న్యూజిలాండ్ పురుషల క్రికెట్ జట్టు వచ్చే ఏడాది జనవరిలో భారత పర్యటనకు రానుంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లో కివీస్ తలపడనుంది. తొలుత వన్డే సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియాతో వన్డే సిరీస్‌కు విలియమ్సన్‌ను దూరంగా ఉండనున్నాడు.
సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడేందుకు కేన్ ఇప్పటికే డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ లీగ్ డిసెంబర్ 26 నుండి జనవరి 26 వరకు జరగనుంది. ఈ లీగ్ కారణంగానే అతడు భారత్‌తో జరిగే వన్డేలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ జనవరి 11న ప్రారంభమై.. జనవరి 18న ముగియనుంది.
ఇప్పటికే అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విలియమ్సన్.. ప్రస్తుతం వన్డే, టెస్టు ఫార్మాట్‌లలోనే కొనసాగుతున్నాడు. సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కూడా వదులుకున్నాడు. ఎక్కవగా కుటంబంతో సమయం గడిపేందుకే కేన్ మామ ప్రాధాన్యత ఇస్తున్నాడు.
గత నెలలలో వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు కూడా అతడు దూరమయ్యాడు. కానీ ఈ కివీ మాజీ కెప్టెన్ విండీస్‌తో టెస్టు సిరీస్‌లో మాత్రం మాడాడు. మౌంట్‌మంగనూయ్ వేదికగా విండీస్-న్యూజిలాండ్ మూడో టెస్టు ముగిసిన అనంతరం విలియమ్సన్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు.
"ఒక్కో సిరీస్‌కు కాస్త విరామం తీసుకుని మళ్లీ జాతీయ జట్టుకు ఆడుతాను. నా కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాను. ముఖ్యంగా పిల్లలతో గడపడం నాకు చాలా ముఖ్యం. అయితే క్రికెట్ పట్ల నాకున్న మక్కువ ఇసుమంత కూడా తగ్గలేదు. కానీ నా వ్యక్తిగత జీవితాన్ని, నా ప్రొపిషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నా" అని విలియమ్సన్ పేర్కొన్నాడు. ఐపీఎల్-2026 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) జట్టుకు వ్యూహాత్మక సలహాదారుగా కేన్ వ్యవహరించనున్నాడు.


