడు ఇలాంటి నిర్ణయాలు తప్పవు. ముఖ్యంగా ఆస్ట్రేలియాలో పిచ్ పరిస్థితులకు తగ్గట్లే జట్టును ఎంపిక చేశాము’’ అని జడ్డూను తప్పించడానికి గల కారణాన్ని వెల్లడించాడు.
సఫారీలతో సిరీస్‌లో సత్తా చాటిన జడ్డూ
అయితే, ఈ టూర్ తర్వాత స్వదేశంలో ఇటీవల సౌతాఫ్రికా (IND vs SA) తో జరిగిన వన్డే సిరీస్‌కు జడేజాను ఆడించింది యాజమాన్యం. తొలి వన్డేలో 20 బంతుల్లోనే 32 పరుగులు చేసిన జడ్డూ.. రెండో వన్డేలో 24 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే, ఈ సిరీస్‌లో ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. కేవలం ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు.
కాగా టీమిండియా తరఫున విధుల్లో లేని సమయంలో ఆటగాళ్లంతా దేశీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఇటీవలే కచ్చితమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గాయం, ఫిట్‌నెస్ సమస్యలు ఉన్నవాళ్లకు మాత్రమే ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా తమ జట్లు ముంబై, ఢిల్లీ తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.
ఇక కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్, అర్ష్‌దీప్ సింగ్, అభిషేక్ శర్మ తదితరులు కూడా తమ జట్ల తరఫున ఆడేందుకు సిద్ధం కాగా.. తాజాగా జడ్డూ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. కాగా లిస్-ఎ క్రికెట్‌లో లెఫ్టాండర్ జడేజా 260 మ్యాచ్‌లు ఆడి.. 3911 పరుగులు చేయడంతో పాటు 293 వికెట్లు కూడా పడగొట్టాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్న తర్వాత.. టీమిండియా స్టార్లు.. న్యూజిలాండ్‌తో సిరీస్‌తో బిజీ అవుతారు.


