మా ప్రయాణం అద్భుతం ఒలింపిక్‌ పతకమే లక్ష్యం | Indian star badminton pair Pullela Gayatri Teresa Jolly story | Sakshi
Sakshi News home page

మా ప్రయాణం అద్భుతం ఒలింపిక్‌ పతకమే లక్ష్యం

May 4 2025 1:28 AM | Updated on May 4 2025 1:28 AM

Indian star badminton pair Pullela Gayatri Teresa Jolly story

భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ జోడీ పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ మనోగతం  

భారత బ్యాడ్మింటన్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడీ రాటుదేలుతూ వస్తోంది. గతేడాది పారిస్‌ ఒలింపిక్స్‌ అవకాశం తృటిలో కోల్పోయినా... ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌–10లోకి దూసుకొచ్చింది. 9వ ర్యాంకుతో ఈ ఘనతకెక్కిన తొలి భారత మహిళల జంటగా నిలిచింది. బిజీగా గడిచిన గత సీజన్‌లో విజయాలు ఆత్మవిశ్వాసాన్ని పెంచితే... వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ లాంటి మేజర్‌ టోర్నీలు పాఠాలు నేర్పాయని ఇద్దరు చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఇద్దరు తాము జోడీకట్టిన తీరు నుంచి విజయాలు, సాఫల్యాల దాకా తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు.  

2021లో మొదలైన మీ ప్రయాణం ఎలా సాగుతోంది? 
గాయత్రి: మొదట్లో నేను సింగిల్స్‌ ఆడేదాన్ని. కానీ డబుల్స్‌ అయితే ఇంకా బాగా ఆడతాననిపించింది. దీంతో ట్రెసాతో జోడీ కట్టాను. నేను అనుకున్నట్లుగానే కొన్ని టోర్నీల్లోనే డబుల్స్‌లో రాణించగలగడం మరింత ఆనందాన్నిచ్చింది. తర్వాత ఏడాదే ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షిప్‌ (2022) ఆడి సెమీస్‌ చేరాం. అలాంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఇంత త్వరగా ఆడతామనుకోలేదు. అక్కడి నుంచే మా జోడీ మరింత బలపడింది. మా పయనం అద్భుతంగా సాగుతోంది. మేటి ప్రత్యర్థులతో ఎన్నో మ్యాచ్‌లు గెలిచాం. ఎంతో నేర్చుకున్నాం. 
ట్రెసా: 2021లో మేమిద్దరం కలిసి ఆడటం మొదలుపెట్టాం. అప్పటినుంచే గాయత్రి గురించి తెలుసుకున్నాను. కోర్టులో జోడీగా, కోర్టు బయట స్నేహితులుగా మా బంధం పటిష్టమైంది. ఆటలోనే కాదు... అవసరమైన ప్రతీసారి నాకు చాలా మద్దతుగా నిలుస్తుంది. నాకు ఏదైనా సాయం అవసరమైనా గాయత్రి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. 

గతేడాది సాధించిన సయ్యద్‌ మోడి టైటిల్‌ ఎలాంటి సంతృప్తినిచ్చింది? 
గాయత్రి: బీడబ్ల్యూఎఫ్‌ సర్క్యూట్‌లో భాగమైన సయ్యద్‌ మోడి టైటిల్‌ను సాధించేవరకు తెలియదు... మేమే ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళల జోడీ అని! అందుకే ఆ విజయం ఎప్పటికీ ప్రత్యేకమైంది. దేశానికి ట్రోఫీ తెచ్చిపెట్టడం గొప్ప అనుభూతినిచ్చింది. ఆ విజయానందంలో మేమిద్దరం భావోద్వేగానికి గురయ్యాం. అది ఇప్పటికీ గుర్తుంది. 
ట్రెసా: ఇలాంటి మేజర్‌ టోర్నీ టైటిల్స్‌ గెలుపొందాలన్నదే మా ఉమ్మడి కల. ఫైనల్లో గెలిచి... పోడియంపై నిలిచి... గర్వంగా బంగారు పతకాల్ని అందుకోవడం మంచి అనుభూతినిచి్చంది. ఇలాంటి సంతోషాన్ని మాటల్లో చెప్పలేం. 

పారిస్‌ ఒలింపిక్స్‌ అవకాశాన్ని కోల్పోయిన మీరు లాస్‌ ఏంజెలిస్‌ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారు? 
గాయత్రి: పారిస్‌ ఛాన్స్‌ చేజార్చుకోవడంతోనే మా ఒలింపిక్స్‌ కల అంతమవలేదు. మా మనోధైర్యం కోల్పోలేదు. తదుపరి లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌ రూపంలో మరో అవకాశముంది. మరింత కష్టపడతాం. ప్రతి టోర్నీని అనుకూలంగా మలచుకుంటాం. ఒక్క ఒలింపిక్సే టోర్నమెంట్‌ కాదు. ఎన్నో ముఖ్యమైన టోర్నీలూ ఉన్నాయి. అన్నింటా సత్తా చాటడమే మా లక్ష్యం.  
ట్రెసా: అవును... ఆ ఒలింపిక్స్‌కు దూరమయ్యాం. మేం అర్హత సాధించలేకపోవడం మమ్మల్ని నిరాశపరిచింది. కానీ వచ్చే ఒలింపిక్స్‌ కోసం ఇప్పటినుంచే శ్రమిస్తాం. ప్రతి క్యాలెండర్‌ ఇయర్‌లోని టోర్నీలన్నీ ఆడటం ద్వారా ర్యాంకింగ్‌కు మెరుగుపర్చుకొని అర్హత సాధిస్తాం. 

గతేడాది బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీ అనుభవం గురించి చెబుతారా? 
గాయత్రి: హాంగ్జౌలో జరిగిన ఈ టోర్నీలో తొలి పోరులో చైనాకు చెందిన లియు–తన్‌ జంటను ఎదుర్కొన్న మాకు పరాజయం తప్పలేదు. అయితే రెండో మ్యాచ్‌లో మలేసియన్‌ జోడీ పిర్లి తన్‌–తినాలపై గెలుపొందడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. కానీ మూడో మ్యాచ్‌లో నమీ మత్సుయమ–చిహరు షిదా (జపాన్‌) జోడీ చేతిలో ఓడటంతో ముందుకెళ్లే అవకాశాల్ని కోల్పోయాం. అయితే అనుభవ పాఠాలైతే నేర్చుకోగలిగాం. 
ట్రెసా: సీజన్‌ ముగింపు టోర్నీలో అంతా మేటి ప్రత్యర్థులే ఎదురవుతారు. రెడ్‌ మ్యాట్‌పై ఆడే మ్యాచ్‌ల్ని టీవీల్లో చూశాను. గతేడాది ప్రత్యక్షంగా ఆడాను. చైనాలోని స్టేడియాలు, మ్యాచ్‌లపై ఉండే అంచనాలు నిజంగా గొప్పగా ఉంటాయి. అక్కడ మేం ఆడిన మ్యాచ్‌లు, అనుభవం చాలా దోహదపడుతుందని అనుకుంటున్నా. 

గుత్తా జోడీ ర్యాంకింగ్‌ను అధిగమించడం ఎలా అనిపిస్తోంది?
గాయత్రి: గుత్తా జ్వాల–అశ్విని పొన్నప్పల 10వ ర్యాంకును అధిగమించిన భారత మహిళల ద్వయంగా నిలువడం చాలా ఆనందాన్నిచ్చింది. మొదట ఈ ర్యాంకు ఘనత తెలియదు. నిజానికి మా లక్ష్యం గుత్తా జోడీ ర్యాంకింగ్‌ను చెరిపేయడం కాదు. మేం టాప్‌–10లోకి దూసుకెళ్లడం. మొత్తానికి భారత మహిళల డబుల్స్‌లో ఇలా మెరుగైన ర్యాంకింగ్‌ సాధించడం మా శ్రమకు దక్కిన గుర్తింపుగా భావిస్తున్నాం. 
ట్రెసా: నిజానికి గత క్యాలెండర్‌ ఇయర్‌ చాలా బిజీగా గడిచింది. అందుకే కఠినమైన టోర్నీలను ఎంపిక చేసుకొని ఆడటం. విజయాలు సాధించడం వల్లే మా ర్యాంకుల్లో మెరుగుదల కనిపించింది. ఇలాంటి మైలురాళ్లు ఎవరికైనా ఆనందాన్నే ఇస్తాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement