'పది'oతల విధ్వంసానికి ‘సై’ | The T20 World Cup starts from today | Sakshi
Sakshi News home page

'పది'oతల విధ్వంసానికి ‘సై’

Feb 7 2026 4:12 AM | Updated on Feb 7 2026 4:16 AM

The T20 World Cup starts from today

నేటి నుంచి టి20 ప్రపంచకప్‌

హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్‌ మిల్లర్‌ కొట్టిన భారీ షాట్‌... సిక్స్‌గా మారిందనుకున్న క్షణాన వైడ్‌ లాంగాన్‌ నుంచి అనూహ్యంగా దూసుకొచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌... అసాధారణ రీతిలో బౌండరీ గీత అంచున గాల్లోకి ఎగిరి అందుకున్న క్యాచ్‌ భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టింది... ఈ ఘట్టం ఇంకా సగటు అభిమానుల కళ్లల్లో మెదులుతుండగానే మరో టి20 ప్రపంచ కప్‌ వచ్చేసింది... నాడు హీరోగా నిలిచిన సూర్యకుమార్‌  నేడు నాయకుడిగా జట్టును నడిపిస్తున్నాడు... 

జూన్‌ 29, 2024 గత టి20 ప్రపంచకప్‌లో భారత్‌ విజేతగా నిలిచిన రోజు... కాగా ఫిబ్రవరి 7, 2026న తాజా టి20 ప్రపంచకప్‌లో భారత్‌ తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల మధ్య విరామం 588 రోజులు... ఇన్ని రోజుల్లో తేదీ మాత్రమే మారింది... భారత్‌ ఆటలో దూకుడు, గెలుపు బాట ఏమాత్రం మారకుండా సేమ్‌ టు సేమ్‌... అద్భుత ఫామ్‌తో టైటిల్‌ నిలబెట్టుకొని చరిత్ర సృష్టించేందుకు, సొంతగడ్డపై సత్తా చాటేందుకు టీమిండియా సిద్ధమైంది.

రెండేళ్లు కూడా పూర్తి కాకముందే ఇరవై నెలలకే మళ్లీ ‘ప్రపంచకప్‌’ రావడం కొంత ఆసక్తిని తగ్గించడం సహజమే అయినా పోటీ విషయంలో ఏ జట్టూ తక్కువ కాదు అంటూ సమరానికి ‘సై అంటున్నాయి. బిగ్‌బాష్‌లో చెలరేగిన కుర్రాళ్లతో ఆ్రస్టేలియా రెండో టైటిల్‌ కోసం సన్నద్ధమై రాగా, టి20 స్పెషలిస్ట్‌లతో ఇంగ్లండ్‌ తమ మూడో ట్రోఫీని అందుకోవాలని పట్టుదలగా ఉంది. మరో మాజీ చాంపియన్‌ వెస్టిండీస్‌ కూడా మూడో టైటిల్‌ అందుకొని ఈ ఫార్మాట్‌లోనైనా తమ స్థాయిని ప్రదర్శించాలని భావిస్తుండగా, సహ ఆతిథ్య జట్టుగా దక్కిన అవకాశాన్ని వాడుకోవాలని శ్రీలంక ఆశిస్తోంది. 

వివాదాల పాకిస్తాన్‌ రెండో ట్రోఫీని అందుకోగలదా అనే చర్చ సాగుతుండగా, ఒక్క వరల్డ్‌ కప్‌ వేటలో న్యూజిలాండ్‌ తమ పోరాటాన్ని కొనసాగించాలని సన్నద్ధమైంది. క్రితంసారి చేజారిన ట్రోఫీని ఈసారైనా దక్షిణాఫ్రికా గెలుచుకోగలదా చూడాలి. బంగ్లాదేశ్‌ నిష్క్రమించిన చోట ఇతర చిన్న జట్లు ఏమాత్రం ప్రభావం చూపిస్తాయనేది ఆసక్తికరం.   

ముంబై: టి20 ఫార్మాట్‌లో పదో ప్రపంచ కప్‌కు సమయం ఆసన్నమైంది. భారత్, శ్రీలంక ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీకి నేడు తెర లేవనుంది. తొలి రోజు మూడు వేర్వేరు వేదికల్లో మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. గత టోర్నీ తరహాలోనే 20 జట్లు ఇందులో బరిలోకి దిగుతున్నాయి. 30 రోజుల్లో 55 మ్యాచ్‌ల పాటు ఈ ధనాధన్‌ వినోదం సాగుతుంది. ఇటలీ జట్టు తొలిసారి అర్హత సాధించగా... భద్రతా కారణాలరీత్యా భారత్‌లో ఆడలేమంటూ బంగ్లాదేశ్‌ టోర్నీ నుంచి వైదొలిగింది. మార్చి 8న అహ్మదాబాద్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహిస్తారు. 

భారత్‌లో ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తున్నాయి. శ్రీలంకలో కొలంబో, పల్లెకెలె వేదికలుగా ఉన్నాయి. మొత్తం జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌ నుంచి టాప్‌–2 టీమ్‌లు ‘సూపర్‌–8’ దశకు క్వాలిఫై అవుతాయి. ‘సూపర్‌–8’లోని రెండు గ్రూప్‌ల నుంచి రెండేసి జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఆ తర్వాత ఫైనల్‌ జరుగుతుంది.  తొలి రోజు మూడు మ్యాచ్‌లు జరుగుతాయి. కొలంబోలో నెదర్లాండ్స్‌తో పాకిస్తాన్‌ (ఉదయం 11 గంటల నుంచి), కోల్‌కతాలో వెస్టిండీస్‌తో స్కాట్లాండ్‌ (మధ్యాహ్నం 3 గంటల నుంచి) తలపడతాయి. 

భారత్, పాకిస్తాన్‌ మధ్య మ్యాచ్‌ లేదు! 
ఐసీసీ టోర్నీలో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసే భారత్, పాకిస్తాన్‌ మ్యాచ్‌ ఈసారి లీగ్‌ దశలో ఉండటం లేదు. భారత్‌తో మ్యాచ్‌ ఆడరాదని పాక్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. మ్యాచ్‌ తేదీ సమయానికి ఏదైనా అనూహ్యం సంభవిస్తే తప్ప మ్యాచ్‌ జరిగే అవకాశం లేదు. ఈ రెండు టీమ్‌లు నాకౌట్‌లో ఆడాల్సి వస్తే ఏమిటనేది కూడా ఆసక్తికరం. టి20 వరల్డ్‌ కప్‌లో 2009, 2010 మినహా... 2007లో రెండు మ్యాచ్‌లతో పాటు గత ఆరు వరుస వరల్డ్‌ కప్‌లలో ఇరు జట్లు తలపడ్డాయి.  

భారీ విజయంపై భారత్‌ దృష్టి
నేడు అమెరికాతో తొలి పోరు
ముంబై: ఆడిన 41 మ్యాచ్‌లలో 31 విజయాలు, 6 పరాజయాలు మాత్రమే... 2 మ్యాచ్‌లు ‘టై’ కాగా వాటిలో కూడా ‘సూపర్‌ ఓవర్‌’ గెలుపుతో కలిపి మొత్తం విజయాల సంఖ్య చూస్తే 33.. మొత్తం 9 సిరీస్‌లు ఆడితే అన్నింటిలోనూ విజేత... గత టి20 వరల్డ్‌ కప్‌లో విజయం సాధించిన తర్వాత భారత జట్టు అసాధారణ రికార్డు ఇది. ఇలాంటి స్థితిలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా టీమిండియా మళ్లీ తమ జైత్రయాత్రకు సిద్ధమైంది. 

వాంఖెడే మైదానంలో జరిగే తమ తొలి పోరులో అమెరికాతో భారత్‌ తలపడనుంది. బలాబలాలపరంగా  ఇరు జట్ల మధ్య ఉన్న అంతరాన్ని చూస్తే ఫలితం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. మ్యాచ్‌ విన్నర్లతో నిండిన సూర్యకుమార్‌ బృందం తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే సునాయాస విజయం ఖాయం. గత టోర్నీలో పాక్‌ను ఓడించి సంచలనం సృష్టించిన అమెరికా ఈ సారి మరింత మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని భావిస్తోంది. 

2024లో భారత్‌ 7 వికెట్ల తేడాతో అమెరికాను అలవోకగా ఓడించింది. గాయంతో భారత బౌలర్‌ హర్షిత్‌ రాణా టోర్నీకి దూరం కాగా... అతని స్థానంలో హైదరాబాద్‌ స్పీడ్‌స్టర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌కు భారత జట్టులో చోటు దక్కింది.

ఏ గ్రూప్‌లో ఎవరెవరు...
గ్రూప్‌ ‘ఎ’: భారత్, పాకిస్తాన్, నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్‌ఏ. 
గ్రూప్‌ ‘బి’: ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్‌. 
గ్రూప్‌ ‘సి’: ఇంగ్లండ్, వెస్టిండీస్, స్కాట్లాండ్, నేపాల్, ఇటలీ. 
గ్రూప్‌ ‘డి’: దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, కెనడా, యూఏఈ. 

సూపర్‌–8 గ్రూప్, సీడింగ్స్‌ వివరాలు 
గ్రూప్‌–1: భారత్‌ (ఎక్స్‌1), ఆస్ట్రేలియా (ఎక్స్‌2), వెస్టిండీస్‌ (ఎక్స్‌3), దక్షిణాఫ్రికా (ఎక్స్‌4). 
గ్రూప్‌–2: ఇంగ్లండ్‌ (వై1), న్యూజిలాండ్‌ (వై2), పాకిస్తాన్‌ (వై3), శ్రీలంక (వై4).  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement