చాంపియన్‌ హరియాణా థండర్స్‌ | Pro Wrestling League champions Haryana Thunders | Sakshi
Sakshi News home page

చాంపియన్‌ హరియాణా థండర్స్‌

Feb 4 2026 4:04 AM | Updated on Feb 4 2026 4:04 AM

Pro Wrestling League champions Haryana Thunders

ఫైనల్లో ఢిల్లీ దంగల్‌ వారియర్స్‌పై గెలుపు

వరుసగా రెండోసారి ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌ టైటిల్‌ కైవసం

న్యూఢిల్లీ: ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌ (పీడబ్ల్యూఎల్‌)లో హరియాణా థండర్స్‌ జట్టు వరుసగా రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో హరియాణా 5–4 పాయింట్ల తేడాతో ఢిల్లీ దంగల్‌ వారియర్స్‌పై గెలిచింది. ఇప్పటి వరకు ఈ లీగ్‌ ఐదుసార్లు నిర్వహించగా... అందులో హరియాణా జట్టు రెండోసారి ట్రోఫీ చేజిక్కించుకుంది. చివరగా 2019లో జరిగిన లీగ్‌లో హరియాణా జట్టు టైటిల్‌ నెగ్గింది. 

తాజా లీగ్‌లో హోరాహోరీగా సాగిన తుదిపోరులో ఎనిమిది బౌట్‌లు ముగిసేసరికి ఇరు జట్లు 4–4తో సమంగా నిలిచాయి. చివరగా జరిగిన మహిళల 62 కేజీల పోరులో పారిస్‌ ఒలింపిక్స్‌ రజత పతక విజేత ఇరినా కొలియాడెన్కో ఒత్తిడిని అధిగమిస్తూ... అంజలిని చిత్తుచేసింది. దీంతో హరియాణా థండర్స్‌ విజేతగా నిలిచింది. 

అంతకుముందు పురుషుల 74 కేజీల విభాగంలో జరిగిన తొలి బౌట్‌లో బైరమోవ్‌ (ఢిల్లీ) 8–2తో ప్రవిందర్‌ (హరియాణా)పై... రెండో బౌట్‌గా జరిగిన మహిళల 76 కేజీల పోరులో కాజల్‌ (హరియాణా) 3–1తో అనస్తసియా అల్పియోవా (ఢిల్లీ)పై... మూడో బౌట్‌ పురుషుల 65 కేజీల ఈవెంట్‌లో సుజీత్‌ కల్కల్‌ (ఢిల్లీ) 8–6తో తుముర్‌ ఒచిర్‌ తుల్గా (హరియాణా)పై... నాలుగో బౌట్‌ మహిళల 53 కేజీల పోరులో యీ సుసకీ (హరియాణా) 5–0తో సారిక (ఢిల్లీ)పై... ఐదో బౌట్‌ పురుషుల 86 కేజీల విభాగంలో హాది భక్తియార్‌ 11–0తో అశిరోవ్‌ అష్రఫ్‌ (హరియాణా)పై... ఆరో బౌట్‌ పురుషుల 57 కేజీల పోరులో అక్షయ్‌ ఢేరె (హరియాణా) 16–0తో అమిత్‌ (ఢిల్లీ)పై... ఏడో బౌట్‌గా జరిగిన పురుషుల 125 కేజీల పోరులో రోనక్‌  12–1తో అనిరుధ్‌  (హరియాణా)పై గెలిచారు.

ఎనిమిదో బౌట్‌ మహళల 57 కేజీల విభాగంలో నేహ (హరియాణా) 8–2తో అంజలి (ఢిల్లీ)పై గెలిచారు. ఢిల్లీ దంగల్‌ వారియర్స్‌కు చెందిన యువ రెజ్లర్‌ తురాన్‌ బైరమోవ్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌’ అవార్డు దక్కించుకున్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో పోటీపడిన అతడు... ఆడిన ఏడు బౌట్‌లలోనూ విజయాలు సాధించడం విశేషం. 

హరియాణా థండర్స్‌ రెజ్లర్‌ నేహా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ... ఢిల్లీ దంగల్‌ వారియర్స్‌కు చెందిన రోనక్‌ (125 కేజీలు) ‘ఫైటర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కించుకున్నారు. పంజాబ్‌ రాయల్స్‌కు చెందిన చంద్రమోహన్‌ లీగ్‌లో అత్యధిక పాయింట్లు సాధించిన రెజ్లర్‌గా నిలిచాడు. హరియాణా థండర్స్‌కు చెందిన అక్షయ్‌ ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు గెలుచుకున్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement