టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి దాదాపు పదిహేనేళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీ ఆడనున్నాడు. సొంత జట్టు ఢిల్లీ తరఫున ఈ దేశీ వన్డే టోర్నమెంట్ బరిలో దిగనున్నాడు. ఆంధ్ర జట్టుతో బుధవారం (డిసెంబరు 24) నాటి మ్యాచ్ సందర్భంగా కోహ్లి మరోసారి ఢిల్లీ జెర్సీలో కనిపించనున్నాడు. ఈ జట్టుకు టీమిండియా స్టార్ రిషభ్ పంత్ కెప్టెన్.
ఇక ఐపీఎల్‌లో కోహ్లి ప్రాతినిథ్యం వహించే ఆర్సీబీకి సొంత మైదానం అయిన.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక కావడం మరో విశేషం. కాగా 2010లో కోహ్లి చివరగా విజయ్ హజారే ట్రోఫీ (VHT) టోర్నీ ఆడాడు. సర్వీసెస్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ తరఫున 16 పరుగులు సాధించాడు.
వరుస సెంచరీలు
ఇక ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టు ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి (Virat Kohli).. కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో తొలి రెండు వన్డేల్లో డకౌట్ అయిన కోహ్లి.. మూడో వన్డేలో ధనాధన్ ఫిఫ్టీతో ఫామ్‌లోకి వచ్చాడు.
అనంతరం సౌతాఫ్రికాతో స్వదేశంలో వన్డే సిరీస్‌లో వరుస సెంచరీలతో చెలరేగి ఆకట్టుకున్నాడు. ప్రొటిస్‌తో తొలి వన్డేల్లో ఏకంగా 135 పరుగులు సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. రెండో వన్డేలోనూ 102 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో 53 శతకాలతో ఆల్‌టైమ్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇక ప్రొటిస్‌తో మూడో వన్డేలోనూ కేవలం 45 బంతుల్లో 65 పరుగులతో అజేయంగా నిలిచాడు కోహ్లి.
చరిత్రకు ఒక్క పరుగు దూరంలో
అంతర్జాతీయ వన్డే కెరీర్‌లో 14557 పరుగులు చేసిన కోహ్లి.. తద్వారా లిస్ట్-ఎ క్రికెట్‌లో ఓవరాల్‌గా ఇప్పటికి 15,999 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆంధ్రతో బుధవారం నాటి విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌కు ముందు చరిత్రకు ఒక్క పరుగు దూరంలో నిలిచాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న కోహ్లి ఆంధ్రతో మ్యాచ్‌లో ఒక్క రన్ చేస్తే.. లిస్ట్-ఎ క్రికెట్‌లో 16 వేల పరుగుల మైలురాయి అందుకున్న భారత రెండో క్రికెటర్‌గా నిలుస్తున్నాడు.
ఈ జాబితాలో సచిన్ టెండుల్కర్ కోహ్లి కంటే ముందు వరుసలో ఉన్నాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో 21,999 పరుగులు సాధించాడు. కాగా వన్డేలతో పాటు విజయ్ హజారే ట్రోఫీ, భారత్-ఎ, జోనల్ జట్ల తరఫున సాధించిన పరుగులను లిస్ట్-ఎ జాబితాలో చేర్చుతారు. కాగా ఓవరాల్‌గా ఈ లిస్టులో ఇంగ్లండ్ క్రికెటర్ గ్రాహమ్ గూచ్ 22,211 పరుగులతో టాప్‌లో ఉన్నాడు.
లిస్ట్-ఎ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లు
👉సచిన్ టెండుల్కర్- 538 ఇన్నింగ్స్‌లో 21,999 రన్స్
👉విరాట్ కోహ్లి- 329 ఇన్నింగ్స్‌లో 15,999 రన్స్
👉సౌరవ్ గంగూలీ- 421 ఇన్నింగ్స్‌లో 15,622 రన్స్
👉రోహిత్ శర్మ- 338 ఇన్నింగ్స్‌లో 13,758 రన్స్
👉శిఖర్ ధావన్- 298 ఇన్నింగ్స్‌లో 12,074 రన్స్.


