సవాళ్లపై సవారీ! | Nirmala Sitharaman presenting budget for ninth consecutive time | Sakshi
Sakshi News home page

సవాళ్లపై సవారీ!

Feb 1 2026 2:04 AM | Updated on Feb 1 2026 2:04 AM

Nirmala Sitharaman presenting budget for ninth consecutive time

ఆర్థిక సంక్లిష్టతల నడుమ నేడు పార్లమెంటు ముందుకు 2026–27 కేంద్ర బడ్జెట్‌ 

వరుసగా తొమ్మిదోసారి ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  

వృద్ధికి ఊతం, తయారీకి చేయూతతో గేమ్‌ చేంజింగ్‌లా ఉండొచ్చని నిపుణుల అంచనా 

త్వరలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కొత్త పథకాలు ప్రవేశపెట్టే అవకాశం 

ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టొచ్చంటున్న ఆర్థికవేత్తలు

అమెరికా టారిఫ్‌లు, తరలిపోతున్న విదేశీ పెట్టుబడులు, ద్రవ్యోల్బణం ఓవైపు.. జీడీపీ వృద్ధి మందగమనం, ప్రపంచ దేశాల్లో అనిశి్చతితో రూపాయి పతనం, భగ్గుమంటున్న బంగారం, వెండి ధరలు, ఉపాధిని మింగేస్తున్న ఏఐ ద్వారా ఎదురవుతున్న సవాళ్లు మరోవైపు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కేంద్రం మరికొన్ని గంటల్లో 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. నేటి బడ్జెట్‌ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా, యువతకు ఉత్సాహాన్ని కలిగించేలా, మౌలిక రంగాలను మెరిపించేలా గేమ్‌ చేంజింగ్‌ విధానాలతో ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు బడ్జెట్‌లో నజరానాలు ప్రకటిస్తారని భావిస్తున్నారు. తయారీ నుంచి మౌలిక సదుపాయాల వరకు.. ఉద్యోగ సృష్టి నుంచి గ్రామీణాభివృద్ధి వరకు.. పునరుత్పాదక శక్తి నుంచి డిజిటల్‌ ఆవిష్కరణల వరకు.. దేశ ఆర్థిక ఇంజన్‌ను నడిపించే అనేక వ్యూహాత్మక విధానాలను కేంద్రం ఈ బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే వృద్ధి వేగాన్ని కొనసాగించడంతోపాటు ఆర్థిక వ్యవస్థను రక్షించే సంస్కరణలను ఈ బడ్జెట్‌ చేపడుతుందని భావిస్తున్నారు. 

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా తొమ్మిదోసారి పార్లమెంటులో 2026–27 బడ్జెట్‌ను ప్రవేపెట్టనున్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి బడ్జెట్‌ను ఆదివారం ప్రవేశపెడుతుండటం విశేషం. కేంద్రం గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఐటీ, జీఎస్టీ శ్లాబుల్లో తీసుకొచి్చన విప్లవాత్మక మార్పులకు తోడు మౌలిక సదుపాయాల కల్పనపై వ్యయం, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోత వంటివి ఇప్పటివరకు అమెరికా సుంకాలను తట్టుకోవడానికి దోహదపడ్డాయి. అయితే ఇప్పుడు ఆర్థిక వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి కేంద్రం సరికొత్త చర్యలు తీసుకోవాల్సి ఉంది. 

సవాళ్లు ఎన్నో.. 
ఈసారి కేంద్ర బడ్జెట్‌ ఎన్నో సంక్లిష్ట పరిస్థితుల మధ్య వస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినప్పటికీ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అస్థిరంగా మారిన కమోడిటీల ధరలు, ప్రధాన బ్యాంకులు అనుసరించిన ద్రవ్య విధానాల వంటి సమస్యలు దేశ ఆర్థిక వ్యవస్థను కమ్ముకున్నాయి. దేశీయంగా ఆర్థిక లోటును తగ్గించుకుంటూనే వినియోగాన్ని పెంచడం, ఉద్యోగ కల్పనను వేగవంతం చేయడం, మూలధన వ్యయాన్ని పెంచాలన్న ఒత్తిళ్లను కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటోంది. అయితే పన్ను తగ్గింపుల వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గడం వల్ల కొత్త బడ్జెట్‌లో ఆర్థిక వ్యవస్థను ఆదుకోవడానికి కేంద్రానికి ఉన్న అవకాశాలను పరిమితం చేసింది. ముఖ్యంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశి్చత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సరికొత్త ఆర్థిక వృద్ధి చోదకాన్ని కనుగొనడం నిర్మలా సీతారామన్‌కు అతిపెద్ద సవాల్‌ కానుంది. అమెరికాతో వాణిజ్య చర్చలపై అనిశ్చితి కారణంగా విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీలను విక్రయిస్తుండటం, రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోవడంతో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పునరుద్ధరించడం కూడా ఆమె ముందున్న మరో కష్టతరమైన లక్ష్యమని ఆర్థికవేత్తలు అంటున్నారు.  

బడ్జెట్‌ టీంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. చిత్రంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి 

కొన్ని ఊరటలు..
కేంద్రం ఆదాయం పెంచుకొనే చర్యల్లో భాగంగా పెట్రోల్, డీజిల్‌ ధరలపై ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ ధరల పెంపు భారాన్ని వినియోగదారులపై వేయకుండా అంతర్గతంగా సర్దుబాటు చేసుకొనే అవకాశం ఉంది. 
⇒ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బెంగాల్, తమిళనాడు, కేర ళ, అస్సాం రాష్ట్రాలకు కొత్త పథకాలను ప్రకటించొచ్చు. 
⇒ రైల్వే, పునరుత్పాదక ఇంధన, పట్టణ రవాణా రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ మూలధన వ్యయం పెరగొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. 
⇒ పన్నుల విషయంలో పెద్ద మార్పులు ఉండే అవకాశం లేదు. కార్పొరేట్‌ పన్ను రేట్లు మారకపోవచ్చు. 
⇒ ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత లభించనుంది. నైపుణ్యాభివృద్ధి, తయారీ రంగాలకు ప్రోత్సాహకాలు ఉండవచ్చు. 
⇒ పునరుత్పాదక ఇంధనం, గ్రీన్‌ హైడ్రోజన్, ఈవీ రంగాలకు మరింత చేయూత అందించే అవకాశం ఉందని అంచనా.  
⇒ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు బడ్జెట్‌ కేటయింపులు పెంచడమో లేదా క్రెడిట్‌ గ్యారెంటీలు ఇవ్వడమో ఉండొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మొత్తంగా నిర్మలమ్మ బడ్జెట్‌ పద్దు ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీయకుండా వృద్ధిని కొనసాగించడమే లక్ష్యంగా ఉంటుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఎస్‌బీఐ రీసెర్చ్‌ ఆర్థికవేత్తల అంచనా ప్రకారం ప్రభుత్వ మూలధన వ్యయం రూ. 12 లక్షల కోట్లు దాటొచ్చు.  

బడ్జెట్‌ క్వీన్‌ సీతారామన్‌
దేశ చరిత్రలో వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రిగా రికార్డు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా తొమ్మిదో బడ్జెట్‌ను 2026–27 ఆర్థిక సంవత్సరానికి పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. తద్వారా చరిత్ర సృష్టించనున్నారు. ఎందుకంటే ఇప్పటివరకు స్వతంత్ర భారత చరిత్రలో ఎవరూ వరుసగా తొమ్మిది బడ్జెట్‌లను సమర్పించలేదు. మొరార్జీ దేశాయ్‌ మొత్తంగా 10 బడ్జెట్‌లను ప్రవేశపెట్టినప్పటికీ అవి వివిధ కాలాల్లో చోటుచేసుకున్నవే. ఆయన 1959 నుంచి 1964 వరకు ఆర్థిక మంత్రిగా వరుసగా ఆరు బడ్జెట్‌లు సమర్పించారు. తిరిగి 1967–1969 మధ్య నాలుగు బడ్జెట్‌లను ప్రవేశపెట్టారు. 

మాజీ ఆర్థిక మంత్రులైన పి.చిదంబరం తొమ్మిది, ప్రణబ్‌ ముఖర్జీ ఎనిమిది బడ్జెట్‌లు సమర్పించారు. అది కూడా వివిధ ప్రధాన మంత్రుల కాలంలో. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ 1991 నుంచి 1995 వరకు ఆర్థిక మంత్రిగా ఐదు బడ్జెట్‌లు ప్రవేశపెట్టారు. కానీ నిర్మలా సీతారామన్‌ ప్రధాని మోదీ సారథ్యంలో వరుసగా తొమ్మిదో బడ్జెట్‌తో రికార్డు సృష్టించనున్నారు. 2019లో కేంద్రంలో రెండోసారి ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు సీతారామన్‌ మొదటి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆమె చేతుల మీదుగానే బడ్జెట్‌ ప్రయాణం సాగిపోతోంది. 2024 ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్‌తో కలిపి ఇప్పటివరకు ఎనిమిది బడ్జెట్‌లను అందించారు.  

⇒ స్వాతంత్య్రానంతరం మొదటి బడ్జెట్‌ను 1947 నవంబర్‌ 26న దేశ తొలి ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముఖం చెట్టి సమర్పించారు.  
⇒ అత్యధిక సమయంపాటు బడ్జెట్‌ ప్రసంగాన్ని చదివిన ఆర్థిక మంత్రి రికార్డు నిర్మలా సీతారామన్‌ పేరిటే ఉంది. 2020 ఫిబ్రవరి 1న ఆమె రెండు గంటల నలభై నిమిషాలపాటు ప్రసంగించారు.  
⇒ అతితక్కువ బడ్జెట్‌ ప్రసంగం 1977 మధ్యంతర బడ్జెట్‌ సందర్భంగా హీరూభాయ్‌ ముల్లిజ్‌భాయ్‌ పేరిట ఉంది. కేవ లం 800 పదాలతో ఆయన బడ్జెట్‌ ప్రసంగం ముగించారు. 
⇒ ఫిబ్రవరి చివర్లో బడ్జెట్‌ ప్రవేశపెట్టే ఆనవాయితీని మోదీ సర్కారు 2017 నుంచి ఫిబ్రవరి 1కి మార్చింది.  

నేరుగా ‘బడ్జెట్‌’ను వీక్షించనున్న 30 మంది విద్యార్థులు
కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఆదివారం ప్రవేశపెట్టనున్న 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను కళాశాల విద్యార్థులు లోక్‌సభ గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా వీక్షించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ప్రత్యేక అవకాశం కల్పించింది. అలాగే ఆర్థిక శాఖ కార్యకలాపాలపై వారికి అవగాహన కల్పించడంతోపాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యేలా షెడ్యూల్‌ ఖరారు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 30 మంది కళాశాల విద్యార్థులు ఆదివారం బడ్జెట్‌ను నేరుగా వీక్షిస్తారు. 

అలాగే ఆర్థిక శాఖ కార్యాలయం ఉన్న కర్తవ్య భవన్‌–1ను సందర్శించి ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ శాఖ కార్యకలాపాలు, విధానాల రూపకల్పన, సంస్థల పాత్ర గురించి తెలుసుకోనున్నారు. ఆదివారం సాయంత్రం ఆర్థిక మంత్రి ఆయా విద్యార్థులతో ముచ్చటించనున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యకలాపాలు, ప్రభుత్వ పరిపాలన, ప్రజాస్వామిక ప్రక్రియల గురించి అవగాహన కల్పించడంతోపాటు యువతను అందులో భాగస్వాములను చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆర్థిక శాఖ తెలిపింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement