
గచ్చిబౌలి: ఆటగాళ్లకు అభిమానులు అందించే ప్రోత్సాహం, ఉత్సాహం ఎంతో శక్తిని అందిస్తాయని, వీరి మధ్య అనుబంధం ఎప్పటికప్పుడు బలోపేతం అవుతూ ఉండాలని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్, అర్జున అవార్డ్ గ్రహీత పుల్లెల గోపీచంద్ అన్నారు. భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లను, అభిమానులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ‘ఫ్యాన్ లీ’ యాప్ ను గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శుక్రవారం సాయంత్రం ఆవిష్కరించారు.
ఈ డిజిటల్ యుగంలో క్రీడాకారులపై సానుకూల ప్రభావాన్ని చూపించే విధంగా అభిమానులకు ఆరోగ్యకరమైన సమాచారాన్ని అందించే డిజిటల్ వేదికల అవసరం ఎంతైనా ఉందన్నారు. ‘బ్యాడ్మింటన్ ఇండియా’ పేరుతో దేశంలోని అగ్రశ్రేణి ఆటగాళ్లు, యువ ప్రతిభావంతులు, అభిమానులను ఒకే డిజిటల్ వేదికపైకి తీసుకురావడం అనే ఆలోచనను అభినందించారు.
సోషల్ మీడియా యుగంలో ఆటగాళ్లతో అభిమానుల సత్సంబంధాలు ఉండాలని, ట్రోలింగ్స్ వంటివి దూరం కావాలని ఆకాంక్షించారు. ఈ ఆవిష్కరణలో ఫ్యాన్లీ సహ వ్యవస్థాపకులు శ్రీనివాసన్ బాబు, శరవణన్ కనగరాజు, శ్రీదేవి సిరాలతో పాటు రాష్ట్ర బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.