టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇప్పటికే తమ జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో పదిహేను మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో నలుగురు ఆల్‌రౌండర్లకు చోటు దక్కింది.
పేస్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యా, శివం దూబే.. స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. వీరికి తోడు టాపార్డర్‌లో ఉన్న ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma), తిలక్ వర్మ (Tilak Varma) .. లోయర్ ఆర్డర్‌లో రింకూ సింగ్ కూడా అవసరమైన వేళ బౌలింగ్‌పరంగానూ సేవలు అందించగలరు.
ఇటీవల సౌతాఫ్రికాతో స్వదేశంలో ముగిసిన టీ20 సిరీస్‌లో ఫినిషర్‌గా సత్తా చాటిన జితేశ్ శర్మకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. మరి వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియాకు ఉన్న ఫినిషింగ్ ఆప్షన్లు ఏవి?
రింకూ సింగ్
ఐపీఎల్‌లో సత్తా చాటి టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే రింకూ.. నయా ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు. లోయర్ ఆర్డర్‌లో ధనాధన్ దంచికొట్టడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. ఐపీఎల్-2023లో కేకేఆర్ తరఫున గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో యశ్ దయాళ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదడం ఇందుకు ఉదాహరణ.
ఇటీవల సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ ఆడిన జట్టులో రింకూకు చోటే లేదు. అయితే, ఫినిషర్‌గా అతడు సత్తా చాటగలడు కాబట్టి ప్రపంచకప్ జట్టులో సెలక్టర్లు అతడికి స్థానం కల్పించారు. అయితే, తుదిజట్టులో చోటు కోసం అతడు ఎదురుచూడకతప్పదు. ఇప్పటికి టీమిండియా తరఫున 35 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 550 పరుగులు చేశాడు.
శివం దూబే
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడుతున్న శివం దూబే.. సాధారణంగా మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసేవాడు. అయితే, టీమిండియా హెడ్‌కోచ్‌గా గౌతం గంభీర్ వచ్చిన తర్వాత ఎక్కువగా లోయర్ ఆర్డర్‌లోనే అతడి సేవలను ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు.
ఇటీవలి కాలంలో ఈ ముంబై ఆల్‌రౌండర్ కేవలం బ్యాటింగ్‌కే పరిమితం కాకుండా.. స్లో మీడియం పేస్‌తో బౌలింగ్‌తోనూ సత్తా చాటుతున్నాడు. లోయర్ ఆర్డర్‌లో ఆల్‌రౌండర్‌గా శివం దూబే మంచి ఆప్షన్. ఇటీవల సౌతాఫ్రికాతో సిరీస్‌లో సత్తా చాటి ఫామ్‌లో ఉండటం అతడికి సానుకూలాంశం. తొలి రెండు మ్యాచ్‌లలో విఫలమైనా.. (11, 1, 10 నాటౌట్, 10 నాటౌట్, రెండు వికెట్లు) తర్వాత ఆఖర్లో మెరుపులు మెరిపించాడు.
హార్దిక్ పాండ్యా
పరిమిత ఓవర్ల క్రికెట్‌లో టీమిండియాకు నెంబర్ వన్ ఫినిషర్ అంటే ఠక్కున గుర్తుకువచ్చే పేరు హార్దిక్ పాండ్యా. గాయం నుంచి కోలుకుని.. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చిన ఈ ఆల్‌రౌండర్.. సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.
మూడు ఇన్నింగ్స్‌లోనే 142 పరుగులు సాధించాడు. ముఖ్యంగా సఫారీలతో ఆఖరి టీ20లో కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన హార్దిక్.. మొత్తంగా 25 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.
గతే ప్రపంచకప్-2024 టోర్నీలో టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో హార్దిక్ పాండ్యాదే కీలక పాత్ర. మూడు ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి 89 రన్స్ చేసిన పాండ్యా.. మొత్తంగా పదకొండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
ముఖ్యంగా సౌతాఫ్రికాతో ఫైనల్లో అద్భుత ప్రదర్శన (3/20) కనబరిచాడు. ఈసారి కూడా ఫినిషర్‌గా హార్దిక్ పాండ్యానే ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్ అనడంలో సందేహం లేదు. ఇక పై ముగ్గురు పిచ్, మ్యాచ్ పరిస్థితులను బట్టి ఐదు నుంచి ఏడో స్థానంలో బరిలోకి దిగుతారు.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, రింకూ సింగ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్).
చదవండి: IND vs NZ: భారత్‌తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం!


