నేడు అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లండ్‌తో భారత్ ‘ఢీ’
మధ్యాహ్నం 1 గంట నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో...
హరారే: యువ భారత్ అండర్–19 ప్రపంచకప్ వేట ‘ఫైనల్’ మజిలీకి చేరింది. కుర్రాళ్ల ‘కప్’ కల ఈ ఒక్క విజయంతోనే నెరవేరుతుంది. అన్ని గెలవడం ఒక ఎత్తు అయితే... ఈ ఒక్కదాంతో ‘ప్రపంచ’ అందలం ఎక్కడం మరో ఎత్తు. ఆయుశ్ మాత్రే నేతృత్వంలోని భారత జట్టుకు ఈ మ్యాచ్ విలువేంటో బాగా తెలుసు. అందుకే ‘కప్’ చేతికందే తుది పోరును కూడా విజయంతో ముగించాలనే పట్టుదలతో ఉంది.
మరోవైపు ఇంగ్లండ్ రెండో ప్రపంచకప్ విజయం కోసం ఆరాటపడుతోంది. భారత్‌లాంటి దుర్బేధ్యమైన జట్టును ఓడించి ‘ప్రపంచా’న్ని గెలవడం కష్టమైనా... రెండున్నర దశాబ్దాల తర్వాత వచి్చన ఈ వరల్డ్‌కప్ చాన్స్‌ను ఎంతమాత్రం చేజార్చుకోవద్దని గట్టిగా కోరుకుంటుంది.
పదో సారి ఫైనల్‌కు...
అండర్–19 ప్రపంచకప్ 1988లో మొదలైంది. ఇప్పటివరకు 15 మెగా ఈవెంట్లు జరిగితే ఏ కుర్ర జట్టుకు సాధ్యం కానీ ఐదు టైటిళ్లను భారత జట్టే గెలిచింది. ఓవరాల్‌గా 16 (ప్రస్తుత కప్) ప్రపంచకప్‌ల్లో 10 సార్లు ఫైనల్ చేరిన ఘనచరిత్ర కూడా మనదే! వరుసగా యువ భారత్‌కిది ఆరో ఫైనల్.
గత 2024 ఈవెంట్‌లోనూ ఫైనల్ చేరినా... ఆ్రస్టేలియా చేతిలో ఓడి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. కానీ ఈ ఈవెంట్‌లో యువ క్రికెటర్ల ఆటతీరు... కనబరిచిన నిలకడ, సమష్టి ప్రదర్శన చూస్తే ఈసారి సరిపెట్టుకోదు... కప్ పట్టుకెళ్లడం ఖాయమని ఎవరైనా అంటారు. అంతలా భారత జైత్రయాత్ర సాగుతోంది.
ఇంగ్లండ్ కథాకమామీషు...
ఇంగ్లండ్ 1998లో జరిగిన రెండో ప్రపంచకప్‌లో తొలిసారి టైటిల్ గెలిచింది. ఐసీసీ అండర్–19 పుటల్లో తప్ప... ఇంగ్లండ్ క్రికెట్‌లో మరుగున పడిపోయిన విజయమది. తాజాగా మళ్లీ ఇన్నాళ్లకు కప్ వేటలో పడిన ఇంగ్లండ్‌కు ఫైనల్లో మింగుడుపడని ప్రత్యర్థి, టైటిల్ ఫేవరెట్ భారత్ ఎదురవడమే ప్రధాన సమస్య. అయితే తొలి సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాను ఓడించిన ఇంగ్లండ్... ఆఖరి పోరులో అజేయమైన గత ఫైనలిస్టును ఓడిస్తే ఇంతకుమించిన పండగ మరొకటి ఉండదేమో!
భారత్ ఇలా... ఇంగ్లండ్ అలా...
గ్రూప్ ‘బి’లో లీగ్ దశను మొదలుపెట్టిన భారత్ ముందు బ్యాటింగ్ చేసినా... తర్వాత లక్ష్యాన్ని ఛేదించినా అన్ని విజయంతోనే ముగించింది. అమెరికా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లపై గెలిచి ‘సూపర్ సిక్స్’కు చేరింది. అక్కడ జింబాబ్వే, పాకిస్తాన్‌లను కంగుతినిపించి రెండో సెమీఫైనల్లో అఫ్గానిస్తాన్‌ను చిత్తు చేసి ఆఖరి పోరుకు అర్హత సాధించింది.
సరిగ్గా భారత్‌లాగే గ్రూప్ ‘సి’లో పాకిస్తాన్, జింబాబ్వే, స్కాట్లాండ్‌లపై ఇంగ్లండ్ గెలిచి లీగ్ దశను విజయవంతంగా దాటింది. ‘సూపర్ సిక్స్’లో బంగ్లాదేశ్, న్యూజిలాండ్‌లపై గెలిచి... తొలి సెమీఫైనల్లో నిరుటి విజేత ఆ్రస్టేలియాను ఇంటికి పంపి ఫైనల్ బరిలో నిలిచింది.
జట్ల వివరాలు
భారత్: ఆయుశ్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, ఆరోన్ జార్జ్, విహాన్ మల్హోత్రా, అభిజ్ఞాన్ కుందు, వేదాంత్ త్రివేది, అంబరీశ్, కనిష్క్ చౌహాన్, దీపేశ్, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్, మొహమ్మద్ ఇనాన్, ఉధవ్ మోహన్, హర్‌వంశ్ పంగాలియా, కిషన్ సింగ్.
ఇంగ్లండ్: థామస్ ర్యూ (కెప్టెన్), రాల్ఫీ అల్బెర్ట్, అలీ ఫారూఖ్, డెన్ డాకిన్స్, ఫాల్కోనెర్, అలెక్స్ ఫ్రెంచ్, అలెక్స్ గ్రీన్, ల్యూక్ హాండ్స్, ఇసాక్ మొహమ్మద్, మ్యానీ లమ్స్‌డెన్, బెన్ మాయెస్, జేమ్స్ మింటో, జోసెఫ్ మూర్స్, సెబాస్టియన్ మోర్గాన్.


