RCB: విరాట్‌ కోహ్లి పోస్ట్‌ వైరల్‌ | Virat Kohli Lauds Smriti Mandhana on WPL 2026 title win Post Viral | Sakshi
Sakshi News home page

స్మృతి సేనపై ప్రశంసలు... విరాట్‌ కోహ్లి పోస్ట్‌ వైరల్‌

Feb 6 2026 10:36 AM | Updated on Feb 6 2026 11:08 AM

Virat Kohli Lauds Smriti Mandhana on WPL 2026 title win Post Viral

కోహ్లి- స్మృతి (PC: RCB X)

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) మహిళా జట్టుకు టీమిండియా బ్యాటింగ్‌ దిగ్గజం విరాట్‌ కోహ్లి శుభాకాంక్షలు తెలిపాడు. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)లో రెండోసారి చాంపియన్స్‌గా నిలిచి ఆర్సీబీ కుటుంబానికి గర్వకారణమయ్యారంటూ స్మృతి మంధాన సేనను కొనియాడాడు. ఇదొక అద్భుత విజయమని.. ట్రోఫీని ముద్దాడేందుకు ఆర్సీబీ మహిళా జట్టుకు పూర్తి అర్హత ఉందని పేర్కొన్నాడు.

కాగా డబ్ల్యూపీఎల్‌-2026 సీజన్‌లో ఆర్సీబీ ఆరంభం నుంచే వరుస విజయాలు సాధించింది. ఐదు మ్యాచ్‌లు గెలిచి మిగిలిన జట్ల కంటే ముందుగా ప్లే ఆఫ్స్‌ చేరింది. ఇక ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడ్డ ఆర్సీబీ.. ప్రత్యర్థి విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది. తద్వారా రెండోసారి టైటిల్‌ గెలుచుకుంది.

జెమీమా  కెప్టెన్‌ ఇన్నింగ్స్‌
వడోదర వేదికగా టాస్‌ గెలిచిన ఆర్సీబీ తొలుత బౌలింగ్‌ ఎంచుకుని ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు లిజెల్లి లీ (37), షఫాలీ వర్మ (20) ఫర్వాలేదనిపించగా.. లారా వొల్వర్ట్‌ (25 బంతుల్లో 44) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడింది. ఇక జెమీమా రోడ్రిగ్స్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ (37 బంతుల్లో 57)తో మెరవగా.. చినెల్లి హెన్రీ (15 బంతుల్లో 35 నాటౌట్‌) ధనాధన్‌ దంచికొట్టింది.

ఫలితంగా ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 203 పరుగులు సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో సయాలీ సత్‌గరే, అరుంధతి రెడ్డి, నదైన్‌ డిక్లెర్క్‌ తలా ఒక వికెట్‌ తీశారు. ఇక లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్‌ గ్రేస్‌ హ్యారిస్‌ (9) సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే వెనుదిరిగింది.

స్మృతి మంధాన, జార్జియా వోల్‌ ధనాధన్‌
అయితే, మరో ఓపెనర్‌, కెప్టెన్‌ స్మృతి మంధాన.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ జార్జియా వోల్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. స్మృతి 41 బంతుల్లోనే 12 ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 87 పరుగులు సాధించగా.. వోల్‌ 54 బంతుల్లో 79 పరుగులు చేసింది.

మిగిలిన వారిలో రిచా ఘోష్‌ (6) విఫలమైనా.. స్మృతి- వోల్‌ వేసిన బలమైన పునాదిపై నదైన్‌ డిక్లెర్క్‌ (5 బంతుల్లో 7), రాధా యాదవ్‌ (5 బంతుల్లో 12) అజేయంగా నిలిచి పని పూర్తి చేశారు. 19.4 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టపోయి 204 పరుగులు చేసిన ఆర్సీబీ.. ఆరు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.

ఢిల్లీకి మరోసారి చేదు అనుభవం
దీంతో వరుసగా నాలుగోసారి ఫైనల్‌ చేరిన ఢిల్లీకి మరోసారి చేదు అనుభవం ఎదురుకాగా.. ఆర్సీబీ రెండోసారి ట్రోఫీని కైవసం చేసుకుంది. కాగా 2023లో డబ్ల్యూపీఎల్‌ మొదలుకాగా.. 2024లో ఆర్సీబీ తొలి టైటిల్‌ గెలిచింది. ఇక గతేడాది ఆర్సీబీ పురుషుల జట్టు తొలిసారి ఐపీఎల్‌ టైటిల్‌ గెలవగా.. ఈ ఏడాది డబ్ల్యూపీఎల్‌ రూపంలో ఆర్సీబీ ఫ్రాంఛైజీకి మరో టైటిల్‌ దక్కింది.

అద్భుతమైన విజయం
ఈ నేపథ్యంలో హర్షం వ్యక్తం చేసిన ఆర్సీబీ దిగ్గజం విరాట్‌ కోహ్లి.. ‘‘మరోసారి చాంపియన్స్‌గా నిలిచారు. ఆర్సీబీ విజయ పతకాన్ని ఎగురవేస్తూనే ఉండాలి. జట్టును చూస్తుంటే గర్వంగా ఉంది. ముఖ్యంగా స్మృతి.. నీకు, జట్టుకు, ఆర్సీబీ యాజమాన్యానికి శుభాకాంక్షలు. ఇదొక అద్భుతమైన విజయం. 

ఇందుకు మీరు అర్హులు. ఈ క్షణాన్ని ఆస్వాదించండి. మన అభిమానులు పంచే ప్రేమను ఎంజాయ్‌ చేయండి’’ అని ప్రశంసలు కురిపించాడు. ఈ పోస్టు ఏడు మిలియన్లకు పైగా లైకులతో దూసుకుపోతోంది. 

చదవండి: ఆరో టైటిల్‌ వేటలో...

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement