బెంగళూరుకే పట్టం | RCB beat Delhi Capitals by 6 wickets in WPL final | Sakshi
Sakshi News home page

బెంగళూరుకే పట్టం

Feb 6 2026 4:11 AM | Updated on Feb 6 2026 10:11 AM

RCB beat Delhi Capitals by 6 wickets in WPL final

రెండోసారి డబ్ల్యూపీఎల్‌ టైటిల్‌ సొంతం 

204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఆర్‌సీబీ

స్మృతి, వోల్‌ మెరుపులు 

వరుసగా నాలుగోసారి ఫైనల్లో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్‌

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచి అందరికంటే ముందే ‘ప్లేఆఫ్స్‌’ చేరి నేరుగా ఫైనల్‌కూ అర్హత పొందింది. ఫైనల్లో  ఢిల్లీని ఓడించి మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో రెండు ట్రోఫీలు సాధించిన ముంబై ఇండియన్స్‌ సరసన నిలిచింది.  

వడోదర: అయ్యో... ఢిల్లీ! నాలుగోసారి ఫైనల్‌ చేరినా... మళ్లీ రన్నరప్‌ గానే ముగించింది. ముంబై (2023, 2025), బెంగళూరు (2024, 2026) జట్లకు రెండేసి సార్లు టైటిల్‌ను అప్పగించింది.  గురువారం జరిగిన డబ్ల్యూపీఎల్‌ ఫైనల్లో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై జయభేరి మోగించింది. విజేత ఆర్‌సీబీ జట్టుకు రూ. 6 కోట్లు... రన్నరప్‌ ఢిల్లీ జట్టుకు రూ. 3 కోట్లు ప్రైజ్‌మనీ లభించింది. 

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్  జెమీమా రోడ్రిగ్స్‌ (37 బంతుల్లో 57; 8 ఫోర్లు), లౌరా వోల్‌వార్ట్‌ (25 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు రాణించారు. ఆఖర్లో షినెల్‌ హెన్రీ (15 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగింది. 

తర్వాత బెంగళూరు కఠినమైన లక్ష్యాన్ని సైతం 19.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 204 పరుగులతో ఛేదించింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కెప్టెన్  స్మృతి మంధాన (41 బంతుల్లో 87; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), జార్జియా (54 బంతుల్లో 79; 14 ఫోర్లు) దంచేశారు. 

రెండు ఓవర్లలో 39 పరుగులు...
ఢిల్లీ టాప్‌–4 బ్యాటర్లు లిజెల్లీ లీ (30 బంతుల్లో 37; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), షఫాలీ వర్మ (13 బంతుల్లో 20; 3 ఫోర్లు), వోల్‌వార్ట్, జెమీమా సమష్టిగా పరుగులు సాధించారు. దీంతో 18 ఓవర్లలో 164/3 స్కోరు చేసింది. డిక్లెర్క్‌ వేసిన 19వ ఓవర్లో షినెల్‌ హెన్రీ  4, వైడ్, 4, 4, 4, 6, 1 ఇలా బంతిని పదేపదే బౌండరీ లైన్‌ దాటించడంతో 24 పరుగులు వచ్చాయి. తర్వాత ఆఖరి ఓవర్‌ వేసిన సయాలీ 6, 4తో కలిసి 15 పరుగులు సమర్పించుకుంది. ఈ రెండు ఓవర్లలోనే 39 పరుగులతో ఢిల్లీ 200 పైచిలుకు స్కోరు చేసింది. 

శుభారంభం దక్కకున్నా... 
ఆరంభంలోనే హిట్టర్‌ గ్రేస్‌ హారిస్‌ (9) వికెట్‌ను కోల్పోయినా... స్మృతి, వోల్‌ల ధనాధన్‌ షో ఢిల్లీ ఆశల సౌధాన్ని కూల్చేసింది. 37 బంతుల్లో వోల్, 23 బంతుల్లో కెపె్టన్‌ స్మృతి పూర్తి చేసుకున్న ఫిఫ్టీలు బెంగళూరును సాఫీగా లక్ష్యంవైపు నడిపించాయి. ఆఖర్లో వీళ్లిద్దరితో పాటు రిచా (6) అవుటైనా... ఎలాంటి డ్రామా లేకుండా, రాధ యాదవ్‌ (12 నాటౌట్‌; 2 ఫోర్లు) బౌండరీలతో ముగించింది.  243 పరుగులు సాధించిన స్మృతి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా నిలిచింది.

స్కోరు వివరాలు 
ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: లిజెల్లీ (సి) హ్యారిస్‌ (బి) డిక్లెర్క్‌ 37; షఫాలీ (సి) రిచా ఘోష్‌ (బి) అరుంధతి 20; వోల్‌వార్ట్‌ (రనౌట్‌) 44; జెమీమా (సి) డిక్లెర్క్‌ (బి) సయాలీ 57; షినెల్‌ హెన్రీ (నాటౌట్‌) 35; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–49, 2–72, 3–148, 4–203. బౌలింగ్‌: బెల్‌ 4–0–19–0, సయాలీ 4–0–46–1, అరుంధతి 4–0–40–1, శ్రేయాంక 2–0–32–0, డిక్లెర్క్‌ 4–0–48–1, రాధ 2–0–18–0.  

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: హారిస్‌ (బి) హెన్రీ 9; స్మృతి (బి) హెన్రీ 87; జార్జియా వోల్‌ (సి) షఫాలీ (బి) మిన్ను మణి 79; రిచా ఘోష్‌ (సి) మిన్ను మణి (బి) నందిని 6; డిక్లెర్క్‌ (నాటౌట్‌) 7; రాధ (నాటౌట్‌) 12; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (19.4 ఓవర్లలో 4 వికెట్లకు) 204. వికెట్ల పతనం: 1–9, 2–174, 3–181, 4–191. బౌలింగ్‌: మరిజాన్‌ కాప్‌ 4–0–38–0, షినెల్‌ హెన్రీ 4–0–34–2, నందిని 4–0–41–1, శ్రీచరణి 3.4–0–46–0, షఫాలీ 1–0–9–0, మిన్ను మణి 2–0–19–1, స్నేహ్‌ రాణా 1–0–15–0.

Advertisement
 
Advertisement
Advertisement