క్వార్టర్‌ ఫైనల్లో కథ ముగిసె! | Indian badminton teams were defeated by China and Korea | Sakshi
Sakshi News home page

క్వార్టర్‌ ఫైనల్లో కథ ముగిసె!

Feb 7 2026 4:24 AM | Updated on Feb 7 2026 4:24 AM

Indian badminton teams were defeated by China and Korea

చైనా, కొరియా చేతిలో ఓడిన భారత బ్యాడ్మింటన్‌ జట్లు  

కింగ్డావ్‌ (చైనా): ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ నుంచి భారత పురుషుల, మహిళల జట్లు రిక్తహస్తాలతో వెనుదిరిగాయి. కనీసం కాంస్య పతకం ఖరారు కావాలంటే దాటాల్సిన క్వార్టర్‌ ఫైనల్‌ అడ్డంకిని అధిగమించడంలో భారత జట్లు విఫలమయ్యాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత మహిళల జట్టు 0–3తో చైనా జట్టు చేతిలో... భారత పురుషుల జట్టు 1–3తో దక్షిణ కొరియా జట్టు చేతిలో ఓడిపోయాయి. 

2024లో తొలిసారి ఆసియా చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించిన భారత మహిళల జట్టు ఈసారి మాత్రం పీవీ సింధు గైర్హాజరీలో నిరాశాజనక ప్రదర్శన చేసింది. చైనాతో జరిగిన పోరులో తొలి మ్యాచ్‌లో ప్రపంచ 42వ ర్యాంకర్‌ తన్వీ శర్మ 9–21, 9–21తో ప్రపంచ పదో ర్యాంకర్‌ గావో ఫాంగ్‌ జియె చేతిలో ఓడిపోయింది. రెండో మ్యాచ్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ ద్వయం 22–24, 18–21తో జియా యి ఫాన్‌–జాంగ్‌ షు జియాన్‌ జంట చేతిలో ఓటమి పాలైంది. మూడో మ్యాచ్‌లో రక్షిత శ్రీ 14–21, 21–15, 17–21తో జు వెన్‌ జింగ్‌ చేతిలో పరాజయం చవిచూసింది.  

లక్ష్య సేన్, సాత్విక్‌ లేకుండా... 
దక్షిణ కొరియాతో జరిగిన క్వార్టర్‌ ఫైనల్లో భారత స్టార్స్‌ లక్ష్య సేన్, సాత్విక్‌ సాయిరాజ్‌– బరిలోకి దిగలేదు. లక్ష్య సేన్‌ వెన్నునొప్పితో బాధపడుతుండగా... తన తండ్రి సంవత్సరీకం కారణంగా సాత్విక్‌ స్వదేశానికి వెళ్లిపోయాడు. తొలి మ్యాచ్‌లో ఆయుశ్‌ శెట్టి 21–18, 14–21, 24–26తో యూ టే బిన్‌ చేతిలో ఓడిపోయాడు. రెండో మ్యాచ్‌లో హరిహరన్‌–చిరాగ్‌ శెట్టి ద్వయం 11–21, 13–21తో సాంగ్‌ హున్‌ చో–కిమ్‌ వన్‌ హో జంట చేతిలో ఓటమి పాలైంది. 

మూడో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్‌ 21–15, 21–16తో చోయ్‌ జిహూన్‌పై గెలుపొందాడు. నాలుగో మ్యాచ్‌లో పృథ్వీ–సాయిప్రతీక్‌ జోడీ 11–21, 16–21తో జిన్‌ యోంగ్‌–కి డాంగ్‌ జు ద్వయం చేతిలో పరాజయం పాలైంది. ఫలితం తేలిపోవడంతో ఐదో మ్యాచ్‌ను నిర్వహించలేదు. ఇతర క్వార్టర్‌ ఫైనల్స్‌లో చైనా 3–1తో చైనీస్‌ తైపీపై; జపాన్‌ 3–0తో మలేసియాపై, ఇండోనేసియా 3–2తో థాయ్‌లాండ్‌ జట్టుపై గెలిచి సెమీఫైనల్‌ చేరుకున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement