శ్రేయస్ మొవ్వ ,జతిందర్ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్
టి20 వరల్డ్‌కప్‌లో 40 మంది ప్రవాస భారత క్రికెటర్లు
మూడు జాతీయ జట్లకు మనోళ్లే సారథులు
మరో 3 రోజుల్లో టి20 ప్రపంచకప్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్‌లో ఒక్కో జట్టు నుంచి 11 మంది ప్లేయర్లు మాత్రమే మైదానంలో అడుగు పెడతారు. కానీ మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్న వరల్డ్‌కప్‌లో మాత్రం లెక్కకు మిక్కిలి భారత ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. అదేంటి ఏ జట్టుకైనా ఒకటే నిబంధన కదా అనే అనుమానం రాకమానదు. ఇక్కడే అసలు మెలిక ఉంది. టీమిండియా తరఫున ఆడేది పదకొండు మందే... కానీ, ప్రపంచకప్‌లో బరిలోకి దిగుతున్న 20 జట్లలో భారత్‌తో పాటు మరో తొమ్మిది జట్ల తరఫున మనదేశ సంతతి ఆటగాళ్లు ఆడనున్నారు.
రెండోసారి టి20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించిన కెనడా జట్టులో అత్యధికంగా 11 మంది భారత సంతతి ప్లేయర్లు ఉండగా... అమెరికా జట్టులో 9 మంది మనవాళ్లు ఉన్నారు. ప్రవాస భారతీయులు అధికంగా ఉండే ఒమన్, యూఏఈ నుంచి ఏడుగురు చొప్పున మన మూలాలున్న ప్లేయర్లు వరల్డ్‌కప్ ఆడనుండగా... ఇష్ సోధి, రచిన్ రవీంద్ర రూపంలో న్యూజిలాండ్ నుంచి ఇద్దరు భారత సంతతి ఆటగాళ్లు పోటీపడనున్నారు.
ఇక దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఇటలీ, నెదర్లాండ్స్ నుంచి ఒక్కొక్కరు చొప్పున వరల్డ్‌కప్‌లో ఆడనున్నారు. ఇందులో కెనడా, అమెరికా, ఒమన్ జాతీయ జట్లకు సారథ్యం వహిస్తుంది కూడా మనవాళ్లే కావడం విశేషం. మరో మూడు రోజుల్లో టి20 వరల్డ్‌కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న భారత సంతతి ఆటగాళ్లపై ఓ కన్నేద్దాం!
పాకిస్తాన్ పనిపట్టి...
సౌరభ్ నేత్రావల్కర్... ఈ పేరు గత టి20 ప్రపంచకప్ సమయంలో బాగా వినిపించింది. అమెరికా వేదికగా జరిగిన ఆ టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్ పాకిస్తాన్‌ను అమెరికా ఓడించడంలో ఈ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కీలక పాత్ర పోషించాడు. గ్రూప్ దశలో పాకిస్తాన్, అమెరికా మధ్య జరిగిన పోరులో స్కోర్లు సమం కాగా... సూపర్ ఓవర్‌లో బౌలింగ్ చేసిన నేత్రావల్కర్... పాక్ బ్యాటర్లను కట్టడి చేశాడు. అంతకుముందు మ్యాచ్‌లోనూ 4 ఓవర్లలో కేవలం 18 పరుగులకే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.
ముంబైలో పుట్టి పెరిగి... ఒకప్పుడు అండర్–19 స్థాయిలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సౌరభ్ ప్రస్తుతం ఉద్యోగరీత్యా అమెరికాలో స్థిరపడ్డాడు. లెఫ్టార్మ్ మీడియం పేస్ బౌలింగ్‌తో రాణించి అమెరికా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. గత వరల్డ్‌కప్‌లో అమెరికా జట్టు ‘సూపర్–8’ దశకు చేరడంతో కీలకంగా వ్యవహరించిన 34 ఏళ్ల సౌరభ్... సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి సెలవు పెట్టి మరోసారి సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు.
ఒకప్పుడు సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి మ్యాచ్‌లు ఆడిన సౌరభ్ ఈ శనివారం ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా అతడికి ప్రత్యర్థిగా బరిలోకి దిగనున్నాడు. ‘ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు. కానీ, ఇది చాలా భావోద్వేగ క్షణం. జీవితం ఒక చక్రం లాంటిది. నేను ఇక్కడే క్రికెట్ ఆడటం ప్రారంభించా... మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఇక్కడే టీమిండియతో మ్యాచ్ ఆడతానని ఎప్పుడూ ఊహించలేదు’ అని నేత్రావల్కర్ అన్నాడు.
మోనాంక్ పటేల్
భారత స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి ఒకప్పుడు మ్యాచ్‌లు ఆడిన మోనాంక్ పటేల్... ప్రస్తుతం అమెరికా జట్టుకు కెప్టెన్‌గా వరల్డ్‌కప్‌నకు సిద్ధమయ్యాడు. 2024 టి20 వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌తో పోరులో చక్కటి అర్ధశతకంతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన మోనాంక్... ఈసారి కూడా మెగా టోర్నీలో తనదైన ముద్ర వేయాలని భావిస్తున్నాడు.
గుజరాత్‌లో పుట్టి పెరిగిన 32 ఏళ్ల మోనాంక్... అండర్–19 స్థాయిలో బుమ్రాతో మ్యాచ్‌లు ఆడాడు. ‘మేమిద్దరం చిన్నప్పుడు కలిసి మ్యాచ్‌లు ఆడాం. ఆ తర్వాత ఇద్దరి దారులు వేరయ్యాయి. బుమ్రా ఇప్పుడు ప్రపంచ అత్యుత్తమ స్థాయికి ఎదిగాడు. టీమిండియాతో మ్యాచ్‌లో అతడి బౌలింగ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం అని తెలుసు. మా వరకు ఉత్తమ ప్రదర్శన కనబర్చాలని అనుకుంటున్నాం’ అని మోనాంక్ అన్నాడు.
జస్‌ప్రీత్ సింగ్
మొదటిసారి ఐసీసీ టి20 ప్రపంచకప్ ఆడనున్న ఇటలీ జట్టులో పంజాబ్‌లో పుట్టి పెరిగిన జస్‌ప్రీత్ సింగ్ చోటు దక్కించుకున్నాడు. ఇరవై ఏళ్ల క్రితం మెరుగైన జీవనోపాధి కోసం కుటుంబంతో కలిసి ఇటలీకి వలస వెళ్లిన జస్‌ప్రీత్... అక్కడ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూనే క్రికెట్ కొనసాగించాడు. తన ప్రదర్శనతో జాతీయ జట్టుకు ఎంపికైన 32 ఏళ్ల జస్‌ప్రీత్... వరల్డ్‌కప్ కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాడు.
ఆర్యన్ దత్
ఇప్పటికే 2023 వన్డే ప్రపంచకప్ సందర్భంగా నెదర్లాండ్స్ తరఫున భారత్‌లో మ్యాచ్‌లాడిన ఆర్యన్ దత్... ఇప్పుడు టి20 వరల్డ్‌కప్‌నకు సిద్ధమవుతున్నాడు. 22 ఏళ్ల ఈ ఆఫ్ స్పిన్నర్ భారత్‌లో పుట్టకపోయినా... అతడి తల్లిదండ్రులది పంజాబే. మెరుగైన జీవనోపాధి కోసం ఆర్యన్ కుటుంబం నెదర్లాండ్స్‌కు వలస వెళ్లగా... అక్కడ తన స్పిన్‌తో సత్తాచాటిన ఆర్యన్ జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
దిల్‌ప్రీత్ బాజ్వా
వరల్డ్‌కప్‌లో బరిలోకి దిగనున్న కెనడా జట్టయితే పూర్తిగా భాతర సంతతి ఆటగాళ్లతో నిండి ఉంది. ఆ జట్టుకు సారథ్యం వహిస్తున్న దిల్‌ప్రీత్ బాజ్వా ఇటీవలే కెనడాకు వలస వెళ్లాడు. అనతి కాలంలోనే తన ప్రతిభతో అక్కడి జాతీయ జట్టుకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఏజ్ గ్రూప్ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దిల్‌ప్రీత్... కెనడా గ్లోబల్ టి20 లీగ్‌లో విజృంభించి వెలుగులోకి వచ్చాడు.
జతిందర్ సింగ్
పంజాబ్‌లోని లుధియానాలో పుట్టి పెరిగిన జతిందర్ సింగ్... ఈ ప్రపంచకప్‌లో ఒమన్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. దశాబ్దానికి పైగా భారత దేశవాళీల్లో ఆడిన 36 ఏళ్ల జతిందర్... అవకాశాలు రాకపోవడంతో ఒమన్‌కు వలసవెళ్లి ఆ దేశ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అతడితో పాటు వినాయక్ శుక్లా, కరణ్ సోనావాలె, జై, ఆశిష్, వసీం, జితేన్ రామనంది ఇలా ఏడుగురు భారత సంతతి ఆటగాళ్లు ఒమన్ తరఫున బరిలోకి దిగనున్నారు.
టి20 ప్రపంచకప్‌లో భారత సంతతి ఆటగాళ్లు
కెనడా (11): దిల్‌ప్రీత్ బాజ్వా (కెప్టెన్ ), అజయ్‌వీర్ హుండల్, అంశ్ పటేల్, హర్ష్ థాకెర్, జస్‌కరణ్‌దీప్ బుట్టర్, కన్వర్‌పాల్ తత్ఘుర్, నవ్‌నీత్ ధలీవాల్, రవీందర్‌పాల్ సింగ్, శివం శర్మ, శ్రేయస్ మొవ్వ, యువరాజ్ సామ్రా.
అమెరికా (9): మోనాంక్ పటేల్ (కెప్టెన్ ), జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నోస్తుష్ కెంజిగె, సాయితేజ ముక్కామల, సంజయ్ కృష్ణమూర్తి, హర్మీత్ సింగ్, సౌరభ్ నేత్రావల్కర్, శుభం రంజనె.
ఒమన్ (7): జతిందర్ సింగ్ (కెప్టెన్), వినాయక్ శుక్లా, కరణ్ సోనావాలె, జై ఒడెద్రా, ఆశిష్ ఒడెద్రా, వసీం అలీ, జితేన్ రామనంది.
యూఏఈ (7): అలీషాన్ షరాఫు, ఆర్యాంశ్ శర్మ, ధ్రువ్ పరాశర్, హర్షిత్ కౌశిక్, మయాంక్ కుమార్, సిమ్రన్‌జీత్ సింగ్, సొహైబ్ ఖాన్.
న్యూజిలాండ్ (2): ఇష్ సోధి, రచిన్ రవీంద్ర
దక్షిణాఫ్రికా (1): కేశవ్ మహరాజ్
వెస్టిండీస్ (1): గుడకేశ్ మోతీ
ఇటలీ (1): జస్‌ప్రీత్ సింగ్
నెదర్లాండ్స్ (1): ఆర్యన్ దత్
తెలుగువాళ్లు కూడా...
అమెరికా తరఫున ఆడుతున్న ముక్కామల సాయితేజ రెడ్డి... కెనడా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రేయస్ మొవ్వ తెలుగు మూలాలున్న ఆటగాళ్లే. అమెరికాలోనే పుట్టి పెరిగిన సాయితేజ రెడ్డి అమెరికా జాతీయ జట్టు ఓపెనర్‌గా 37 వన్డేలు, 18 టి20లు ఆడాడు. మంచి స్ట్రయిక్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సాయితేజ... ఈ మెగాటోర్నీలో ఎలాంటి ప్రదర్శన చేస్తాడో చూడాలి. భారత్‌లో పుట్టి కెనడాకు వలస వెళ్లిన శ్రేయస్ మొవ్వ ఆ దేశ జట్టు తరఫున ఇప్పటి వరకు 24 వన్డేలు, 24 టి20లు ఆడాడు.


