డబ్ల్యూపీఎల్-2026 ఛాంపియన్స్‌గా ఆర్సీబీ | RCB vs DC, WPL 2026 Fina: RCB win 2nd WPL trophy | Sakshi
Sakshi News home page

డబ్ల్యూపీఎల్-2026 ఛాంపియన్స్‌గా ఆర్సీబీ

Feb 5 2026 11:18 PM | Updated on Feb 5 2026 11:26 PM

 RCB vs DC, WPL 2026 Fina: RCB win 2nd WPL trophy

ఉమెన్స్ ప్రీమియ‌ర్ లీగ్‌-2026 విజేత‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు అవ‌త‌రించింది. గురువారం వ‌డోద‌ర వేదిక‌గా జ‌రిగిన ఫైన‌ల్లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌పై 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించిన ఆర్సీబీ.. రెండో డ‌బ్ల్యూపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది. ఈ ఫైన‌ల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది.

కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ కేవలం 37 బంతుల్లో 57 పరుగులు చేసి టాప్ స్కోర‌ర్‌గా నిలిచారు. ఆమెతో పాటు లారా వోల్వార్డ్(25 బంతుల్లో 44 పరుగులు),  చినెల్ హెన్రీ(15 బంతుల్లోనే 35) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో అరుంధ‌తి, స‌త్ఘ‌రే, న‌డైన్ డిక్లార్క్ త‌లా వికెట్ సాధించారు.

మంధాన మెరుపులు, వోల్ విధ్వంసం
అనంత‌రం 204 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఆర్సీబీ కేవ‌లం 4 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి 19.4 ఓవ‌ర్ల‌లో చేధించింది. ఓపెన‌ర్ గ్రేస్ హ్యారిస్ త్వ‌ర‌గా ఔటైన‌ప్ప‌టికి కెప్టెన్ స్మృతి మంధాన(41 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లతో 87),జార్జియా వోల్  (53 బంతుల్లో 79) విధ్వంసం సృష్టించారు.

వారిద్దరూ ఢిల్లీ బౌలర్లను ఉతికారేశారు. వడోదర మైదానంలో బౌండరీల వర్షం కురిపించారు. స్మృతి-వాల్ జోడీ రెండో వికెట్‌కు 165 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి తమ జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. అయితే వరుస క్రమంలో వాల్‌, రిచా ఘోష్‌, మంధాన వికెట్లు తీయడంతో ఢిల్లీ తిరిగి గేమ్‌లోకి వచ్చింది.

కానీ 19 ఓవర్‌లో రాదా యాదవ్‌ ఇచ్చిన క్యాచ్‌ను మిన్ను మణి జారవిడిచింది. ఇందుకు ఢిల్లీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. చివరి ఓవర్‌లో ఆర్సీబీ విజయానికి 9 పరుగుల అవసరమవ్వగా రాదా యాదవ్‌ వరుసగా రెండు ఫోర్లు బాది తన జట్టును ఛాంపియన్‌గా నిలిపింది. కాగా ఢిల్లీ ఫైనల్‌లో ఓడిపోవడం ఇది వరుసగా నాలుగో సారి కావడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement