టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు వికెట్ కీపర్ ఎవరు? సంజు శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా? అన్న ప్రశ్నలు క్రికెట్ అభిమానుల్లో ఉత్పన్నమవుతున్నాయి. శాంసన్ పేలవ ఫామే ఇందుకు ప్రధాన కారణం. ఈ మెగా టోర్నీ సన్నాహాల్లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో శాంసన్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.
ఈ సిరీస్ మొత్తంగా అతడు కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో తిలక్ వర్మ తుది జట్టులోకి సంజూపై వేటు పడడం ఖాయమన్పిస్తోంది. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్ భారత ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశముంది. తిలక్ యధావిధిగా మూడో స్థానంలో బరిలోకి దిగనున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన ఇషాన్ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు.
తిరువనంతపురం వేదికగా కివీస్‌తో జరిగిన ఐదో టీ20లో ఇషాన్ సెంచరీతో మెరిశాడు. అంతకుముందు మ్యాచ్‌లలో కూడా విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. దీంతో అతడికి ఓపెనర్‌గా అవకాశమివ్వాలని చాలా మంది మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. అయితే ఆఖరి టీ20లో సంజు శాంసన్ జట్టులో ఉన్నప్పటికి ఇషాన్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడం అందరిని ఆశ్చర్యపరిచింది.
ఈ క్రమంలో సంజూ వరల్డ్‌కప్‌లో ఆడడం ఇక కష్టమేనన్న ఊహాగానాలు మొదలు అయ్యాయి. అయితే ఇదే విషయంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు. వికెట్ కీపింగ్ మార్పుపై తాము ముందే నిర్ణయం తీసుకున్నామని సూర్య చెప్పుకొచ్చాడు.
"తిలక్ వర్మ అందుబాటులో లేకపోవడంతో ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లకు ప్లేయింగ్ ఎలెవన్‌లో అవకాశం దక్కింది. అయితే కీపింగ్ బాధ్యతలను పంచుకోవడం సిరీస్ ప్రారంభానికి ముందే నిర్ణయించాము మొదటి మూడు మ్యాచ్‌లలో శాంసన్, చివరి రెండు మ్యాచ్‌లలో కిషన్‌కు వికెట్ కీపింగ్ చేసే అవకాశమివ్వాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది.
కానీ కిషన్ చిన్న గాయం కారణంగా నాలుగో టీ20లో ఆడలేదు, లేదంటే ఆ మ్యాచ్‌లో కూడా అతడే వికెట్ కీపింగ్ చేయాల్సింది ఉండేది. ఇప్పుడు కిషన్ తిరిగి రావడంతో వికెట్ల వెనక తన బాధ్యతలను నిర్వర్తించాడు" అని సూర్య మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు.
చదవండి: IND vs NZ: టీమిండియా వరల్డ్ రికార్డు


