మహిళల ఐపీఎల్‌లో (WPL) ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ నందిని శర్మ చరిత్ర తిరగరాసింది. లీగ్ చరిత్రలో (సింగిల్ ఎడిషన్‌లో) అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అవతరించింది. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ బౌలర్ సైకా ఇషాఖీ పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టింది.
ఇషాఖీ 2023 ఎడిషన్‌లో 15 వికెట్లు తీయగా.. ప్రస్తుత ఎడిషన్‌లో (2026) నందిని 16 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. నిన్న (ఫిబ్రవరి 3) గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో నందిని శర్మ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆమె 2 వికెట్లు తీసింది.
డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఓ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లు (టాప్-4)
నందిని శర్మ (ఢిల్లీ క్యాపిటల్స్)- 16 వికెట్లు (2026)
సైకా ఇషాఖీ (ముంబై ఇండియన్స్)- 15 (2023)
శ్రీచరణి (ఢిల్లీ క్యాపిటల్స్)- 14 (2026)
శ్రేయాంక పాటిల్ (ఆర్సీబీ)- 13 (2024)
హ్యాట్రిక్
ఈ సీజన్‌లో గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో నందిని హ్యాట్రిక్‌తో మెరిసింది. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ ఓడినా నందిని హ్యాట్రిక్ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేసి సత్తా చాటింది. ఈ సీజన్‌లో ఢిల్లీ సాధించిన విజయాల్లో నందినిది కీలకపాత్ర. 24 ఏళ్ల ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్‌ను ఢిల్లీ ఈ సీజన్ వేలంలో 20 లక్షలకు సొంతం చేసుకుంది.
నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీ గుజరాత్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, వరుసగా నాలుగో ఎడిషన్‌లోనూ ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. బెత్ మూనీ (62 నాటౌట్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో చినెల్ హెన్రీ 3, నందిని శర్మ 2, మిన్ను మణి ఓ వికెట్ తీశారు.
అనంతరం 169 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 15.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ ఛేదించింది. లిజెల్ లీ (43), జెమీమా రోడ్రిగ్స్ (41) ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. రేపు (ఫిబ్రవరి 5) వడోదరలో జరుగబోయే ఫైనల్లో ఢిల్లీ ఆర్సీబీతో తలపడనుంది.


