ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సంచలనం | Multiple new No.1s crowned in latest ICC Women's Rankings | Sakshi
Sakshi News home page

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో సంచలనం

Mar 4 2026 11:08 AM | Updated on Mar 4 2026 1:12 PM

Multiple new No.1s crowned in latest ICC Women's Rankings

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో సంచలనం చోటు చేసుకుంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ఒకేసారి టాప్‌ ర్యాంక్‌లు మారాయి. ఇలాంటి పరిణామం చాలా అరుదుగా జరుగుతుంది. సౌతాఫ్రికాకు చెందిన లారా వోల్వార్డ్ట్‌ను కిందకి దించి స్మృతి మంధన (భారత్‌).. ఇంగ్లండ్‌కు చెందిన సోఫి ఎక్లెస్టోన్‌ను కిందకి దించి అలానా కింగ్‌ (ఆస్ట్రేలియా) అగ్రపీఠాలను అధిరోహించారు.

తాజాగా జరిగిన భారత్‌-ఆసీస్‌ వన్డే సిరీస్‌లో ఈ ఇద్దరు అత్యుత్తమ ప్రదర్శనలు చేశారు. తద్వారా తమతమ విభాగాల్లో టాప్‌ ర్యాంక్‌కు చేరారు. బౌలింగ్‌ విభాగంలో నాలుగేళ్లు అగ్రపీఠంపై కూర్చున్న సోఫిని అలానా కింగ్‌ తాజా ప్రదర్శనలతో (3 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు) కిందికి దించింది. కింగ్‌తో పాటు టాప్‌-8లో మరో నలుగురు ఆసీస్‌ బౌలర్లు ఉన్నారు. ఆష్లే గార్డనర్‌ (3), అన్నాబెల్‌ సదర్‌ల్యాండ్‌ (5), మెగాన్‌ షట్‌ (7), కిమ్‌ గార్త్‌ (8) స్థానాల్లో నిలిచారు.

మంధన విషయానికొస్తే.. గత వారం ఆసీస్‌తో జరిగిన రెండు వన్డేల్లో ఆమె 58, 31 స్కోర్లతో రాణించింది. తద్వారా స్వల్ప తేడాతో వోల్వార్డ్ట్‌ను అధిగమించి టాప్‌ ర్యాంక్‌కు చేరింది. కెరీర్‌లో చివరి వన్డే (భారత్‌తో మూడో వన్డే) ఆడిన ఆలైస్సా హీలీ అద్భుతమైన సెంచరీ చేసి 2 స్థానాలు ఎగబాకి మూడో స్థానానికి, అదే మ్యాచ్‌లో సెంచరీ చేసిన బెత్‌ మూనీ కూడా 2 స్థానాలు ఎగబాకి నాలుగో స్థానానికి చేరుకుంది.

భారత్‌ నుంచి మంధనతో సహా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మాత్రమే టాప్‌-10లో చోటు దక్కించుకుంది. ఆసీస్‌ సిరీస్‌లో రాణించిన ఆమె నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని తొమ్మిదో స్థానానాకి ఎగబాకింది.

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో భారత్‌ నుంచి ఒక్క దీప్తి శర్మకు మాత్రమే అవకాశం దక్కింది. ఆమె కూడా ఐదు స్థానాలు కోల్పోయి పదో స్థానానికి పడిపోయింది. ఇటీవలి ఆసీస్‌ సిరీస్‌లో దీప్తి నామమాత్రపు ప్రదర్శనలు కూడా చేయలేక చతికిలపడింది. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లోనూ దీప్తి ఓ స్థానం కోల్పోయి ఐదో స్థానానికి పడిపోయింది. ఈ విభాగంలో ఆష్లే గార్డ్‌నర్‌ టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement