ఫైన‌ల్లో ఇంగ్లండ్ చిత్తు.. వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్స్‌గా భార‌త్‌ | U19 World Cup 2026: India win 6th World Cup | Sakshi
Sakshi News home page

U19 World Cup: ఫైన‌ల్లో ఇంగ్లండ్ చిత్తు.. వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్స్‌గా భార‌త్‌

Feb 6 2026 8:32 PM | Updated on Feb 6 2026 9:55 PM

U19 World Cup 2026: India win 6th World Cup

అండర్-19 ప్రపంచకప్ 2026 విజేత‌గా భార‌త్ నిలిచింది. జింబాబ్వేలోని హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను 100 ప‌రుగుల తేడాతో ఓడించిన యువ భార‌త్.. ఆరో వ‌ర‌ల్డ్‌క‌ప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ తుది పోరులో మొద‌ట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల నష్టానికి 411 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది.

భార‌త యువ సంచ‌ల‌నం వైభ‌వ్ సూర్య‌వంశీ ఈ టోర్నీ చ‌రిత్ర‌లో చిర‌స్మ‌ర‌ణీయంగా నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. 14 ఏళ్ల వైభ‌వ్ త‌న బ్యాటింగ్‌తో విధ్వంసం సృష్టించాడు. కేవలం 80 బంతుల్లో 175 పరుగులు (15 ఫోర్లు, 15 సిక్సర్లు) చేసి ఫైనల్ మ్యాచ్ చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అత‌డితో పాటు కెప్టెన్ అయూశ్ మాత్రే(53), కనిష్క్ చౌహాన్ (37) రాణించారు.  ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో జేమ్స్ మింటో మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ త‌లా రెండు వికెట్లు సాధించారు.

ఫాల్కనర్ విరోచిత పోరాటం..
అనంత‌రం భారీ ల‌క్ష్య చేధించేందుకు బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్ 40.2 ఓవ‌ర్ల‌లో 311 ప‌రుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బ్యాట‌ర్ల‌లో కాలేబ్ ఫాల్కనర్ వీరోచిత పోరాటం క‌న‌బ‌రిచాడు. ఓవైపు క్ర‌మం త‌ప్పుకొండా వికెట్లు ప‌డుతున్న‌ప్ప‌టికి  ఫాల్కనర్ మాత్రం త‌న ప్ర‌య‌త్నం ఆప‌లేదు. ఫాల్కనర్ బంతుల్లో 115 పరుగులు చేసి చివ‌రి వికెట్‌గా వెనుదిరిగాడు.

అత‌డితో పాటు బెన్ డాకిన్స్ (66),థామస్ రెవ్(31) త‌మ వంతు ప్ర‌య‌త్నం చేశారు. మిగితా బ్యాట‌ర్లు మొత్తం దారుణంగా విఫ‌ల‌మ‌య్యారు. భార‌త బౌల‌ర్ల‌లో ఆర్‌ఎస్ అంబరీష్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. కనిష్క్ చౌహాన్, దీపేష్ దేవేంద్రన్ త‌లా రెండు వికెట్లు సాధించారు. ఫైన‌ల్లో భారీ సెంచ‌రీతో చెల‌రేగిన వైభ‌వ్ ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.

Advertisement
 
Advertisement
Advertisement